Let's talk: editor@tmv.in
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ -2‌కు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ -2‌కు

Aravind Maryada Reddy
13 అక్టోబర్, 2025

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2‌కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వారి సేవలను స్మరించుకున్నారు. “దామోద‌ర్ రెడ్డి మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం అర్పించారు. నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అలుపెరగని పోరాటం చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్ -2 ద్వారా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలు తరలించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 ప్రారంభమయ్యేలా పోరాటం చేశారు. అందువల్ల ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడం వారికిచ్చే నిజమైన నివాళి...” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

ఎవరీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి

రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యంతో ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన, తుంగతుర్తిలోని తన నివాసంలో ప్రారంభమైన చికిత్స అనంతరం, ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.

రాజకీయ ప్రస్థానం

రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి 1952 సెప్టెంబరు 14న ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామంలో జన్మించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 1989, 1994, 2004, 2009లో కూడా విజయం సాధించారు. 1994లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2014, 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో 2004–2009 మధ్య మంత్రిగా పనిచేశారు.

ఎస్పారెస్పీ స్టేజ్ 2 పూర్తికావడం వెనుక దామోదర్ రెడ్డి కృషి ఉందా?

ఎస్సారెస్పీ స్టేజ్ 2కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడంతో ఈ చర్చ మొదలైంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దశ 2 అనుమతులు పొందడం, నిర్మాణం పూర్తవడం వంటి కీలక ఘట్టాల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి పాత్ర గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. ఆయన రాజకీయ జీవితం, గతంలో ఐటీమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో సొంత జిల్లాలోని ఈ ప్రాజెక్టు కోసం అనధికారికంగా ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చు. దీంతో తాజాగా ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దశ 2 అనేది కాకతీయ కాలువ 284 నుండి 346 కిలోమీటర్ల వరకు సాగించే 1,78,068 హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 2006లో రూ. 1,043.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను ఆయా ప్రాజెక్టులకు గతంనుంచి ఆనవాయితీగా వస్తున్నది. ప్రజల డబ్బుతో నిర్మించే ప్రాజెక్టులు లేదా నిర్మాణాలకు రాజకీయ నేతల పేర్లు ఎందుకు పెట్టాలన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజాగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ -2‌కు - Tholi Paluku