Let's talk: editor@tmv.in
శాసనసభ సమావేశాల నిర్వహణపై డిప్యూటీ సీఎం కీలక సమావేశం

శాసనసభ సమావేశాల నిర్వహణపై డిప్యూటీ సీఎం కీలక సమావేశం

Gaddamidi Naveen
31 డిసెంబర్, 2025

శాసనసభ ప్రాంగణంలోని ఫస్ట్ అసెంబ్లీ హాల్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో సీనియర్ అధికారులతో కీలక సమావేశం జరిగింది. రానున్న శాసనసభ సమావేశాల నిర్వహణ, సభా వ్యవహారాల పద్ధతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. శాసనసభ అనేది ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్న డిప్యూటీ సీఎం, అలాంటి ప్రతిష్టాత్మక వేదికలో అధికారులు అత్యంత అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ స‌మావేశంలో ఐటి, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, సభా నిర్వహణలో పారదర్శకత, సమర్థత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ముఖ్యంగా శాసనసభ సమావేశాల సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవసరమైన అన్ని విషయాలపై పూర్తి, ఖచ్చితమైన సమయానుకూల సమాచారాన్ని పొందేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశ్నోత్తరాలు, చర్చలు, బిల్లులు, తీర్మానాలు వంటి అంశాలపై స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉంటేనే సభా చర్చలు సార్థకంగా సాగుతాయని ఆయన తెలిపారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సభలో ప్రజల సమస్యలను లేవనెత్తే సందర్భంలో, వారికి సరైన డేటా, వాస్తవ సమాచారం అందించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడతాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సభా వ్యవహారాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా శాసనసభ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలాగే, శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని, అవసరమైన సమాచారం సకాలంలో సమీకరించి సభకు అందించాలని అధికారులకు సూచించారు. శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా, గౌరవప్రదంగా, ప్రజాస్వామ్య పరంగా విజయవంతంగా సాగేలా ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా సభలను నిర్వహించాలని సీరియస్‌గా ఆలోచిస్తోందని, ప్రజలకు, సభ్యులకు జవాబుదారీగా ఉండాలన్న ధృడ సంకల్పంతో పనిచేస్తోందని చెప్పారు. మంత్రులు సభలకు పూర్తి సన్నద్ధతతో వస్తున్నారని, అధికారులు కూడా సభల రోజుల్లో పూర్తి సమాచారంతో అందుబాటులో ఉండాలని ఆయ‌న‌ సూచించారు.

శాసనసభ, మండలి సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా లైవ్‌లో ప్రసారం అవుతాయని, ప్రభుత్వం పరిపాలనలో సాధించిన విజయాలు సభలోనూ ప్రతిబింబించాల్సిన అవసరం ఉందన్నారు. ఉభయ సభలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించకుండా మీడియాలో ప్రచురిస్తే అది చట్టసభల హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… చట్టసభల గౌరవం, ఔన్నత్యం పెంచేలా సమావేశాలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జీరో అవర్ ప్రశ్నలు, పెండింగ్ నివేదికలు, హామీలపై పూర్తి సమాచారం సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అసెంబ్లీ, కౌన్సిల్ కార్యదర్శులు, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.