Let's talk: editor@tmv.in
శీతల తుఫాను ధాటికి అమెరికాలో 14 వేల విమానాలు రద్దు

శీతల తుఫాను ధాటికి అమెరికాలో 14 వేల విమానాలు రద్దు

Pinjari Chand
26 జనవరి, 2026

అమెరికాలో వీకెండ్‌ నుంచి తీవ్రమవుతున్న శీతల తుఫాను (వింటర్ స్టార్మ్) కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు 14 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని సిఎన్‌ఎన్‌ వెల్లడించింది. ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం ఈ మూడు రోజుల వ్యవధిలో 14,800కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రమాదకర రోడ్డు పరిస్థితుల కారణంగా అనేక ఇంటర్‌స్టేట్ హైవేలు మూసివేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. టెనెస్సీ, జార్జియా, నార్త్ కరోలైనా, మేరిలాండ్, ఆర్కాన్సాస్, కెంటకీ, లూసియానా, మిసిసిప్పీ, ఇండియానా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైందని సిఎన్‌ఎన్‌ పేర్కొంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన షెడ్యూల్‌ విమానాల్లో 43 శాతం, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 35 శాతం విమానాలు రద్దయ్యాయి. శనివారం రోజునే 4,000కు పైగా విమానాలు రద్దుకాగా, ప్రధానంగా డల్లాస్, చార్లెట్ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపించింది. సోమవారం నాటికి ఇప్పటికే 1,600కుపైగా విమానాలు రద్దుకాగా, న్యూయార్క్, బోస్టన్ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం కొనసాగుతోంది.

మైనస్ డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు

అమెరికా జాతీయ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ శీతల తుఫాను దేశంలోని తూర్పు భాగంలోని రెండు మూడొంతుల ప్రాంతాన్ని కవర్ చేయనుంది. ఉత్తర, మధ్య మైదాన ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోతాయని హెచ్చరించింది.గల్ఫ్ కోస్ట్ వరకు రాత్రివేళలు గడ్డకట్టే స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వచ్చే వారం పొడవునా తీవ్ర చలి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గాలివేగంతో కూడిన తీవ్రమైన చలి కారణంగా హైపోథర్మియా, ఫ్రాస్ట్‌బైట్‌ వంటి ప్రాణాపాయకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. ఎక్స్ వేదికగా విడుదల చేసిన మరో ప్రకటనలో, ఈ తుఫాను మిడ్-అట్లాంటిక్ రాష్ట్రాలకు విస్తరిస్తుందని, ఆదివారం రాత్రికి ఈశాన్య ప్రాంతాలను తాకుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ మంచు వర్షం, స్లీట్‌, ఫ్రీజింగ్ రెయిన్‌ కారణంగా దేశ తూర్పు భాగమంతటా తీవ్ర అంతరాయాలు ఏర్పడతాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో అంతర్గత భద్రతా శాఖ కార్యదర్శి క్రిస్టీ నోయం ప్రజలు అవసరం లేకపోతే రోడ్లపైకి రావద్దని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. సిఎన్‌ఎన్‌ కథనం ప్రకారం, ఈ భారీ శీతల తుఫాను టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2,000 మైళ్ల పరిధిలో ప్రభావం చూపనుంది. దక్షిణ రాష్ట్రాల్లో మంచు పేరుకుపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో గర్జన, మెరుపులతో కూడిన మంచు వర్షం కురిసే అవకాశముంది. అమెరికా జనాభాలో సగానికి పైగా ప్రజలు సబ్‌జీరో విండ్‌ చిల్‌ను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేని ఇళ్లలో ప్రజలు రోజుల తరబడి తీవ్ర చలిలో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జాతీయ వాతావరణ శాఖ వింటర్ స్టార్మ్ వార్నింగ్‌లు జారీ చేయగా, ఇప్పటికే 17కు పైగా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి అమల్లో ఉందని పేర్కొంది.

శీతల తుఫాను ధాటికి అమెరికాలో 14 వేల విమానాలు రద్దు - Tholi Paluku