
శాంతియుతంగా తెలంగాణ బంద్
తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగింది. ఈ బంద్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ పార్టీలు, ప్రజా యూనియన్లు, స్వచ్చంధంగా బంద్ లో పాల్గోన్నాయి. వ్యాపారాలు, విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అలాగే కుల, వ్యాపార సంఘాలు సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో, నగరాల్లో కొంత మంది బీసీ నాయకులు తెరిచిన ఉన్నపెట్రోల్ పంప్, షోరూమ్‌లు, దుకాణాలపై రాళ్లతో దాడి చేయడంతో, బంద్ హింసాత్మకంగా మారింది.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించమని సంఘాలకు శుక్రవారం సూచించినప్పటికీ, హైదరాబాద్‌లో కొన్ని హింసాత్మక సంఘటనలు సంభవించాయి. నల్లకుంటలో ఓ తెరిచిన పెట్రోల్ పంప్‌పై దాడి చేయడం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌పై రాళ్లతో దాడి చేయడం, అలాగే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌ను బలవంతంగా మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడులు స్థానిక వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందికర పరిణామాలను సృష్టించాయని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక పోలీసులు,డీజీపీ శాంతిని కాపాడేందుకు రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
అంబర్‌పేట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల బైక్ ర్యాలీ: బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు
అంబర్‌పేట్‌లోని ప్రధాన కూడలి నుండి తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు మద్దతుగా యూత్ కాంగ్రెస్ నేత మోత రోహిత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు , పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా యువతకు బీసీ సమాజం సమస్యలపై అవగాహన పెంపొందించడం, బంద్ ప్రణాళికకు మద్దతు వ్యక్తం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. యువకులు శాంతియుతంగా, ర్యాలీని నిర్వహించారు. ఆర్టీసీక్రాస్ రోడ్ పక్కన ముషీరాబాద్ డిపో2 వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, బీసీ జేఏసీ బంద్ కు మద్దతుగా నిరసన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ బంద్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వీరు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలపై బీసీలకు చట్టసభలలో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి బంద్‌కు మద్దతు
బీసీల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్మించేందుకు ఆటోలతో ర్యాలీగా వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ బంద్ కు మద్దతు తెలపడం అంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉందన్నారు. అలాగే తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తదని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని తెలిపారు.
పెద్దపల్లిలో కుల సంఘాల, వ్యాపారుల మద్దతు
పెద్దపల్లిలో ఉన్న అన్ని కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులు, బంగారు దుకాణాలు, బట్టల షాపులు, పూలు–పండ్లు–కూరగాయల దుకాణాలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సర్వీస్ సెక్టార్ దుకాణాలు, వాహనాల షోరూంలు, ఎలక్ట్రానిక్స్ షోరూంలు ఇతర వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. అలాగే బంద్ కు మద్దతుగా పెద్దపల్లిలోని అన్ని కుల, చిన్న వ్యాపారుల సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశాయి.
జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్‌లో బీజేపీ బంద్‌కు మద్దతు
బీసీ సంఘాల జెఎసి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఇందులో భాగంగానే శనివారం ఉదయం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద తెలంగాణ బంద్ లో పాల్గొని ఎంపీ ఈటల రాజేంద్రర్ మద్దతు తెలిపారు. ఆయన మాట్టాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో చెప్పారని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసింది. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయి. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారని తెలిపారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వేచేశారు. బీసీ కమీషన్ వేశారు. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదన్నారు.
