
శివనామస్మరణతో మార్మోగిన వారణాసి
మహాశివరాత్రి పవిత్ర వేళలో ఉత్తరప్రదేశ్ అంతటా శివాలయాలు భక్తి పారవశ్యంతో కళకళలాడాయి. "హర హర మహాదేవ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. తెల్లవారుజామునే లక్షలాదిగా భక్తులు శివదర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ధామ్‌లో ఉదయం మంగళ ఆరతి తర్వాత నుంచే భక్తుల రద్దీ ఉధృతమైంది. ఆలయ ప్రధాన కార్యనిర్వాహక అధికారి భూషణ్ మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఏడాది మహాశివరాత్రి రోజున సుమారు 12 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈసారి 10 నుంచి 15 లక్షల మంది వరకు వచ్చారని అంచనా. ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధామ్‌లో సులభ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు గేట్ల ద్వారా ప్రవేశం కల్పిస్తూ, జిగ్-జాగ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
భక్తులపై పూల వర్షం కురిపించిన ఆలయ అధికారులు, నిరంతరంగా 45 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచారు. ప్రపంచం నలుమూలల నుంచి మలేషియా, శ్రీలంక వంటి దేశాల ప్రముఖ దేవాలయాల నుంచి కూడా కానుకలు చేరాయి. దేశంలోని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాల నుంచి కూడా ప్రత్యేక సమర్పణలు వచ్చాయి. ఇక బరాబంకీ జిల్లాలోని లోకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద అర్ధరాత్రి నుంచే భక్తుల సందడి నెలకొంది. లక్నోలోని మంకమేశ్వర్ ఆలయం వద్ద కూడా భక్తులు రాత్రి నుంచే క్యూలో నిలబడ్డారు. మథురలోని ప్రాచీన భూతేశ్వర్ ఆలయం వద్ద “ఓం నమః శివాయ” నినాదాలు మార్మోగాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ మందిరంలో రుద్రాభిషేకం నిర్వహించి, మానవాళి క్షేమం కోసం ప్రార్థించారు.
మాఘమేళా చివరి రోజు గంగా–సంగమంలో 21 లక్షల మంది పవిత్ర స్నానం
మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మాఘమేళా చివరి రోజున గంగా, సంగమంలో ఆదివారం ఉదయం 10 గంటల నాటికి 21 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు తెలిపారు. మేళా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు మేళా ప్రాంగణానికి చేరుకుని స్నానాలు ఆరంభించారు. ఉదయం 10 గంటల వరకు 21 లక్షల మంది గంగా, త్రివేణి వద్ద స్నానం చేసినట్లు తెలిపారు.
