Let's talk: editor@tmv.in
శివాజీ మహారాజు లేకపోతే చరిత్రే వేరేలా ఉండేది: సీఎం ఫడ్నవీస్

శివాజీ మహారాజు లేకపోతే చరిత్రే వేరేలా ఉండేది: సీఎం ఫడ్నవీస్

Pinjari Chand
20 ఫిబ్రవరి, 2026

ఛత్రపతి శివాజీ మహరాజ్ లేకపోతే భారత చరిత్ర పూర్తిగా వేరేలా ఉండేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ శివాజీ దూరదృష్టి, నాయకత్వాన్ని ప్రశంసించారు. పుణే జిల్లా శివ్ నేరి కోటలో నిర్వహించిన శివజయంతి (396వ జయంతి) వేడుకల్లో పాల్గొన్న ఫడ్నవీస్, శివాజీ మహారాజు స్థాపించిన ‘స్వరాజ్యం’ భావన భారత చరిత్రలో కీలక మలుపు తిప్పిందని అన్నారు. 1630లో శివాజీ మహారాజు జన్మించిన ఈ శివనేరి కోటలో ఫడ్నవీస్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ షిండే , సునేత్రా పవార్ నివాళులర్పించారు. రాష్ట్రంలోని పలువురు నేతలు, పెద్ద సంఖ్యలో శివభక్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ శివాజీ మహారాజు లేకపోతే చరిత్ర పూర్తిగా వేరేలా ఉండేది. మహారాజు 18 వేర్వేరు జాతుల మావళాలను ఏకం చేసి శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించారు. దాంతో స్వరాజ్యం స్థాపన సాధ్యమైందని అన్నారు. శత్రువులు ఎక్కడి నుంచి వస్తారో ముందుగానే అంచనా వేసిన తొలి పాలకుడు శివాజీ మహారాజేనని, సముద్ర మార్గం ద్వారా వచ్చే ప్రమాదాలను ముందుగానే గుర్తించి సముద్ర కోటలను నిర్మించారని ఫడ్నవీస్ చెప్పారు. ఆయన నిర్మించిన కోటలు ఇప్పుడు ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. మహారాజు చూపిన మార్గంలోనే మనం నడవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గత నెల విమాన ప్రమాదంలో మరణించిన మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను కూడా ఫడ్నవీస్ స్మరించారు. శివనేరి కోటపై అజిత్ పవార్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, మహారాష్ట్ర కోటలను అక్రమ ఆక్రమణల నుంచి విముక్తం చేస్తామని ఆయనకు మాట ఇచ్చినట్లు తెలిపారు. వేడుకల సందర్భంగా ‘పాలనేడు’ కార్యక్రమం (శిశు శివాజీ జననం, నామకరణాన్ని సూచించే ఉయ్యాల కార్యక్రమం) సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే వేడుకల సందర్భంగా అధిక రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

శివాజీ మహారాజు లేకపోతే చరిత్రే వేరేలా ఉండేది: సీఎం ఫడ్నవీస్ - Tholi Paluku