
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన వార్షిక శీతాకాల విడిది నిమిత్తం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఆమె డిసెంబర్ 22 వరకు బస చేయనున్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుండి ఆమె నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.
డిసెంబర్ 22 వరకు రాష్ట్రపతి, రాష్ట్రపతి నిలయంలోనే బస చేయనున్నారు. ఈ కాలంలో అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. డిసెంబర్ 19న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించనున్నారు.
అదేవిధంగా డిసెంబర్ 20న హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘టైమ్‌లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్: పాత్‌వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్’ అనే జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రాష్ట్రపతి ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి, అక్కడ నుంచే అధికారిక విధులు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్తర భారతదేశంలోని శిమ్లాలోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’ దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి నిలయం, ఈ రెండూ రాష్ట్రపతి కార్యాలయానికి దేశవ్యాప్త సమన్వయ పాత్రను ప్రతిబింబిస్తాయి. ఉత్తరం, దక్షిణం అనే భౌగోళిక విభజనకు అతీతంగా దేశ ఐక్యతను, విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ఇవి సూచిస్తాయి.
హైదరాబాద్ నగరంలోని బొలారంలో ఉన్న రాష్ట్రీయపతి నిలయం 1860లో నిర్మించబడింది. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ నిజాం నుంచి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని రాష్ట్రపతి సచివాలయానికి అప్పగించారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఏక అంతస్తు భవనంలో 11 గదులు ఉన్నాయి. అదనంగా భోజన మందిరం, సినిమా హాల్, మోర్నింగ్ రూమ్ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి.
