Let's talk: editor@tmv.in
శాసనమండలిలో 'లడ్డూ' లొల్లి: హెరిటేజ్‌ నెయ్యి సరఫరాపై వైసీపీ ఆందోళన

శాసనమండలిలో 'లడ్డూ' లొల్లి: హెరిటేజ్‌ నెయ్యి సరఫరాపై వైసీపీ ఆందోళన

Pinjari Chand
18 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి సరఫరా అంశం సభను కుదిపేసింది. ఇందాపూర్‌ డెయిరీ పేరుతో ‘హెరిటేజ్‌’ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ వైఎస్ఆర్‌సీపీ సభ్యులు చేపట్టిన ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరగడంతో సభ వాయిదా పడింది.

‘గోవిందా.. గోవిందా’ నినాదాలతో హోరు

సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్‌సీపీ సభ్యులు లడ్డూ నెయ్యి అంశంపై చర్చకు పట్టుబట్టారు. ఇందాపూర్ డెయిరీ మాటున హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేసిందని ఆరోపిస్తూ ప్లకార్డులతో ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ‘గోవిందా.. గోవిందా’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల మొండిపట్టుతో సభలో గంట సేపు ఎటుచూసినా నినాదాలే వినిపించాయి.

ఆధారాలు ఎక్కడ? - మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

వైకాపా సభ్యుల ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారానికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. కనీస ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు ఉంటే చూపాలి తప్ప ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదు అని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తీవ్రమవడంతో పరిస్థితి అదుపు తప్పింది.

మరోవైపు అసెంబ్లీ చరిత్రలోనే అరుదైన దృశ్యం మంగళవారం చోటుచేసుకుంది. సాధారణంగా ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ, మండలి సమావేశాలు గంట ఆలస్యంగా అంటే 10 గంటలకు ప్రారంభమయ్యాయి.