Let's talk: editor@tmv.in
శ్రీలంకలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

శ్రీలంకలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Shaik Mohammad Shaffee
11 మార్చి, 2026

ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగు దేశం శ్రీలంకలో వాహనదారులపై మరోసారి ధరల భారం పడింది. దేశవ్యాప్తంగా రిటైల్ ఇంధన ధరలను పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ 'సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్' సవరించిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. తాజా సవరణతో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 7 నుంచి 8 శాతం మేర పెరిగాయి. అంటే సగటున లీటరుపై కనీసం 24 రూపాయల వరకు భారం పడింది. లంకలోని సిలోన్ పెట్రోలియం బంకులతో పాటు ఇతర ప్రైవేటు ఫిల్లింగ్ స్టేషన్లలోనూ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే కారణం

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడం, అమెరికా-ఇరాన్ మధ్య దాడులు పెరగడంతో సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర నాలుగేళ్ల తర్వాత మళ్లీ బ్యారెల్‌కు 100 అమెరికన్ డాలర్ల మార్కును దాటింది. దిగుమతి ఖర్చులు భారీగా పెరగడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ధరలను పెంచక తప్పలేదని శ్రీలంక అధికారులు వెల్లడించారు.

నిల్వల వేట.. క్యూ కట్టిన వాహనాలు

ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయన్న వార్తలతో శ్రీలంకలో ఒక్కసారిగా 'పానిక్ బయింగ్' (భయాందోళనతో కొనుగోలు చేయడం) మొదలైంది. మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావం పడుతుందన్న ఊహగానాలతో ఫిబ్రవరి 28 నుంచి పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. ప్రజలు పెద్ద ఎత్తున నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో, దీనిని అరికట్టేందుకే అర్ధాంతరంగా ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేసినట్లు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు సరిపడా ఇంధన నిల్వలు దేశంలో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

2022 నాటి చేదు జ్ఞాపకాలు

2022లో శ్రీలంక ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ఆహారంతో పాటు ఇంధనానికి తీవ్ర కొరత ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ లైన్లు, విద్యుత్ కోతలు, ప్రజా నిరసనలతో దేశం అతలాకుతలమైంది. ఆ తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుతో తీసుకువచ్చిన కఠినమైన ఆర్థిక సంస్కరణల్లో భాగంగానే ఇంధన ధరల సర్దుబాటు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.

శ్రీలంకలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Tholi Paluku