Let's talk: editor@tmv.in
శ్రీలంకలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్యం: తాజా జనాభా గణాంకాలు

శ్రీలంకలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్యం: తాజా జనాభా గణాంకాలు

Dantu Vijaya Lakshmi Prasanna
12 ఏప్రిల్, 2026

శ్రీలంక దేశం ప్రస్తుతం తీవ్రమైన జనాభా మార్పులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గత నాలుగు దశాబ్దాలలో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2024 నాటి తాజా జనాభా గణన నివేదిక ప్రకారం, శ్రీలంక జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి శాతం 1981లో కేవలం 6.6 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 18 శాతానికి చేరుకుంది. అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. సంఖ్యాపరంగా చూస్తే, 1981లో పది లక్షల కంటే తక్కువగా ఉన్న వృద్ధుల సంఖ్య, 2024 నాటికి 39,21,124కు పెరిగింది. ఈ గణాంకాలు శ్రీలంక సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు మళ్లుతోందని స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు, దేశంలో పిల్లల సంఖ్య (0-14 ఏళ్లు) క్రమంగా తగ్గుతూ 20.7 శాతానికి పడిపోయింది. దీనివల్ల "ఏజింగ్ ఇండెక్స్" (వృద్ధాప్య సూచిక) 87కు చేరుకుంది. అంటే ప్రతి 100 మంది పిల్లలకు దేశంలో 87 మంది వృద్ధులు ఉన్నారు. 2012లో జరిగిన జనాభా గణనతో పోలిస్తే, ప్రస్తుత మధ్యస్థ వయస్సు 5 ఏళ్లు పెరిగి 35 ఏళ్లకు చేరుకుంది. జనాభాలో వృద్ధుల శాతం పెరగడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రతపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణం. 1981లో 3.3 శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు 2024 నాటికి 1.8 శాతానికి పడిపోయింది. ఇది జనాభా స్థిరీకరణకు అవసరమైన కనిష్ట స్థాయి కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంక మొత్తం జనాభా 2,17,81,800 గా ఉంది. దేశ సగటు జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 350 మందిగా నమోదైంది. పశ్చిమ ప్రావిన్స్ ఇప్పటికీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా ఉంది, ఇక్కడ మొత్తం జనాభాలో 28.1 శాతం మంది నివసిస్తున్నారు.

లింగ నిష్పత్తి విషయానికి వస్తే, శ్రీలంకలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి 100 మంది స్త్రీలకు కేవలం 93.3 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. ఇది సామాజిక, ఆర్థిక రంగాలలో మహిళల పాత్ర, వారి దీర్ఘాయువును సూచిస్తోంది. అక్షరాస్యత ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడటం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం పెరగడం కూడా వృద్ధుల జనాభా పెరగడానికి ఒక కారణం కావచ్చు. అయితే యువశక్తి తగ్గడం ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

దేశంలోని జాతుల కూర్పును పరిశీలిస్తే, సింహళీయులు 74.1 శాతంతో మెజారిటీగా ఉన్నారు. ఆ తర్వాత తమిళులు 12.3 శాతం, ముస్లింలు 10.5 శాతంగా ఉన్నారు. మతపరంగా చూస్తే, బౌద్ధమతం 69.8 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, హిందూ మతం 12.6 శాతం, ఇస్లాం 10.5 శాతం, రోమన్ క్యాథలిక్ 5.6 శాతం, ఇతర మతాల వారు 1.5 శాతంగా ఉన్నారు. ఈ వైవిధ్యభరితమైన జనాభాలో మారుతున్న వయస్సు నిర్మాణం అన్ని వర్గాలపై ప్రభావం చూపుతుంది.

శ్రీలంక ఎదుర్కొంటున్న ఈ డెమోగ్రాఫిక్ మార్పులు ఆ దేశ విధానకర్తలకు సవాలుగా మారనున్నాయి. పెరిగిన వృద్ధుల జనాభాకు తగిన వైద్య సదుపాయాలు కల్పించడం, పెన్షన్ వ్యవస్థను బలోపేతం చేయడం, తగ్గుతున్న యువశక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం 40 ఏళ్ల వ్యవధిలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగడం అనేది ఆసియా ఖండంలోని ఇతర దేశాలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. పటిష్టమైన ప్రణాళికలు లేకపోతే భవిష్యత్తులో సామాజిక అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది.

శ్రీలంక విద్యా రంగంలో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2012లో 95.7 శాతంగా ఉన్న అక్షరాస్యత రేటు 2024 నాటికి 97.4 శాతానికి పెరిగింది. అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, 1881 తర్వాత తొలిసారిగా అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం దాదాపు తొలిగిపోయింది. ప్రస్తుతం పురుషుల అక్షరాస్యత 97.9 శాతంగా ఉండగా, మహిళలు 97.0 శాతంతో సమాన స్థాయికి చేరుకున్నారు. ఈ గణాంకాలు దేశంలో విద్యా ప్రమాణాలు, లింగ సమానత్వం మెరుగుపడటాన్ని స్పష్టం చేస్తున్నాయి.