
శ్రీరాముడికి శతకోటి నమస్కారాలు: ప్రధాని మోడీ
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్షికోత్సవం మన విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దివ్యోత్సవమని ఆయన అభివర్ణించారు. గత నెలలో అయోధ్యలో ఆవిష్కరించిన ధర్మ ధ్వజం తొలిసారి రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవానికి సాక్షిగా నిలవడం విశేషమని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందిస్తూ అయోధ్యజీ పవిత్ర భూమిపై రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం నేడు ఘనంగా జరుగుతోంది. ఇది మన విశ్వాసం, సంప్రదాయాలకే అంకితమైన దివ్య పర్వదినం. దేశ విదేశాల్లోని కోట్లాది రామ భక్తుల తరఫున శ్రీరాముడి పాదాల వద్ద నా శతకోటి నమస్కారాలు. దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు.
భారత్ నిర్మాణానికి పునాది కావాలి
శ్రీరాముడి అపార కృపతో, ఐదు శతాబ్దాలుగా కోట్లాది రామభక్తులు కలగా కంటున్న సంకల్పం నెరవేరింది. నేడు రామ్‌లల్లా తన వైభవోపేతమైన ఆలయంలో పునఃస్థాపితుడయ్యాడు. ప్రతిష్ఠ ద్వాదశి పర్వదినంలో అయోధ్య ధర్మధ్వజం ఈ మహాఘట్టానికి సాక్షిగా నిలవడం గర్వకారణం. గత నెలలో ఈ ధ్వజ స్థాపన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించిందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి హృదయంలో సేవ, త్యాగం, కరుణ వంటి విలువలు మరింత బలపడాలని, అదే విధంగా అవి సంపన్నమైన, స్వయం సమృద్ధి గల భారత్ నిర్మాణానికి పునాది కావాలని ప్రధాని ఆకాంక్షించారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు. ప్రతిష్ఠ ద్వాదశి, రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం సందర్భంగా వారు అన్నపూర్ణ ఆలయంలో ధ్వజారోహణం చేయడంతో పాటు హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనవరి 22, 2024న రామ్‌లల్లా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఆ రోజు జరిగిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని గంటల పాటు సాగిన వేద మంత్రోచ్చారణలతో జరిగిన కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ప్రతిష్ఠ ద్వాదశి వేడుకల రెండో రోజున శ్రీరామ్ జన్మభూమి మందిరంలో తత్త్వ కలశ, తత్త్వ హోమం, మన్యు సూక్త హోమం, రామ్ తారక మంత్ర హోమం వంటి అనేక యజ్ఞక్రతువులు నిర్వహించారు. ఈ రెండో వార్షికోత్సవంతో అయోధ్య ఒక ప్రధాన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా మరింత బలపడిందని, నూతన సంవత్సరం ఆరంభంలోనూ లక్షలాది భక్తులు శ్రీరాముడి ఆశీస్సుల కోసం పవిత్ర నగరానికి తరలివస్తున్నారని అధికారులు తెలిపారు.
