
శాసనమండలిలో నెయ్యి వివాదం:దేవుడి ఫోటోలతో విపక్ష నేతల నిరసన
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శుక్రవారం రణరంగాన్ని తలపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలు, ఇండాపూర్ డెయిరీ వివాదం సభను కుదిపేశాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్టుదల, ప్రభుత్వ పక్షం ప్రతిఘటనతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం
సభ ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ సభ్యులు కుంబా రవిబాబు, డి. మాధవరావు, ఎస్. మంగమ్మ అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చారు. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి సరఫరా, ఇండాపూర్ డెయిరీకి హెరిటేజ్ సంస్థతో ఉన్న సంబంధాలపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తోసిపుచ్చిన అంశాన్ని మళ్లీ ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని చైర్మన్ స్పష్టం చేశారు. కాగా చైర్మన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో సభలో గందరగోళం మొదలైంది.
దేవుడి ఫోటోల ప్రదర్శనపై మంత్రి ఆగ్రహం
నిరసనలో భాగంగా ప్రతిపక్ష సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను సభలో ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. "రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని సభలోకి లాగడం అత్యంత దురదృష్టకరం ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన చర్యగా అభివర్ణిస్తూ సభ గౌరవాన్ని మంటగలిపిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు.
ఇండాపూర్ డెయిరీ - హెరిటేజ్ లింకుపై జగన్ ఆరోపణలు
మరోవైపు గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఫిబ్రవరి 10 వరకు ఇండాపూర్ డెయిరీని హెరిటేజ్ సంస్థ తన సొంత తయారీ యూనిట్‌గా చూపించిందని వివాదం మొదలయ్యాక ఫిబ్రవరి 15న దానిని 'కో-మాన్యుఫ్యాక్చరింగ్' యూనిట్‌గా మార్చారని ఆయన ఆరోపించారు. టిటిడి టెండర్లలో లబ్ధి పొందేందుకే ఈ మార్పులు చేశారని, ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు భయపడుతోందని జగన్ విమర్శించారు.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13న అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి నాయుడు, హెరిటేజ్ సంస్థను లడ్డూ కల్తీ వివాదంతో అనుసంధానించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీకి తమ సంస్థకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లాభం పొందలేదని భవిష్యత్తులో కూడా పొందబోమని పేర్కొన్నారు. హెరిటేజ్‌ను కుటుంబ జీవనోపాధి కోసం నడిపే సంస్థగా పేర్కొంటూ ప్రతిపక్షం సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
సభ మొదట వాయిదా అనంతరం మళ్లీ సమావేశమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో మండలి చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
