
శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరిట సహాయకచర్యలు
శ్రీలంకను అతలాకుతలం చేసిన 'దిత్వా' తుఫాను అనంతరం ఆ దేశానికి మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు అందించేందుకు భారత్ 'ఆపరేషన్ సాగర్ బంధు'ను పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ, సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నాయి.
అత్యవసర వైద్య సేవలు, రెస్క్యూ ఆపరేషన్లు
శ్రీలంకలో తుఫాను బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు భారత వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో పూర్తిగా సిద్ధమైన, వేగంగా మోహరించడానికి వీలైన ఒక మాడ్యులర్ ఫీల్డ్ ఆసుపత్రిని శ్రీలంకకు పంపింది. 73 మంది వైద్య సిబ్బంది, ఆంబులెన్స్‌లు, ట్రూమా కేర్ యూనిట్లు, ఆపరేటింగ్ థియేటర్లతో సహా అన్ని సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో ఉన్నాయి.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అత్యంత క్లిష్టమైన ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి, పుట్టలంలో దాదాపు 800 మంది చిక్కుకుపోయిన నివాసితులను సురక్షితంగా తరలించాయి. వీరిలో గర్భిణీ స్త్రీలు, గాయపడిన వారు ఉన్నారు. అంతేకాకుండా దృష్టి లోపం ఉన్న వృద్ధుడిని, గాయపడిన మహిళను రక్షించి వైద్య సహాయం అందించారు. శిథిలాల కింద చిక్కుకున్న ఒక మృతదేహాన్ని కూడా కష్టతరమైన ఆపరేషన్ తర్వాత వెలికి తీశారు.
వైమానిక, నౌకాదళం ద్వారా నిరంతర సహాయం
భారత వైమానిక దళం, భారత నావికాదళం సరిహద్దులు దాటి సహాయం అందించడంలో చురుకుగా పాల్గొన్నాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ ఉదయగిరి నౌకలు కొలంబో వద్ద అత్యవసర సహాయక సామాగ్రిని అందించాయి. ఐఎన్‌ఎస్ సుకన్య డిసెంబర్ 1న కీలకమైన సహాయక సామగ్రిని తీసుకుని తూర్పు ప్రావిన్స్‌లోని ట్రింకోమలీకి చేరుకుంది. ఈ సామగ్రిని శ్రీలంక వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు చేరవేసింది.
భారత వైమానిక దళం హెలికాప్టర్లు 5.5 టన్నులకు పైగా సహాయక సామాగ్రిని వాయు మార్గం ద్వారా పంపిణీ చేశాయి. అలాగే, చేరుకోలేని ప్రాంతాల నుండి డజన్ల కొద్దీ ప్రజలను రక్షించి, తీవ్రంగా గాయపడిన వారిని వైద్య కేంద్రాలకు తరలించాయి. భారత నౌకాదళ హెలికాప్టర్లు కూడా వైమానిక నిఘా ద్వారా గాలింపు, రెస్క్యూ ప్రయత్నాలను బలోపేతం చేశాయి.
భారత్-శ్రీలంక బంధం
భారత్ 'పొరుగుదేశానికి ప్రాధాన్యత' విధానం, 'మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా, ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంక్షోభ సమయాల్లో ఈ ప్రాంతంలో ప్రథమ స్పందనదారుగా భారత్ తన స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది. భారత్ లోని శ్రీలంక హైకమిషనర్ మహిషిణి కొలొన్నే ఈ సందర్భంగా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సునామీ, ఆర్థిక సంక్షోభం, ప్రస్తుత తుఫానుతో సహా అనేక సవాళ్లను శ్రీలంక ఎదుర్కొన్న ప్రతిసారీ భారత్ ప్రథమంగా స్పందించిందని, ఈ విపత్తు రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
474కు చేరిన మృతుల సంఖ్య
శ్రీలంకలో 'దిత్వా' తుఫాను సృష్టించిన బీభత్సం కారణంగా భారీగా ప్రాణ నష్టం సంభవించింది. విపత్తు నిర్వహణ కేంద్రం ధృవీకరించిన వివరాల ప్రకారం, తుఫాను అనంతర వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మృతుల సంఖ్య 474 కు పెరిగింది. మరో 356 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా కాండీ జిల్లా అత్యధికంగా దెబ్బతింది. అక్కడ 118 మంది మరణించారు.
