Let's talk: editor@tmv.in
శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసు రక్షణ వద్దు: సీపీ సజ్జనార్‌కి రాజాసింగ్ లేఖ

శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసు రక్షణ వద్దు: సీపీ సజ్జనార్‌కి రాజాసింగ్ లేఖ

Gaddamidi Naveen
18 మార్చి, 2026

హైదరాబాద్ నగరంలోని గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌‌కు ఒక కీలక లేఖ రాశారు. ఈ నెల 27న జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు తనకు ఎలాంటి పోలీసు రక్షణ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా రక్షణ పేరుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భక్తులను వేధిస్తున్నారని, లాఠీచార్జి చేస్తున్నారని ఆయన ఈ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.

గత మూడేళ్ల అనుభవాలను వివరిస్తూ.. రక్షణ కల్పించాల్సిన పోలీసులే శోభాయాత్రకు ఆటంకం కలిగిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అనితా టవర్స్, పురానాపూల్, బేగం బజార్ ఛత్రి, సిద్ధిఅంబర్ బజార్ మసీదు పరిసరాల్లో పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేశారని, వాటి వల్ల భక్తుల్లో భయాందోళనలు పెరిగిందని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యాత్రలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేశారని కూడా ఆయన విమర్శించారు. ఇక కొంత‌మంది పోలీసు సిబ్బంది ప్రవర్తనపై కూడా రాజా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నుదుటిపై తిలకం ధరించని సిబ్బంది యాత్రలో గందరగోళం సృష్టిస్తున్నారని, అలాంటి వారిని ఈసారి విధుల్లో నియమించవద్దని ఆయన కోరారు.

శ్రీరామనవమి శోభాయాత్ర కోసం భక్తులు యాత్ర మార్గమంతా స్టేజీలు, సౌండ్ సిస్టమ్స్ వంటి భారీ ఏర్పాట్లు చేసుకుంటారని, వాటిని అడ్డుకోవద్దని రాజాసింగ్ పోలీసులను కోరారు. "భద్రత పేరుతో భక్తులకే నష్టం కలిగించే రక్షణ మాకు అవసరం లేదు” అని రాజా సింగ్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు మా ఏర్పాట్లను భగ్నం చేస్తే నేను వ్యక్తిగతంగా స్పందిస్తాను అని ఆయన హెచ్చరించారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే పోలీసులు, ప్రజలకే వ్యతిరేకంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శోభాయాత్ర వివరాలు

ఈ ఏడాది శ్రీరామనవమి శోభాయాత్ర ఆకాష్ పురి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. ఈ భారీ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఎమ్మెల్యే రాజాసింగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నగర పోలీసు వర్గాల్లో, రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శోభాయాత్ర శాంతియుతంగా సాగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన పునరుద్ఘాటించారు.