Let's talk: editor@tmv.in
శ్రీకాకుళం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం:మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం:మంత్రి అచ్చెన్నాయుడు

Panthagani Anusha
23 మార్చి, 2026

శ్రీకాకుళం నగరాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ‘మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నగర మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలో సుడా ఆధ్వర్యంలో పూర్తి చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు.

వీర జవాన్ల స్మృతిలో.. కార్గిల్ విక్టరీ పార్క్

నగరవాసులకు ఆహ్లాదంతో పాటు భావితరాలకు దేశభక్తిని చాటిచెప్పేలా రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన 'కార్గిల్ విక్టరీ పార్క్ ను మంత్రి జాతికి అంకితం చేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో సాహసం ప్రదర్శించిన శ్రీకాకుళం జిల్లా బిడ్డలు హవాల్దార్ చిన్ని సింహాచలం, హవాల్దార్ టొంప నీలాచలం సహా 58 మంది వీర సైనికుల త్యాగాలను స్మరిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన సైనికుల సాహసగాథలు యువతకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. అదేవిదంగా ఈ పార్కులో క్రీడాకారుల కోసం బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ కోర్టులను కూడా అందుబాటులోకి తెచ్చారు.

మహిళా భద్రతకు పెద్దపీట

మహిళల ఆత్మగౌరవం భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన డే అండ్ నైట్ జంక్షన్, ఉమెన్స్ కాలేజీ సమీపంలో అత్యాధునిక 'పింక్ టాయిలెట్లు', శిశువులకు పాలిచ్చేందుకు ప్రత్యేక 'ఫీడింగ్ రూమ్స్ ను ప్రారంభించారు. కాగా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు .

మరోవైపు నగర విస్తరణలో భాగంగా రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు జంక్షన్ వరకు చేపట్టిన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ ప్లాంటేషన్ పనులను మంత్రి పరిశీలించారు. రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు ఉండటం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వృద్ధులు, మహిళలకు సురక్షితమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు. ఇక నగరాన్ని కాలుష్య రహితంగా పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వసతులను ప్రజలు బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకోవాలని నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని మంత్రి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.