Let's talk: editor@tmv.in
శ్రీరామనవమి శోభాయాత్ర రోజున రాజాసింగ్‌ను చంపేస్తామని బెదిరింపులు

శ్రీరామనవమి శోభాయాత్ర రోజున రాజాసింగ్‌ను చంపేస్తామని బెదిరింపులు

Gaddamidi Naveen
19 మార్చి, 2026

గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌‌కు మరోసారి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపు లేఖ రావడం నగరంలో కలకలం రేపింది. మార్చి 27న జరగనున్న శ్రీ రామనవమి శోభాయాత్రే తనకు చివరిదని, ఆ రోజున తనను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు. రాజాసింగ్.. మార్చి 27 నీకు చివరి రామనవమి. తెలంగాణ పోలీసులు నన్ను ఏమీ చేయలేరని లేఖలో పేర్కొనడం గమనార్హం.

ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి బెదిరింపు లేఖ అందింది. అప్పట్లో అబ్దుల్ హఫీజ్ పేరుతో ఇలాంటిదే ఒక బెదిరింపు లేఖ రాజాసింగ్ నివాసానికి వచ్చింది. పదేపదే ఫోన్ కాల్స్, లేఖల ద్వారా తనను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిని గుర్తించాలని ఆయన ముఖ్యమంత్రి, డీజీపీ, పోలీసు కమిషనర్‌లను కోరారు.

మరోవైపు, ఈ ఏడాది రామనవమి శోభాయాత్రకు తనకు పోలీసు రక్షణ వద్దంటూ రాజాసింగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.గత మూడేళ్లుగా రక్షణ పేరుతో వస్తున్న పోలీసులు భక్తులపై లాఠీఛార్జ్ చేస్తున్నారని, శోభాయాత్రను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అనిత టవర్స్, పురానాపూల్, బేగం బజార్ ఛత్రీ, సిద్దిఅంబర్ బజార్ మసీదు ప్రాంతాల్లో పోలీసులు భక్తులను ఇబ్బందులకు గురిచేశారని లేఖలో వివరించారు. నుదుట తిలకం ధరించని పోలీసులు శోభాయాత్ర వాతావరణాన్ని చెడగొట్టే విధంగా వ్యవహరించే వారిని ఈసారి విధుల్లో నియమించవద్దని కోరారు.

శ్రీరామనవమి శోభాయాత్ర కోసం భక్తులు యాత్ర మార్గమంతా స్టేజీలు, సౌండ్ సిస్టమ్స్ వంటి భారీ ఏర్పాట్లు చేసుకుంటారని, వాటిని అడ్డుకోవద్దని రాజాసింగ్ పోలీసులను కోరారు. "భద్రత పేరుతో భక్తులకే నష్టం కలిగించే రక్షణ మాకు అవసరం లేదు” అని రాజా సింగ్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు మా ఏర్పాట్లను భగ్నం చేస్తే నేను వ్యక్తిగతంగా స్పందిస్తాను అని ఆయన హెచ్చరించారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే పోలీసులు, ప్రజలకే వ్యతిరేకంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శోభాయాత్ర వివరాలు

ఈ ఏడాది శ్రీరామనవమి శోభాయాత్ర ఆకాష్ పురి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. ఈ భారీ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఎమ్మెల్యే రాజాసింగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హత్య బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే పోలీసు రక్షణను నిరాకరించడం భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ వివాదంపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

శ్రీరామనవమి శోభాయాత్ర రోజున రాజాసింగ్‌ను చంపేస్తామని బెదిరింపులు - Tholi Paluku