Let's talk: editor@tmv.in
శ్రీకాకుళం తీరానికి బంగ్లాదేశ్‌ మత్స్యకారుల బోటు

శ్రీకాకుళం తీరానికి బంగ్లాదేశ్‌ మత్స్యకారుల బోటు

Panthagani Anusha
2 డిసెంబర్, 2025

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సముద్రతీరంలో ఆదివారం ఒక అనుమానాస్పద బోటు కనిపించడంతో కలకలం చెలరేగింది. స్థానిక మత్స్యకారులు దగ్గరికి వెళ్లి విచారించగా అది బంగ్లాదేశ్‌లోని భోలా ప్రాంతానికి చెందిన బోటు అని నిర్ధారణ అయింది. దీనిలో మొత్తం 13 మంది మత్స్యకారులు ఉన్నారు. బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో బోటులో యాంత్రిక లోపం తలెత్తిందని, తెచ్చుకున్న ఇంధనం, ఆహారం పూర్తిగా అయిపోవడంతో వారు మధ్య సముద్రంలోనే చిక్కుకుపోయారని మత్స్యకారులు తెలిపారు. కాగా అలల ప్రభావంతో బోటు పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాలను దాటి మూసాపేట దాకా కొట్టుకు వచ్చినట్లు గుర్తించారు.

గ్రామానికి చెందిన మత్స్యకారులు, వేట నిషేధం ఉన్నా సముద్రంలో కదులుతున్న ఆ బోటు స్థానిక బోటు కాదని గుర్తించి వెంటనే మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కళింగపట్నం మెరైన్‌ సీఐ బి. ప్రసాదరావు, ఎచ్చెర్ల ఎస్సై జి. లక్ష్మణరావు సిబ్బందితో కలిసి మూడు బోట్లను సముద్రంలోకి పంపి, ఆ 13 మందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. భాష తెలియక మొదట ఇబ్బంది ఎదురైనా, వారి వివరాలు బంగ్లాదేశ్‌ భాష తెలిసిన స్థానిక మత్స్యకారుల సహాయంతో వారి వివరాలు సేకరించారు. 15 రోజుల పాటు ఆహారం లేక అల్లాడిన మత్స్యకారులు ఒడ్డుకు చేరగానే స్థానికులు మంటలు వెలిగించి చలికాయించి, ముందుగా బిస్కెట్లు, తర్వాత భోజనం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం వారిని కళింగపట్నం మెరైన్‌ స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా భారత జలాల్లోకి ప్రవేశించినందుకు వారిపై ఇండియన్‌ మారిటైమ్‌ యాక్ట్‌లోని 81, 82 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసే ప్రక్రియ చేపట్టినట్లు మెరైన్‌ సీఐ ప్రసాదరావు తెలిపారు. కాగా, 2008లో కూడా ఇదే మండల సముద్రతీరానికి బంగ్లాదేశ్‌ బోటు చేరిన సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. స్థానికుల అప్రమత్తత, పోలీసుల వేగవంతమైన రక్షణ చర్యలతో 13 మంది ప్రాణాలతో బయటపడగలిగారు.