
శాంతి వద్దంటే సైనిక చర్యే: ఉక్రెయిన్‌కు పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్ శాంతికి ముందుకు రాకపోతే, సైనిక చర్యల ద్వారానే తమ లక్ష్యాలను సాధిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలో రష్యా సాయుధ దళాల కమాండ్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థలు టాస్, ఆర్‌టీ వెల్లడించాయి. “ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతిని కోరుకోకపోతే, మా లక్ష్యాలను సైనిక శక్తితోనే సాధిస్తాం” అని పుతిన్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న బఫర్ జోన్ పనులు సజావుగా కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు.
యుద్ధ రంగంలో రష్యా పట్టు
తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్, జపోరోజియా ప్రాంతాల్లో రష్యా సైన్యం ముందుకు సాగుతోందని పుతిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యుద్ధరంగం మొత్తం మీద రష్యా దళాలు ఆధిపత్యం సాధిస్తున్నాయని చెప్పారు. జపోరోజియా ప్రాంతంలోని గుల్యాయిపోలే, డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని డిమిట్రోవ్ పట్టణాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా సైన్యాధికారులు పుతిన్‌కు వివరించినట్లు సమాచారం. రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వలెరీ గెరాసిమోవ్‌తో పాటు వివిధ యుద్ధ బృందాల కమాండర్లతో సమావేశం అనంతరం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కీవ్‌లోని పాలకులు శాంతియుత పరిష్కారానికి ఆసక్తి చూపడం లేదని రష్యా నాయకత్వం అభిప్రాయపడింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడి ‘రెడ్ లైన్స్’
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా ఆక్రమించిన తమ భూభాగాలు, జపోరోజియా అణు విద్యుత్ కేంద్రం విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇవి తమ దేశానికి 'రెడ్ లైన్స్' (దాటకూడని గీతలు) అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే, తాను సొంతంగా తీసుకోనని, ప్రజల అభిప్రాయం తీసుకుంటానని జెలెన్‌స్కీ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు ఫ్లోరిడాకు వెళ్తూ జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పలు పోస్టులు చేశారు. భవిష్యత్ శాంతి ఒప్పందంలో పెండింగ్ అంశాలను తగ్గించడమే ఉక్రెయిన్ లక్ష్యమని చెప్పారు. అయితే భూభాగాలు, అణు విద్యుత్ కేంద్రం, జాతీయ భద్రత వంటి అంశాలు అత్యంత సున్నితమైనవని పేర్కొన్నారు. శాంతి ప్రక్రియలో బలమైన భద్రతా హామీలు తమకు అత్యంత ముఖ్యమని జెలెన్‌స్కీ నొక్కి చెప్పారు. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల నాయకుల తాజా వ్యాఖ్యలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
