శాంతి చర్చల్లో ప్రతిష్టంభన.. అట్టుడుకుతున్న పశ్చిమాసియా
పశ్చిమాసియాలో శాంతి చర్చలు ఎటూ తేలకపోవడంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అక్కడి కీలక ఆయుధ తయారీ కేంద్రాలపై భారీగా దాడులు చేసింది. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఈ దాడులు ఇంకా ఉధృతమవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గట్టిగా హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ కూడా అస్సలు తగ్గకుండా ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుండటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి.
టెహ్రాన్ లక్ష్యంగా భారీ దాడులు
ఇజ్రాయెల్ క్షిపణులు శుక్రవారం టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాలను, ఆయుధ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పశ్చిమ ఇరాన్‌లోని లాంచర్లు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ పౌరులపైకి క్షిపణులను ప్రయోగిస్తున్న ఇరాన్ ఉగ్రవాద పాలనకు తగిన బుద్ధి చెబుతామని ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. ఈ దాడుల వల్ల ఇరాన్‌లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,900 దాటినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు
తనపై జరుగుతున్న దాడులకు బదులుగా ఇరాన్ 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4' పేరుతో ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవులోని ఇంధన నిల్వ కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలే కాకుండా.. సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైకి డ్రోన్లను ప్రయోగించింది. ముఖ్యంగా కువైట్‌లోని షువైక్, ముబారక్ అల్ కబీర్ ఓడరేవులు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ దగ్గర చమురు కొంటున్న చైనాకు చెందిన ప్రతిష్టాత్మక 'బెల్ట్ అండ్ రోడ్' ప్రాజెక్టులో భాగమైన ముబారక్ అల్ కబీర్ పోర్టుపై కూడా దాడి జరగడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇటు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను అక్కడి రక్షణ దళాలు గాలిలోనే కూల్చివేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించాయి.
సౌదీ రక్షణ కవచం.. వీసా వెసులుబాటు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పైకి దూసుకొచ్చిన అనేక డ్రోన్లను అక్కడి రక్షణ వ్యవస్థలు కూల్చివేసాయి. అయితే ఈ యుద్ధ వాతావరణం వల్ల విమాన ప్రయాణాలు నిలిచిపోయి సౌదీలో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 26 తర్వాత వీసా గడువు ముగిసిన వారు ఏప్రిల్ 18 వరకు ఉచితంగా పొడిగించుకోవచ్చని లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లవచ్చని సౌదీ హోం శాఖ వెల్లడించింది.
హుర్ముజ్ జలసంధిపై ట్రంప్ డెడ్‌లైన్
ప్రపంచ చమురు రవాణాకు కీలలకమైన హుర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలత వ్యక్తం చేస్తూనే, జలసంధిని తెరవడానికి ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించారు. ఇరాన్ తన చిత్తశుద్ధిని చాటుకోవడానికి 10 భారీ చమురు నౌకలను విడుదల చేసిందని, చర్చలు బాగున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము ఎలాంటి చర్చల్లో పాల్గొనడం లేదని, తమ దేశ రక్షణే తమకు ముఖ్యం అని ఐక్యరాజ్యసమితిలో తేల్చి చెప్పింది.
అమెరికా అదనపు బలగాల మోహరింపు
పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా, పశ్చిమాసియాకు అదనంగా 10,000 మంది సైనికులను, మెరైన్ బలగాలను పంపాలని నిర్ణయించింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా 15 అంశాలతో కూడిన యుద్ధ విరమణ ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచింది. ఇందులో అణు కార్యక్రమాలపై ఆంక్షలు, జలసంధిని తెరవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. అయితే ఇరాన్ దీనిని తిరస్కరించి తన సొంత 5 అంశాల ప్రతిపాదనను తెచ్చింది.
అణు ప్రమాద హెచ్చరికలు
ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో క్షిపణులు పడటం పట్ల అంతర్జాతీయ అణు శక్తి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఈ ప్లాంట్‌కు నష్టం వాటిల్లితే అది ఇరాన్‌తో పాటు పొరుగు దేశాల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతుందని, ఇది ఒక పెద్ద అణు విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇరు పక్షాలు అణు కేంద్రాల విషయంలో అత్యంత సంయమనం పాటించాలని కోరింది.
లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు
మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం హెజ్బుల్లాను అణచివేసే పనిలో నిమగ్నమైంది. హెజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ హసన్ మొహమ్మద్ బషీర్‌ను ఇజ్రాయెల్ హతం చేసింది. లెబనాన్ ప్రభుత్వం హెజ్బుల్లాను నియంత్రించకపోతే, తామే ఆ పని చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు లెబనాన్ వైపు 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ సైన్యానికి సిబ్బంది కొరత
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. దేశ రక్షణ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే వెంటనే 12,000 మంది కొత్త సైనికులు కావాలని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయల్ జమీర్ ప్రభుత్వాన్ని కోరారు. మతపరమైన కారణాలతో సైనిక విధులకు దూరంగా ఉంటున్న వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఉక్రెయిన్ - సౌదీ రక్షణ ఒప్పందం
ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సౌదీ అరేబియాలో పర్యటించి కీలక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అనుభవం ఇప్పుడు సౌదీకి ఉపయోగపడనుంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టే సాంకేతికతను సౌదీకి అందించేందుకు ఉక్రెయిన్ అంగీకరించింది.
మానవీయ సంక్షోభం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల సుమారు 82,000 భవనాలు ధ్వంసమయ్యాయని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులు జరగడం పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటంతో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. మరోవైపు ఈ భీకర యుద్ధంలో ఇరాక్ భద్రతా బలగాలకు చెందిన 80 మందితో పాటు 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఏకంగా 45 శాతం పెరిగి, బ్యారెల్ ధర 107 డాలర్లకు చేరుకుంది. ఈ చమురు ధరల పెరుగుదల వల్ల అటు అమెరికాలోని వాల్ స్ట్రీట్ నుంచి ఇటు ఆసియా మార్కెట్ల వరకు అన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హుర్ముజ్ జలసంధి వ్యవహారం త్వరగా పరిష్కారం కాకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగి సామాన్యుడిపై పెను భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
