
శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చట్టాన్ని ఉల్లంఘించే వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేత అంబటి రామబాబు అరెస్ట్, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని సూచించారు.
సొంత పార్టీ నేతలైనా సరే.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది
కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వెలుపల జరిగిన నిరసనలపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయడాన్ని ఆయన సమర్థించారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ (క్రైమ్ నం. 66/2026) నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టంచేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 189(2), 190, 292, 324(4) కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెచ్చగొట్టే ధోరణి వద్దు.. సంయమనం పాటించండి
వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాజకీయ భిన్నాభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యక్తం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని పునరుద్ఘాటించారు. పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్య విలువలే ముఖ్యం
అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పౌరుల రక్షణ తన ప్రభుత్వ ప్రాధాన్యతలలో అగ్రస్థానంలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పరిపాలన మరింత పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
