
శ్రీకాకుళం కాశీబుగ్గ ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మందికి పైగా భక్తులు మరణించిన విషాద ఘటన నేపథ్యంలో,తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఏకాదశి, కార్తీక దీపోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్ని దేవాలయాలలో భక్తుల కోసం సరైన క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, శౌచాలయాలు, వైద్య సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని దేవాదాయ కమిషనర్ హరీష్‌కు ఆదేశించారు.
తొక్కిసలాట వంటి దుర్ఘటనలు ఎక్కడా జరగకుండా, ఏ ఒక్క భక్తుడికీ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనాలు పూర్తి చేసుకునేలా చూడాలని ఆమె సూచించారు.
ఈ ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు వర్తిస్తాయి.ఈ ఆదేశాలు ప్రధానంగా కార్తీక మాసం ముగిసే వరకు, అంటే కార్తీక దీపోత్సవం, ఏకాదశి వేడుకలు పూర్తయ్యేంత వరకు అమల్లో ఉంటాయి.అయితే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో అవసరమైతే ఈ చర్యలను తదుపరి రోజుల వరకు కూడా కొనసాగించవచ్చు అని అధికారులకు మంత్రి సూచించారు.
సీఎం ప్రగాఢ సానుభూతిన
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందిన ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషాకరమైన ఘటనలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
