
శోభాయమానంగా శోభాయాత్ర
జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూపాలతో మైమరిపింప జేస్తూ, విచిత్ర వేషధారణలతో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆసీనులై కళా రూపాలను తిలకించారు.
ఈ ర్యాలీలో స్వాగత శకటం, రోలర్ స్కేటర్స్, పైడితల్లి అమ్మవారి కలశాలు, తప్పెటగుళ్లు, థింసా డాన్స్, పులి వేషాలు, విచిత్ర వేషాలు, రోలర్ స్కేటర్స్, ఆగమ పండితుల బృందం, విజయనగరం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్ర సాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డాన్స్, బిందెల డాన్స్, గరగల డాన్స్, చెక్క భజన, గంగిరెద్దులు, జముకుల బృందం, కాళీమాత డాన్స్, ఎన్సీసీ కాడేట్స్ మార్చ్, కోలాటం, క్రీడా సంఘాలు, క్రీడాకారులు, అంగన్వాడి సిబ్బంది, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.., ఎస్.హెచ్.జి.గ్రూప్స్ తదితర బృందాలు ర్యాలీలో అలరించాయి.
ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకొనేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయనున్నారు. నేటి తరానికి సంప్రదాయాలు, కళలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలను కళాకారులను ఆదుకునేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో అవసరం అని అన్నారు. పైడితల్లి అమ్మవారు జిల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, మార్క్ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగారురాజు, డిసిసిబి చైర్మెన్ కిమిడి నాగార్జున, జెసి ఎస్. సేధు మాధవన్ తదితర ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
హోంమంత్రి అనిత దింసా నృత్యం
విజయనగరం జిల్లాలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దింసా నృత్యం లో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కళాకారుల పులి వేషాలు, సాంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి.తరువాత విజయనగరం కోటలో హోంమంత్రి అనిత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుని మర్యాదపూర్వకంగా కలసి, శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర, విజయనగరం ఉత్సవాలపై చర్చించారు. కోట ప్రాంగణంలో విద్యార్థినులు నిర్వహించిన కోలాటంలో హోంమంత్రి, ఎమ్మెల్యే విద్యార్థినీల ఆహ్వానంతో పాల్గొని వారిని ప్రోత్సహించారు.
