Let's talk: editor@tmv.in
శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొదలు.. కేసీఆర్ హాజరు

శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొదలు.. కేసీఆర్ హాజరు

Gaddamidi Naveen
30 డిసెంబర్, 2025

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజునే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను జనవరి 2కి వాయిదా వేయడం జరిగింది. సమావేశాల ఆరంభంలో ఇటీవల కన్నుమూసిన మాజీ శాసనసభ్యులు ఆర్‌. దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు శాసనసభ ఘన నివాళులు అర్పించింది. వారి స్మృతికి గౌరవంగా సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సభలో అరుదైన దృశ్యం

ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత రెండేళ్లుగా దాదాపు శాసనసభకు దూరంగా ఉన్న కేసీఆర్, సోమవారం సభలో కనిపించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ అరుదుగా మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే సభలో పాల్గొన్నారు. 2024 జూలైలో జరిగిన బడ్జెట్ సమావేశాల మొదటి రోజున కూడా ఆయన హాజరయ్యారు.

కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నప్పటికీ, సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సీటు వద్దకు వెళ్లి పలకరించడం గమనార్హం. ఈ సంఘటన సభలో రాజకీయ మర్యాదలకు నిదర్శనంగా నిలిచింది.

వేడెక్కనున్న రాజకీయాలు

జనవరి 2 నుంచి ప్రారంభం కాబోయే సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపడంపై రేవంత్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేసీఆర్ ఇటీవల విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. గత రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు లేదంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ సభకు క్రమం తప్పకుండా రావాలని రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు సవాల్ విసిరిన నేపథ్యంలో, ఈ సమావేశాల్లో కేసీఆర్ తన గళాన్ని ఎలా వినిపిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తంగా, దీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ సభకు రావడం, అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, రాబోయే రోజుల్లో శాసనసభను మరింత కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.

శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం

స‌మావేశాల అనంత‌రం తెలంగాణ శాసనమండలి భవనంలో జరుగుతున్న పునరుద్ధరణ, మరమ్మతు పనులను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యమంత్రితో కలిసి మండలి సమావేశ మందిరాన్ని సందర్శించారు.

భవనంలో చేపడుతున్న ఆధునీకరణ పనులు, సాంకేతిక వసతుల ఏర్పాటు, సభ్యులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించే చర్యలపై అధికారులు వివరాలు అందించారు. సమావేశ మందిరం నిర్మాణ నాణ్యత, మరమ్మతుల వేగం, భద్రతా ప్రమాణాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, శాసనమండలి కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనతో మండలి భవనం ఆధునిక వసతులతో మరింత సౌకర్యవంతంగా మారనుంది.

సభలో నీటిపారుదల అంశాలపై పీపీటీకి అవకాశం ఇవ్వాలి: హరీష్ రావు

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా సభలో కీలక అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో మాజీమంత్రి హ‌రీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు హరీష్ రావు తెలిపారు.

శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము గట్టిగా పట్టుబట్టామని ఆయన చెప్పారు. అయితే, వారం రోజుల పాటు మాత్రమే సమావేశాలు నిర్వహించి, అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహిస్తామని స్పీకర్ తమకు స్పష్టంచేశారని వెల్లడించారు. పీపీటీకి అవకాశం ఇవ్వాలన్న తమ అభ్యర్థనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సభాపతి చెప్పారని తెలిపారు. గత రెండేళ్లలో కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారని, అయితే 2025లో మాత్రం 15 రోజుల పాటు సభను నడిపినట్టు గుర్తుచేశారు. శాసనసభ పనితీరును మరింత బలోపేతం చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రోటోకాల్ అంశాలను స్పష్టంగా పరిష్కరించాలని, అలాగే ఎజెండాను ముందుగానే అందించాలని తాము కోరినట్టు హరీశ్ రావు తెలిపారు.

ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’ అంటూ బోర్డులు పెట్టిందని, కానీ అసెంబ్లీ పని దినాలు మాత్రం తగ్గిపోతున్నాయని విమర్శించారు. సమావేశాల్లో చర్చల కోసం 15 అంశాలు అందజేస్తే అవకాశం ఇస్తామని అధికార పార్టీ నేతలు చెప్పారని ఆయన పేర్కొన్నారు.

శాస‌న‌స‌భ‌లో మాజీమంత్రి హ‌రీష్ రావు మాట్టాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల వంటివారని, వారు సంతోషంగా ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థంగా చేరుతాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్ర మనోవేదనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ హామీలను అమలు చేయకపోవడం ద్వారా ఉద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పోలీస్ శాఖలో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని, టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు అందడం లేదని ఆయ‌న‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది పోలీసులు ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేసినట్టు గుర్తు చేశారు. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమ్‌ను రద్దు చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేయడం వల్ల కానిస్టేబుళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆరోగ్య భద్రత పథకాన్ని పునరుద్ధరించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

అలాగే, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు వచ్చే సమావేశం లోపే అందించాలని స్పీకర్‌ను కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సభ్యుల ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు పంపిందని తెలిపారు. కొత్త సభ్యులు మాట్లాడేటప్పుడు జీరో అవర్ అరణ్యరోదనగా మారకుండా చూడాలని హరీష్ రావు సూచించారు.

ప్రజా భవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కేంద్రం: మంత్రి పొన్నం

ప్రవాసీ కార్మికులు, విదేశాల్లో పనిచేస్తున్న వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వినేందుకు ప్రజా భవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కేంద్రాన్ని ప్ర‌తి నేల‌ ఏర్పాటు చేసినట్లు స‌భ‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసీల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కారం చేస్తున్నామని పేర్కొన్నారు.

విదేశాల్లో యువతకు సురక్షితమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘టామ్ కమ్’ ద్వారా నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. టామ్ కమ్ ద్వారా అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ అందించి, వారి నైపుణ్యాలు, అర్హతలను బట్టి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. దీంతో ఉద్యోగార్థులకు మోసాలు జరగకుండా, న్యాయమైన మార్గంలో ఉపాధి లభిస్తోందన్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే యువత టామ్ కమ్ ద్వారా మాత్రమే వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. బోగస్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. టామ్ కమ్ శిక్షణ పొందితే విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి సూచించారు.

శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొదలు.. కేసీఆర్ హాజరు - Tholi Paluku