Let's talk: editor@tmv.in
శివమ్‌ దూబె ఆల్‌రౌండ్ షో .. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం

శివమ్‌ దూబె ఆల్‌రౌండ్ షో .. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం

Shaik Mohammad Shaffee
19 ఫిబ్రవరి, 2026

నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూపు దశ చివరి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండర్ శివమ్‌ దూబె వీరోచిత అర్ధసెంచరీతో పాటు బంతితోనూ మెరవగా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో భారత్ తన గ్రూపులో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, అజేయంగా సూపర్‌-8 దశలోకి అడుగుపెట్టింది. మరోవైపు భారత్‍, పాకిస్థాన్‌ వంటి బలమైన జట్లకు గట్టి పోటీనిచ్చిన నెదర్లాండ్స్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

దూబె సునామీ.. పాండ్యా మెరుపులు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆర్యన్ దత్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయి అతడు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (18) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, అసలైన విధ్వంసం శివమ్‌ దూబె రూపంలో మొదలైంది. కేవలం 25 బంతుల్లోనే కెరీర్‌లో తొలి ప్రపంచకప్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న దూబె.. మొత్తం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 66 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్యా (30)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వరుణ్ చక్రవర్తి మాయాజాలం

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఓపెనర్లు మాక్స్ ఓడౌడ్ (20), మైఖేల్ లెవిట్ (24) ధాటిగా ఆడారు. బుమ్రా, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ దశలో నంబర్ వన్ టీ20 బౌలర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో ఓడౌడ్‌ను బౌల్డ్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లెవిట్ అవుట్ కావడంతో డచ్ జట్టు కష్టాల్లో పడింది. మధ్యలో కొలిన్ అకెర్‌మన్ (23), బాస్ డి లీడే (33) పోరాడే ప్రయత్నం చేసినా.. వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో వరుస బంతుల్లో అకెర్‌మన్, ఆర్యన్ దత్‌లను అవుట్ చేసి నెదర్లాండ్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుణ్ తన 3 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

డచ్ జట్టు పోరాటం.. భారత్ క్లీన్ స్వీప్

చివరి ఓవర్లలో నోవా క్రోస్ (25 నాటౌట్), జాక్ లయన్ (26) మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా 18 పరుగులు సమర్పించుకోవడంతో డచ్ జట్టు గెలుస్తుందేమో అన్న భ్రమ కలిగింది. కానీ, చివరి ఓవర్ వేసిన శివమ్‌ దూబె నిలకడగా బౌలింగ్ చేసి కీలక వికెట్ తీయడంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. బ్యాటింగ్‌లో 66 పరుగులు చేసి, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన శివమ్‌ దూబె ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గ్రూపు దశలో క్లీన్ స్వీప్ చేసిన భారత్, ఇప్పుడు అదే ఊపుతో సూపర్‌-8 సమరానికి సిద్ధమవుతోంది.

సూపర్ 8కు దూసుకెళ్లిన పాకిస్థాన్

నమీబియాతో బుధవారం కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ పోరులో పాకిస్థాన్ 102 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, సూపర్‌-8 దశకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 199/3 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుత ప్రదర్శన చేస్తూ 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని (100) పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ సల్మాన్ అగా (38) అతడికి సహకరించడంతో పాక్ పటిష్ట స్థితికి చేరుకుంది. 2014 తర్వాత ప్రపంచకప్‌లో పాక్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా ఫర్హాన్ రికార్డు సృష్టించాడు.

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, పాక్ బౌలర్ల ధాటికి కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ స్పిన్నర్లు ఉస్మాన్ తారిక్ (4/16), షాదాబ్ ఖాన్ (3/19) మాయాజాలం చేయడంతో నమీబియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ జట్టులో లౌరెన్ స్టీన్‌క్యాంప్ (23) మినహా మిగిలిన వారు ఎవరూ రాణించలేకపోయారు. ఉస్మాన్ తారిక్ నాలుగు వికెట్లతో నమీబియా పతనాన్ని శాసించగా, పాకిస్థాన్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి అధికారికంగా తదుపరి దశకు చేరుకుంది.

యూఏఈపై 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

మరోవైపు న్యూఢిల్లీ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ.. యూఏఈపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈని దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా అడ్డుకున్నారు. కార్బిన్ బాష్ (3/12) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఫలితంగా యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ బ్యాటర్లలో అలీషాన్ షరాఫు (45) మాత్రమే కొంతవరకు పోరాడాడు.

123 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మరో 40 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రామ్ (28), ర్యాన్ రికెల్టన్ (30), డెవాల్డ్ బ్రెవిస్ (36) వేగంగా ఆడటంతో లక్ష్యం సులువైంది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా గ్రూప్-డిలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. సూపర్‌-8 దశలో తన మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 22న బలమైన భారత్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.