Let's talk: editor@tmv.in
శిమ్లాలో మూడో అంతర్జాతీయ ఫ్లయింగ్ ఫెస్టివల్ ప్రారంభం

శిమ్లాలో మూడో అంతర్జాతీయ ఫ్లయింగ్ ఫెస్టివల్ ప్రారంభం

Pinjari Chand
26 అక్టోబర్, 2025

మూడవ అంతర్జాతీయ శిమ్లా ఫ్లయింగ్ ఫెస్టివల్, ప్రీ-వరల్డ్ కప్, ప్రీ-ఏషియన్ లీగ్ ప్యారాగ్లైడింగ్ చాంపియన్ షిప్, ఎంఎస్ఎంఈ హాస్పిటాలిటీ సహకారంతో శనివారం శిమ్లా సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుంగా వద్ద ప్రారంభమైంది. అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరిగే ఈ నాలుగు రోజుల అంతర్జాతీయ ఈవెంట్‌లో భారత్, మలేషియా, ఫిన్లాండ్, ఇండోనేషియా, నేపాల్, సౌత్ కొరియా, చైనా నుంచి సుమారు 60 ప్యారాగ్లైడింగ్ పైలట్లు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. అలాగే ఇండియాలోని 10 రాష్ట్రాల నుంచి కూడా పోటీదారులు వస్తున్నారు.

ఈ ఫెస్టివల్‌ను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రధాన మీడియా సలహాదారు నరేష్ చౌహాన్ ప్రారంభించారు. సీఎంకు ఈరోజు కేబినేట్ మీటింగ్ ఉన్నందున రాలేకపోయారని తెలిపారు. ఆయన తొలి పోటీదారుల గ్రూప్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈవెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. చౌహాన్ మాట్లాడుతూ ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఎకో-టూరిజం, అడ్వెంచర్ క్రీడలను ప్రోత్సహించే ఒక ప్రయత్నం. ఏడు దేశాల నుంచి పైలట్లు, దేశంలోని పది రాష్ట్రాల నుంచి కూడా పోటీ దారులు వస్తున్నారు. చిన్న గ్రామంలో అంతర్జాతీయ స్థాయి ప్రీ-ఏషియన్ చాంపియన్ షిప్, ప్రీ-వరల్డ్ కప్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇది హిమాచల్‌లో పెరుగుతున్న అడ్వంచర్స్ స్పోర్ట్స్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. జుంగా భవిష్యత్ టూరిస్టు స్థలంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈవెంట్ నిర్వాహకుడు అరుణ్ రావత్ మాట్లాడుతూ ఈ పోటీ అంతర్జాతీయ స్థాయిలో అడ్వెంచర్, హాస్పిటాలిటీని కలిపే విధంగా రూపొందించాం. సేఫ్టీ, ప్రొఫెషనలిజం అన్ని ఏర్పాట్లను ఖచ్చితంగా చూసుకుంటున్నాం. అనుకోకుండా ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించడానికి నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్, స్టేట్ ఫోర్స్, వైద్య బృందాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. ముగ్గురు మహిళా పైలట్లు కూడా ఈ సంవత్సరం పోటీ చేస్తున్నారు. మలేషియా నుంచి ఇద్దరు , భారత్ నుంచి ఒకరని తెలిపారు.

హిమాలయాల్లో మొదటిసారిగా ఎగరడం ఒక సవాలుతో కూడిన అద్భుత అనుభవం. ఇక్కడ ల్యాండింగ్ హిల్స్ పై జరుగుతుంది, మలేషియాలోని మైదానాలపై కాకుండా. ఇక్కడ చాలా రిస్క్ ఉన్నప్పటికీ, చాలా మంచి అనుభవమని మలేషియా నుంచి వచ్చిన పారాగ్లైడర్ మొహమ్మద్ నఫీ బిన్ సులేమాన్ తెలిపారు.

ఈ వాతావరణంలో పశ్చిమ బెంగాల్ నుంచి శ్రేయాసి తమాంగ్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న అతికొద్ది మహిళా పైలట్లలో ఒకరు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ అనుభవజ్ఞులైన పైలట్లను చూసి స్ఫూర్తి పొందుతున్నాను. యువత, మహిళలు కూడా ఈ క్రీడలో పాల్గొనాలి.ఇది సరదా, శక్తివంతమైన అనుభవం, ప్రమాదకరమైనది కాదు. నేను గెలిచి మరింత మంది యువతులకు ప్రేరణగానిలవాలనుకుంటున్నాను.

సిక్కిం నుంచి వచ్చిన మరో గ్లైడర్ ఎమాన్ రుంటెల్ మాట్లాడుతూ జుంగా స్థలం కొంచెం కష్టమైనదే. కానీ చాలా సరదాగా ఉంది.కొత్తవారికి అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రయత్నించడానికి మంచి అవకాశంగా ఉంటుంది.

స్పానిష్ పైలట్ డేవిడ్ కాంట్రెరాస్ మాట్లాడుతూ హిమాచల్‌లోనూ మంచి పోటీ, అద్భుతమైన ఫ్లయింగ్ పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్థానిక పైలట్ల సంఖ్య పెరుగుతోంది. ఇది టూరిజం, క్రీడలకు మంచిది.

మండి జిల్లాకు చెందిన అనుభవజ్ఞుడైన పారాగ్లైడింగ్ పైలట్ మోహర్ ఠాకూర్ వృత్తిపరమైన శిక్షణ, భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్, ఎంఎస్ఎంఈ సెక్టార్ పలు పరిపాలన సంస్థల మద్దతుతో ఈ ఈవెంట్ అడ్వెంచర్ స్పోర్ట్స్, స్థానిక హాస్పిటాలిటీ వ్యాపారాల మధ్య బలమైన సహకారాన్ని అందిస్తోంది. ఈ ప్రాంతంలోని చాలా హోం‌మ్ స్టేల్స్ బుక్ అయ్యాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.

శిమ్లాలో మూడో అంతర్జాతీయ ఫ్లయింగ్ ఫెస్టివల్ ప్రారంభం - Tholi Paluku