Let's talk: editor@tmv.in
శిక్ష పడకుండా నేరస్తుడి నయా నాటకం

శిక్ష పడకుండా నేరస్తుడి నయా నాటకం

Panthagani Anusha
12 అక్టోబర్, 2025

చట్టం చేతికి చిక్కకుండా తప్పించుకోవడమే లక్ష్యంగా ఓ నేరగాడు తాను చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించిన విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మోసం చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు గోరఖ్‌పూర్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. పలు దొంగతనాలు, ఆయుధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను కోర్టు విచారణల నుంచి తప్పించుకోవడానికి ఈ నాటకం ఆడినట్లు అధికారులు తెలిపారు.

అరెస్టయిన వ్యక్తిని ఢిల్లీలోని ముంగేష్‌పూర్ గ్రామానికి చెందిన వీరేందర్ విమల్‌గా గుర్తించారు. బావానా పోలీస్ స్టేషన్ పరిధిలో, దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి పలు కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ల నుంచి శాశ్వతంగా తప్పించుకోవడానికి విమల్ 2021లోనే ప్లాన్ వేశాడు.

నకిలీ మరణ ధృవీకరణ పత్రంతో మోసం

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ఆదిత్య గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు నకిలీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరణ ధృవీకరణ పత్రాన్ని సంపాదించాడు. ఆ పత్రంలో తాను 2021 ఆగస్టు 24న మరణించినట్లు చూపించాడు. ఈ నకిలీ పత్రాన్ని కోర్టుకు సమర్పించడంతో విమల్ పై ఉన్న అన్ని చట్టపరమైన విచారణలు కోర్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది.

అయితే ఇటీవల పోలీసులు నిందితుడి తరపు వాళ్ళు సమర్పించిన పత్రాలను పునః పరిశీలించగా మరణ రికార్డుల్లో తేడాలు కనిపించాయి. కాగా ఈవిషయమై లోతుగా పరిశీలించిన అధికారులు విమల్ నిజంగా చనిపోలేదని నిందితుడు కోర్టు విధించే శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ నాటకమాడాడని తెలుసుకున్నారు. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి డిజిటల్ ట్రాకింగ్, నిరంతర నిఘా ద్వారా నిందితుడిని గోరఖ్‌పూర్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విమల్ నేర చరిత్ర చాలా ఏళ్ల నాటిది. కాగా నిందితుడు గతంలోనూ పారిశ్రామిక యూనిట్లు, నివాసాలలో దొంగతనాలు, వాహనాల చోరీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి నేరాలుచేసి పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత సైతం అతను దొంగతనాలు మానుకోలేదు. ఇక ప్రస్తుతం విమల్‌నుసంబంధిత సెక్షన్ ల కింద కేసు నమోదుచేసి తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు.

శిక్ష పడకుండా నేరస్తుడి నయా నాటకం - Tholi Paluku