Let's talk: editor@tmv.in
శాతవాహనుల వైభవానికి సజీవ సాక్ష్యం: కొండాపూర్

శాతవాహనుల వైభవానికి సజీవ సాక్ష్యం: కొండాపూర్

Dantu Vijaya Lakshmi Prasanna
1 ఫిబ్రవరి, 2026

తెలంగాణ ప్రాంతం ప్రాచీన కాలం నుండే ఆధ్యాత్మికతకు, ముఖ్యంగా బౌద్ధమత ప్రాభవానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన ఫణిగిరి, నేలకొండపల్లి, బాదాంకుర్తి, ధూళికట్ట వంటి అనేక ప్రముఖ బౌద్ధ క్షేత్రాల సరసన కొండాపూర్ అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కేవలం ఒక మతపరమైన కేంద్రంగానే కాకుండా, శాతవాహనుల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యానికి నాణేల తయారీకి (టంకశాల) నెలవైన ఒక మహానగరంగా కొండాపూర్ చరిత్రలో నిలిచిపోయింది. నేటికీ ఇక్కడ లభిస్తున్న స్తూపాలు, చైత్యాలు, రోమన్ నాణేలు తెలంగాణ నేల ఏనాడో ప్రపంచ దేశాలతో కలిగి ఉన్న సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరి అలాంటి చారిత్రక ప్రదేశం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

కొండాపూర్ చారిత్రక ప్రాభవం

సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ శాతవాహన కాలపు వైభవానికి, బౌద్ధమత ప్రాశస్త్యానికి సజీవ సాక్ష్యం గా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాచీన నగరాలలో కొండాపూర్ ఒకటి. ఇది కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, రెండు వేల ఏళ్ల కిందట అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా వర్ధిల్లిన మహానగరం. శాతవాహన చక్రవర్తుల కాలంలో ఈ ప్రాంతం రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా అత్యంత కీలక భూమిక పోషించింది. నేడు మట్టి దిబ్బల కింద నిద్రాణమై ఉన్న ఈ నగరం, మన పూర్వీకుల నాగరికతకు అద్దం పడుతోంది.

కొండాపూర్ గ్రామం సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి సుమారు 15 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్-జహీరాబాద్ జాతీయ రహదారి (NH 65) మీదుగా పెద్దాపూర్ నుండి 8 కి.మీ ప్రయాణిస్తే ఈ చారిత్రక ప్రదేశానికి చేరుకోవచ్చు. నాడు మంజీరా, మూసీ నదుల పరివాహక ప్రాంతంలో ఉండటం వల్ల, జల, రోడ్డు మార్గాల ద్వారా మచిలీపట్నం వంటి ఓడరేవులతో ఈ నగరానికి సత్సంబంధాలు ఉండేవి.

మెగస్తనీస్ 'ఇండికా'లో ప్రస్తావన

గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన 'ఇండికా' గ్రంథంలో శాతవాహనులకు 30 కోటగోడలున్న నగరాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొండాపూర్ చుట్టూ ఉన్న మట్టి గోడలు, రక్షణ వ్యవస్థను బట్టి చూస్తే, మెగస్తనీస్ చెప్పిన ఆ 30 ప్రముఖ నగరాలలో కొండాపూర్ ఒకటిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది శాతవాహనుల కాలంలో ఒక రక్షణ దుర్గంగా కూడా సేవలందించింది.

పురావస్తు పరిశోధనల ఆరంభం

1900 సంవత్సరంలో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హెన్రీ కౌసెన్స్ ఈ ప్రాంత విశిష్టతను మొదటిసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన ఇక్కడ మధ్యరాతి, కొత్తరాతి యుగాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత 1937లో నిజాం ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఖ్వాజా మహమ్మద్ అహ్మద్ నేతృత్వంలో జరిగిన శాస్త్రీయ తవ్వకాలు కొండాపూర్ అసలు రూపాన్ని బయటపెట్టాయి.

తవ్వకాల్లో ఇక్కడ 15 అడుగుల, 19 అడుగుల వ్యాసం కలిగిన రెండు బౌద్ధ స్తూపాలు లభించాయి. వీటితో పాటు చైత్యాలు, విహారాలు, బుద్ధుని పాద ముద్రలు, త్రిరత్న చిహ్నాలున్న కుండలు బయల్పడ్డాయి. క్రీ.శ. 1వ శతాబ్దం నాటి బ్రాహ్మీలిపి అక్షరాలున్న కుండలు ఇక్కడ బౌద్ధమతం ఎంతలా విస్తరించిందో తెలియజేస్తున్నాయి.

శాతవాహనుల నాణేల టంకశాల

కొండాపూర్ యొక్క ప్రత్యేకత ఇక్కడ దొరికిన వేలకొద్దీ నాణేలు. రాగి, వెండి సీసపు నాణేలతో పాటు, వాటిని ముద్రించడానికి ఉపయోగించే మూసలు ఇక్కడ భారీగా దొరికాయి. దీనిని బట్టి కొండాపూర్ శాతవాహనుల ప్రధాన 'టంకశాల' అని నిర్ధారించవచ్చు. ఇక్కడ లభించిన 1835 సీసపు నాణేలు ఆ కాలపు ఆర్థిక పుష్టిని సూచిస్తున్నాయి.

రోమన్ చక్రవర్తి ఆగస్టస్ కాలం నాటి బంగారు నాణేలు ఇక్కడ లభించడం విశేషం. ఇది ప్రాచీన కొండాపూర్ నగరానికి, సుదూర రోమ్ సామ్రాజ్యానికి మధ్య ఉన్న దృఢమైన వాణిజ్య సంబంధాలను రుజువు చేస్తోంది. మచిలీపట్నం ఓడరేవు ద్వారా సముద్ర మార్గంలో ఇక్కడి వస్తువులు విదేశాలకు ఎగుమతి అయ్యేవి.

ఇక్కడ తవ్వకాల్లో లభించిన టెర్రకోట (మట్టి) బొమ్మలు, గుర్రాలు, ఏనుగుల ఆకృతులు నాటి ప్రజల కళాభిరుచిని చాటుతున్నాయి. యక్ష దేవత, హరీతి (తల్లి-బిడ్డ) బొమ్మలు, విలువైన రాళ్లతో చేసిన పూసలు, దంతపు దువ్వెనలు, గాజులు, చెవి కమ్మలు నాటి ఉన్నతమైన జీవనశైలికి మరియు వృత్తి పనివారి నైపుణ్యానికి నిదర్శనాలు.

సాహిత్య, రాజకీయ ప్రాధాన్యత

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'బృహత్కథ'ను గుణాడ్యుడు ఇక్కడే రచించాడు. అలాగే శాతవాహన చక్రవర్తి హాలుడు ఈ ప్రాంతం నుండే పాలన సాగించాడని నమ్ముతారు. ఇది కొండాపూర్ కేవలం వ్యాపార కేంద్రమే కాక, సాహిత్య పరిపాలనా కేంద్రంగా కూడా వెలుగొందిందని స్పష్టం చేస్తోంది.

ప్రాచీన కాలంలో కొండాపూర్ ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లడానికి అక్కడి రవాణా వ్యవస్థ అత్యంత ప్రధాన కారణం. ఆనాడు కొండాపూర్ నుండి సాగిన జల రవాణా చూస్తే, కొండాపూర్ భౌగోళికంగా మంజీరా, మూసీ నదుల మధ్యలో ఉంది. ఈ నదుల ద్వారా సరకులను కృష్ణా నది వరకు చేరవేసేవారు. అక్కడి నుండి కృష్ణా నది జలమార్గం ద్వారా ఆంధ్ర తీరంలోని మచిలీపట్నం (మైసోలియా) రేవు పట్టణానికి రవాణా చేసేవారు. ఈ జలమార్గం రోమ్ సామ్రాజ్యం, ఇతర పశ్చిమ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన వారధిగా నిలిచింది. ఓడల గుర్తు ఉన్న శాతవాహన నాణేలు ఈ జల రవాణా ప్రాధాన్యతను ధృవీకరిస్తున్నాయి.

నదీ మార్గాలతో పాటు, కొండాపూర్ గుండా అనేక భూమార్గాలు ఉండేవి. నాడు పశ్చిమ తీరంలోని కళ్యాణ్, పైఠాన్ (ప్రతిష్ఠానపురం) వంటి నగరాలను, తూర్పు తీరంలోని ధాన్యకటకంతో కలిపే ప్రధాన వర్తక మార్గంలో కొండాపూర్ ఒక కీలకమైన మజిలీగా ఉండేది. ఎడ్ల బండ్లు, గుర్రపు స్వారీ ద్వారా వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేవారు. ఈ రహదారుల వెంట ప్రయాణికుల కోసం, వర్తకుల కోసం బౌద్ధ ఆరామాలు సత్రాలు విశ్రాంతి కేంద్రాలుగా పనిచేసేవి.

కొండాపూర్ మ్యూజియం

కొండాపూర్ పురావస్తు మ్యూజియం శాతవాహన కాలపు అద్భుత కళాఖండాలకు నిలయం. ఇక్కడ ప్రధానంగా రాగి, వెండి, సీసపు నాణేలతో పాటు నాణేలను తయారు చేసే మట్టి అచ్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తవ్వకాల్లో దొరికిన టెర్రకోట బొమ్మలు, అంటే ఏనుగులు, గుర్రాలు వంటి జంతువుల ఆకృతులు, యక్షుని బొమ్మలు, హరీతి (తల్లి-బిడ్డ) శిల్పాలు నాటి సామాజిక స్థితిగతులను ప్రతిబింబిస్తాయి. ఇవే కాకుండా, విలువైన రాళ్లతో చేసిన పూసలు, శంఖపు గాజులు, దంతపు దువ్వెనలు, ఇనుప పనిముట్లు, బౌద్ధమతానికి సంబంధించిన బ్రాహ్మీ లిపి అక్షరాలున్న మట్టి పాత్రలు ఇక్కడ భద్రపరచబడ్డాయి.

శాతవాహనుల కాలక్రమం

శాతవాహన సామ్రాజ్యం సుమారు క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు (దాదాపు 450 ఏళ్లు) దక్షిణ భారత దేశాన్ని ఏలింది. ఈ వంశానికి మూలపురుషుడు శ్రీముఖుడు. వీరి కాలక్రమంలో గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత శక్తివంతుడైన రాజుగా గుర్తింపు పొందగా, హాలుడు 'గాథాసప్తశతి' వంటి గొప్ప సాహిత్య గ్రంథాన్ని అందించాడు. కొండాపూర్ ఈ కాలక్రమంలో ప్రధానంగా క్రీ.పూ. 1వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలంలో ఒక కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా (ముఖ్యంగా నాణేల తయారీలో) అత్యున్నత దశను అనుభవించింది.

శాతవాహన వంశంలో 23వ రాజుగా బాధ్యతలు చేపట్టిన గౌతమీపుత్ర శాతకర్ణి, కనుమరుగవుతున్న తన వంశ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించాడు. ఇతడు శకులను, యవనులను ఓడించి 'క్షత్రియ దర్ప మాన మర్దన' అనే బిరుదు పొందాడు. ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ప్రకారం, ఇతని గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయని (త్రిసముద్ర తోయ పీత వాహన), అంటే ఇతని అధికారం దక్షిణ భారతం అంతటా విస్తరించిందని తెలుస్తోంది. శాతవాహన రాజ్యంలో కొండాపూర్ వంటి నగరాలు ఇతని కాలంలోనే ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.

సాంస్కృతిక పరంగా శాతవాహనుల పాలన ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు. 17వ రాజు హాలుడు ప్రాకృత భాషలో 'గాథాసప్తశతి' అనే శృంగార రస ప్రధానమైన కావ్యాన్ని రచించి కవివత్సలుడిగా పేరొందాడు. వీరి కాలంలోనే అమరావతి, నాగార్జునకొండ, కొండాపూర్ వంటి ప్రాంతాలు గొప్ప బౌద్ధ విజ్ఞాన కేంద్రాలుగా వర్ధిల్లాయి. విదేశీ వ్యాపారంలో భాగంగా రోమ్ సామ్రాజ్యంతో సంబంధాలు కలిగి ఉండటం, సముద్ర యానాన్ని ప్రోత్సహిస్తూ ఓడల గుర్తులు గల నాణేలను ముద్రించడం వీరి పాలనా దక్షతకు నిదర్శనం. హిందూ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించిన వీరు, తెలుగు నేల సంస్కృతికి బలమైన పునాదులు వేశారు.

శాతవాహనుల కాలంలో బౌద్ద౦

శాతవాహనుల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రాంతాలు బౌద్ధమతానికి స్వర్ణధామాలుగా విరాజిల్లాయి. శాతవాహన రాజులు హిందూ మతాభిమానులైనప్పటికీ, బౌద్ధమతాన్ని గొప్పగా ఆదరించి అనేక స్తూపాలు, చైత్యాలు, విహారాలను నిర్మించారు. ముఖ్యంగా కొండాపూర్‌లో బయల్పడిన 19 అడుగుల ఇటుక రాతి స్తూపం, అమరావతిలోని మహాస్తూపం వీరి నిర్మాణ శైలికి అద్దం పడతాయి. అమరావతి స్తూపాన్ని అద్భుతమైన శిల్పకళతో, పాలరాతి పలకలతో అలంకరించి ప్రపంచ ప్రసిద్ధికెక్కిన 'అమరావతి శిల్పకళా' రీతికి పునాది వేశారు. కొండాపూర్‌లోని తవ్వకాల్లో లభించిన బుద్ధుని పాద ముద్రలు, త్రిరత్న చిహ్నాలు ఆనాడు ఈ ప్రాంతం బౌద్ధ భిక్షువులకు నివాసంగా, విద్యా కేంద్రంగా ఉండేదని స్పష్టం చేస్తున్నాయి.

స్తూపాలతో పాటు, కొండలను తొలిచి నిర్మించిన గుహాలయాలు, వీరి కాలంలోనే ప్రాచుర్యం పొందాయి. అజంతా, కార్లే, నాసిక్, కన్హేరి వంటి ప్రసిద్ధ గుహాలయాల్లో శాతవాహనుల నిర్మాణ కౌశలం కనిపిస్తుంది. కార్లేలోని చైత్యం భారతదేశంలోనే అతిపెద్ద అందమైన చైత్యగృహంగా పరిగణించబడుతుంది. వీరు భిక్షువుల కోసం నిర్మించిన 'విహారాలు' కేవలం నివాసాలే కాకుండా, గొప్ప విజ్ఞాన భాండాగారాలుగా సేవలందించాయి. నాగార్జునకొండ, ధాన్యకటకం (అమరావతి) వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యాబోధన జరగడం వీరి నిర్మాణ ప్రాశస్త్యానికి నిదర్శనం.

కొండాపూర్ కేవలం ఒక పురావస్తు ప్రదేశం మాత్రమే కాదు. అది మన తెలంగాణ ప్రాచీన వైభవానికి నిలువుటద్దం. రెండు వేల ఏళ్ల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా, శాతవాహనుల టంకశాలగా, గొప్ప బౌద్ధ విజ్ఞాన క్షేత్రంగా వెలుగొందిన ఈ నగరం, కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుత నాగరికతను మనకు పరిచయం చేస్తోంది.

సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చారిత్రక ప్రదేశంలో ఇప్పటివరకు కేవలం 5 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలు జరిగాయి. మిగిలిన 95 శాతం భాగం నేటికీ భూగర్భంలోనే దాగి ఉంది. హరప్పా, మొహెంజొదారో తరహాలో ఇక్కడ పూర్తిస్థాయి తవ్వకాలు జరిపితే, మరెన్నో అద్భుతాలు వెలుగుచూస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖ దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, భావితరాలకు మన గొప్ప చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేడు మట్టి దిబ్బల కింద ఉన్న ఈ చారిత్రక సంపదను పూర్తిస్థాయిలో వెలికితీసి, అభివృద్ధి పరచడం మన బాధ్యత. అమరావతి లేదా నాగార్జునకొండ తరహాలో కొండాపూర్‌ను కూడా ఒక అంతర్జాతీయ పర్యాటక, పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దగలిగితే, మన పూర్వీకుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, రాబోయే తరాలకు ఒక గొప్ప వారసత్వాన్ని అందించిన వారమవుతాం.

సందర్శకుల కోసం..

హైదరాబాద్ నుండి కొండాపూర్ సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి ముంబై జాతీయ రహదారి (NH 65) మీదుగా పటాన్‌చెరు, సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ గ్రామం వస్తుంది. అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొండాపూర్ మ్యూజియం చేరుకోవచ్చు. హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్ స్టేషన్ నుండి జహీరాబాద్ లేదా నారాయణఖేడ్ వెళ్లే బస్సు ఎక్కి పెద్దాపూర్ స్టేజీ వద్ద దిగాలి. అక్కడి నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి.

రైల్వే మార్గం చూస్తే, కొండాపూర్‌కు నేరుగా రైల్వే స్టేషన్ లేదు. సమీపంలోని రైల్వే స్టేషన్ శంకర్పల్లి (సుమారు 35 కి.మీ) లేదా లింగంపల్లి (సుమారు 50 కి.మీ). అక్కడి నుండి ప్రైవేట్ వాహనాలు లేదా బస్సుల ద్వారా సంగారెడ్డి చేరుకుని, అక్కడి నుండి కొండాపూర్ వెళ్ళవచ్చు.

మ్యూజియం సమయాలు:

ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఉంటుంది. సాధారణంగా శుక్రవారం మ్యూజియం మూసివేసి ఉంటుంది (కేంద్ర పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం). కాబట్టి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోండి. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండ తక్కువగా ఉన్నప్పుడు వెళ్తే అక్కడ ఉన్న బయటి తవ్వకాలను చూడటం సులభమవుతుంది.