
శాసనసభ ప్రాంగణంలో 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో 'తెలంగాణ తల్లి' విగ్రహం కోట్లాది మంది పోరాట యోధులకు స్ఫూర్తిదాయక చిహ్నంగా నిలిచింది. ఇప్పటికే, డిసెంబర్ 9, 2024న సచివాలయ ప్రాంగణంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం రూపొందించిన ఈ నూతన విగ్రహ నమూనాపై గతంలో రాజకీయ దుమారం రేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడిన నమూనా కంటే భిన్నంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు అధికారికంగా తెలంగాణ తల్లి చిత్రాన్ని ఆవిష్కరించలేదని, పదేళ్లపాటు ఆమెను వివక్షకు గురిచేశారని ఆరోపించారు.ప్రస్తుత ప్రభుత్వం ఖరారు చేసిన ఈ రూపం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన 'బహుజనుల' ఆకాంక్షలకు ప్రతిరూపమని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకున్నారు.
