
శిల్పారామం - హైదరాబాదులో సాంప్రదాయ కళల ఆవాసం
నిరంతరం గజిబిజి వాతావరణంతో సతమతమయ్యే నగరవాసులకు నగరం నడి మద్యలో స్వచ్చమైన, అందమైన ప్రకృతి వాతావరణంతో సహజంగా ఉండే ప్రాంతం నిరంతరం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. అదే శిల్పారామం. ఇది కళలకు, సంప్రదాయాలకు నెలవు, గ్రామీణ జీవన వాతావరణ ప్రదర్శన గ్రామం. 65 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రదర్శనా గ్రామం, వివిధరకాల వస్తువుల కొనుగోలు కేంద్రాలు, పచ్చని చెట్లు, నీలిరంగు సరస్సు, మధ్యకు మనల్ని తీసుకెళ్తుంది.
ఇక్కడ అడుగు పెట్టగానే మనకు పల్లెటూరి గ్రామీణ కళలు, పండుగల సందడి అన్నీకలిసి ఒక్కచోటే ఉన్నాయా అని అనిపిస్తాయి. అక్కడి పరిసరాలు పెద్దలు చిన్నప్పుడు వెళ్లిన ఊరిని గుర్తుచేసేలా, పిల్లలకు కొత్తప్రపంచంలా కనిపిస్తాయి. శిల్పారామం భారతీయ హస్తకళలు, మట్టి బొమ్మలు, కాటన్, సిల్క్ వస్తువులు, నృత్య సంగీతం, గ్రామీణ, పారంపరిక కార్యకలాపాలు కలగలిపి ఒకచోట నిలిపిన స్థలం. ఇక్కడి గ్రామీణ మ్యూజియం పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో చూపిస్తుంది, క్రాఫ్ట్స్ బజార్ భారతీయ హస్తకళలను పరిచయం చేస్తుంది. అలాగే పండుగల సమయంలో జరిగే సంక్రాంతి సందడి, ఉగాది ఉత్సవాలు, నవరాత్రులు వంటి సంబరాల వాతావరణం మనసును ఆనందంతో నింపుతాయి. కుటుంబంతో పాటు వెళ్ళి ప్రతి కళను ఆస్వాదించదగిన సాంస్కృతిక ప్రయాణం శిల్పారామం. భారతదేశ సంప్రదాయ కళలను పరిరక్షించేందుకు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. 65 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గ్రామం సందర్శకులకు ఒక సంపూర్ణ సాంస్కృతిక అనుభూతిని అందిస్తుంది.
చరిత్ర
శిల్పారామం హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో ఐటి హబ్ దగ్గర, మాదాపూర్ ప్రాంతంలో సాంప్రదాయ చేతిపనుల పరిరక్షణకు సరైన వాతావరణాన్ని సృష్టించే ఆలోచనతో ఉద్భవించింది. ఇక్కడ ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు, సంక్రాంతి సందడి, ఉగాది ఉత్సవాలు, నవరాత్రులు లాంటి ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతీయ కళలు, చేతిపనుల ప్రోత్సాహం సంరక్షణ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. ఇటీవల దీనికి సారూప్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయబడింది. ఇది సంప్రదాయ కళలు, హస్తకళలు, గ్రామీణ జీవన శైలి, నైపుణ్యం, పండుగ సంస్కృతి, ప్రతిభను ఒకచోట చూడగల ఒక ‘కల్చరల్ విలేజ్’ గా ఇది నిలుస్తుంది.
“శిల్ప” అంటే శిల్పకళ లేదా శిల్పం అని, “ఆరామం” అంటే గ్రామం లేదా ఆశ్రయం అని అర్ధం. శిల్పారామం అనేది శిల్పకళలకు, కళాకారులకు, వారి నైపుణ్యాలకు ఒక పరిపూర్ణ వేదికగా పనిచేస్తుంది.
శిల్పారామం ప్రతిరోజూ, ఉదయం 10:30 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది. ఇది సోమవారం నుండి ఆదివారం వరకు వారంలో అన్ని రోజులూ తెరిచి ఉంటుంది. పండుగల సమయంలో సమయాలు మారవచ్చు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.20గా ఉంటుంది. సాదారణంగా నగర ప్రజలందరూ, శని ఆదివారాల్లో ఇక్కడ సేదతీరాడానికి, ఆటవిడుపుకు, షాపింగ్ చేయడానికి మంచి గమ్యస్థానంగా ఎంచుకుంటారు. మరి అలాంటి పర్యాటక ప్రదేశం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ప్రధాన ఆకర్షణలు
శిల్పారామం సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉంది. క్రాఫ్ట్స్ మ్యూజియం, కల్చరల్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, ఆడిటోరియం, వర్క్ షాప్స్, రీసర్చ్ డిజైన్ సెంటర్ లు ఉన్నాయి. ఇవేకాక ఆర్టిస్టులకు, విజిటర్స్ కు వసతి సదుపాయాలు కలవు. శిల్పారామం మొత్తం ఒక గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ గ్రామం మొత్తం తిరిగి చూపించటానికి బ్యాటరీ కారులు అద్దెకు దొరుకుతాయి. కానీ ఒక్కొక్కరు 15 రూపాయలు చెల్లించాలి.
పరిమితిలో డిజైన్లు, బొమ్మలు, హస్తకళలు మాత్రమే కాక, ఇక్కడ ప్రతి వస్తువు ఒక కథను చెప్తుంది. ప్రతి దారంలో చేతి కళాకారుల ప్రాభవం కనిపిస్తుంది. కళాకారులకు,చేతివృత్తుల వారికి దగ్గరగా వెళ్లి వాటి విశేషాలు తెలుసుకుంటూ వాటిని చూస్తుంటే మరో ప్రపంచంలో ఉన్నమా అనిపిస్తుంది. వాటిని కొనుగోలు చేసి ప్రతి ఒక్కరు తమ ఇంటిని మరింత అందంగా అలంకరించుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది.
క్రాఫ్ట్స్ బజార్
శిల్పారామం హృదయం క్రాఫ్ట్స్ బజార్ అని చెప్పాలి . ఇక్కడ దేశవ్యాప్తంగా విచ్చేసిన నైపుణ్య శిల్పకారులు వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. పొచంపల్లి, గద్వాల్ చీరలు, కలంకారీ పెయింటింగ్స్, కొండపల్లి కొయ్య బొమ్మలు, బిద్రి లోహ శిల్పాలు, బంజారా తాపీరీ కుట్టెలు ఇలా మరెన్నో కళలు ఇక్కడ సందర్శకులని ఆకర్షిస్తాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వస్తువులను ఇక్కడ మధ్యవర్తులు లేకుండా కళాకారుల నుండి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. ఇది భారతదేశం మొత్తం నుండి వచ్చిన శిల్పకళలను ప్రత్యక్షంగా పరిచయం చేస్తుంది.
శిల్పారామంలో ఉన్న గ్రామీణ మ్యూజియం నిజమైన భారత గ్రామాల జీవితం ఎలా ఉంటుందో ఒక చిన్న ప్రతిరూపాన్ని చూపుతుంది. జీవనశైలి, పనిముట్లు, వ్యవసాయ సామగ్రి, ఇంటి నిర్మాణాలు, సంస్కృతి ఇవన్నీ సజీవంగా కనిపిస్తాయి. ఇది పిల్లలకు, పెద్దలకు భారత గ్రామీణ జీవితం మీద ఆసక్తి పెంచే గొప్ప స్థలం.
పార్క్, రాక్ మ్యూజియం
శిల్పారామంలోని పార్క్ కుటుంబమంతా సేద తీరాడానికి, స్నేహితులతో కాలక్షేపం చేయడానికి, పిల్లలతో కలిసి ఉయ్యాల ఊగుతూ, సరదాగా ఆటపాటలతో గడపడానికి ఒక మంచి ప్రదేశం. రాక్ మ్యూజియం లో అయితే విభిన్న రకాల శిల్పాలు, ఆధునిక సంప్రదాయకృత శిల్పకారులను ప్రతిఫలించే కళాకృతులు ఉన్నాయి. ఇది నైపుణ్యానికి, ఆధునికతను జోడించి ఏర్పాటు చేసిన ఒక కళాదామం, అలాగే ప్రకృతి కళ కలయికను తెలియచేసే ఒక వేదిక.
ఓపెన్-ఎయిర్ థియేటర్లు, ప్రదర్శన స్థలాలు
శిల్పారామంలో ఓపెన్ ఎయిర్ స్టేజీలు, థియేటర్లు, అమ్ఫీ థియేటర్‌లు సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలకు వేదికలు. ఇక్కడ ప్రతీరోజు భారత దేశంలోని వివిధ నాట్యరూపాలైన భరతనాట్యం, కుచిపూడి, కథక్, ఒడిస్సీలతో పాటు వివిధ ప్రాంతీయ జానపద నృత్యాలు ప్రదర్శింపబడతాయి.
గ్రామీణ జీవితం ప్రతిబింబించే రూరల్ మ్యూజియం
శిల్పారామంలో ఉన్న రూరల్ మ్యూజియం, శిల్పా పార్క్ ప్రాంతంలో భారత గ్రామీణ జీవితం ఎలా ఉంటుందో చూడవచ్చు. సంప్రదాయ కళలను ప్రతిఫలించే మట్టి (క్లే)తో చేసిన విభిన్న శిల్పాలు ఇక్కడ కొలువుతీరాయి. ఇక్కడ జీవ పరిమాణమైన చెట్ల మధ్యలో నిర్మించిన ఇళ్లు వాటిలో ఉన్న కళాకారుల మట్టి ప్రతిమలు అద్భుతంగా ఉంటాయి. కమ్మరి, కుమ్మరి, నేతన్నల నమూనాలు, మహిళలు ఇంట్లో పనిచేసుకుంటున్నారా అన్నట్టు ఉండే మట్టి శిల్పాలు శిల్పా రామానికి మరింత ప్రత్యేకతను తెస్తున్నాయి.
పండుగలు & సంబరాలు
శిల్పారామంలో ప్రతీసంవత్సరం పలు వేడుకలు, పండుగలు ఘనంగా నిర్వహిస్తారు.
సంక్రాంతి సందడి
శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి , ఇందులో గాంధీ శిల్ప బజార్, రకరకాల హస్తకళలు, జానపద కళలు, గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల వేషాలు, పిల్లల కోసం భోగి మంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఉంటాయి. ఇది సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామం వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.
ఈ పండుగ రోజుల్లో ప్రత్యేకంగా గాంధీ శిల్ప్ బజార్ నేషనల్ మేళా జరుగుతుంది. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాల శిల్పకారులు తమ హస్తకళా వస్తువులను ప్రదర్శించి అమ్ముతారు వీటిలో బిద్రి ఆర్ట్, బాంబూ కేన్ పాత్రలు, హస్తచిత్రాలు, సారీస్, బొమ్మలు వంటి ఎన్నో కళాకృతులు ఉంటాయి. గ్రామీణ ప్రముఖ నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. ఇవి సంప్రదాయ సంస్కృతిని చూపిస్తాయి. పండుగలో భాగంగా భోగి రోజు ప్రత్యేకంగా పిల్లల కోసం భోగి పళ్ల ఉత్సవం వంటి సరదా, సంప్రదాయక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో చిన్నపిల్లలు పాల్గొని సరదాగా గడుపుతారు. ప్రతి సాయంత్రం అమ్ఫిథియేటర్ వే దికలో సంగీతం, నృత్యం, శాస్త్రీయ ప్రదర్శనలు జరుగుతాయి. ఇది ఆ పండుగ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. చెక్క బొమ్మలు, జానపద చిత్రాలు, చేనేత వస్త్రాలు, బిద్రి కళ, వెండి ఫిలిగ్రీ, బాస్తార్ ఇనుప కళాఖండాలు వంటివి అందుబాటులో ఉంటాయి.
పెద్దలు, పిల్లలు ఎంతగానో ఆనందంగా గడిపేలా ఈ వేడుకలు పల్లెటూరి వాతావరణాన్ని రుచిచూపిస్తాయి. అచ్చం ఊరిలోని సంక్రాంతి వాతావరణాన్ని, భోగి మంటలను, కోడిపందాలను, సంక్రాంతి వంటకాల రుచులను, ఎడ్ల బండ్లను, పండుగ వేళ ఆస్వాదించవచ్చు. అలాగే తెలుగువారి కొత్త సంవత్సర వేడుక ఉగాది, నవరాత్రులు నృత్య, సంగీత ప్రదర్శనలు, ఆల్-ఇండియా క్రాఫ్ట్స్ మేళా దేశవ్యాప్తంగా కళాకారుల ప్రదర్శనలు ఇలా ప్రతీ పండుగను ప్రత్యేకంగా జరుపుతారు. ఈ వేడుకల సమయంలో మొత్తం శిల్పారామం ఒక జీవ కళా సాంస్కృతిక కేంద్రముగా మారుతుంది.
ఇక్కడ నిర్వహించే వర్క్‌షాప్‌ల ద్వారా పట్టు, నూలు పని, మట్టి పాత్రల తయారీ, వివిధ రకాల చేతిపనులు నేర్చుకోవచ్చు. గార్డెన్స్, సరస్సులు, రాక్స్, ఆకర్షణలు, ఫొటోలు కోసం అద్భుతమైన నేపథ్యాలుగా ఉంటాయి.
శిల్పారామం అసలైన లక్ష్యం భారతీయ సంప్రదాయ కళలను, గ్రామీణ జీవన శైలి విలువలను భవిష్యత్తుకు నిలబెట్టడం. ఇది కళాకారుల కోసం ఒక వేదికగా పనిచేస్తుంది, యువతను సంప్రదాయ కళలతో పరిచయం చేస్తుంది. పర్యాటకులకు భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుంది.
శిల్పారామంలో బోటింగ్
సాంస్కృతిక గ్రామంలో చిన్న జలాశయంలో ప్యాడిల్ బోటింగ్ ఆస్వాదించవచ్చు. ఇది ఒక చిన్న భూభాగంలో ఏర్పాటు చేసిన అందమైన నీటి ప్రాంతం, ఇక్కడ కుటుంబంతో కలిసి పల్లెటూరి వాతావరణం మధ్యలో సులభంగా బోటింగ్ చేస్తూ సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. మొదట శిల్పాల గ్యాలరీలు, హస్తకళల బజార్‌ను చూశాక కొంత సమయం ఈ బోటింగ్ జలాశయంలో సరదాగా గడపడానికి ఇది అనువైన ప్రదేశం. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి బోటింగ్ చార్జ్ సాధారణంగా రూ. 30 గా ఉంటుంది.
ఆహార వసతులు & రవాణా
శిల్పారామం, ఆర్ట్ ,క్రాఫ్ట్ ,కల్చరల్ సొసైటిలో సందర్శకుల కోసం క్రాఫ్ట్ బజార్ సమీపంలో చిన్న ఫుడ్ కోర్ట్‌లు, స్టాల్స్ అందుబాటులో ఉంటాయి, చాట్, మిర్చి బజ్జీ, జిలేబి, తియ్యటి శీతలపానీయాలు వంటివాటితోపాటు, టీ, కాఫీ, పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ లభిస్తాయి. అలాగే పండుగ సమయాల్లో సాంప్రదాయక రుచులు, పచ్చళ్లు, తినుబండారాలు వంటి రుచులతో ఆహారాన్ని ఆస్వాదించవచ్చు, అలాగే స్థానిక వంటకాలు, స౦ప్రదాయాలకు అనుగుణంగా ఇతర తినుబండారాలు కూడా లభిస్తాయి.
ఈ ప్రదేశానికి చేరుకోవడం చాలా సౌకర్యవంతం శిల్పారామం సమీపంలో బస్ స్టాప్ కు నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు వస్తాయి. అలాగే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర నుండి నడక లేదా ఆటో, క్యాబ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే ప్రాంగణంలో వ్యక్తిగత వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.
మొత్తంగా, ఒకే చోట కళ, క్రాఫ్ట్, జానపద సంగీత, నృత్యం, గ్రామీణ జీవనం, ఉత్సవాలు, కుటుంబ విహార అనుభవం, అత్యంత సమృద్ధిగా భారతీయ సాంప్రదాయ కళల వినోదం ఇవన్నీ శిల్పారామంలో సందర్శించే వారికి మంచి పర్యాటక అనుభవంగా లభిస్తాయి. ఇదొక ప్రతిభ, సంప్రదాయం, కళలకు అంకితమై సాగుతున్న ప్రత్యేకమైన సాంస్కృతిక గమ్యం.
