Let's talk: editor@tmv.in
శాసనసభలో నో సౌండ్… పెద్దల సభలోనే రీ సౌండ్

శాసనసభలో నో సౌండ్… పెద్దల సభలోనే రీ సౌండ్

FL - SIMHCLM
20 సెప్టెంబర్, 2025

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్దల సభే దిక్కయింది. 175 మంది సభ్యులున్న శాసన సభలో పార్టీకి కేవలం 11 స్థానాలే దక్కాయి. జగన్‌తో పాటు పలువురు సభ్యులు సభకు వెళ్లడం లేదు. దీంతో శాసన సభలో తెలుగుదేశం సంపూర్ణ ఆధిక్యత చూపుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాణి వినిపించడం లేదు. అక్కడ ఉన్నదే కొద్దిమంది.. వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళ జోరు చూసి సభకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీకి పెద్దల సభ మాత్రమే అండగా నిలుస్తోంది. వాస్తవానికి వైయస్ జగన్ 2019లో అధికారంలోకి వచ్చేసరికి శాసన మండలిలో ఇంకా తెలుగుదేశం పార్టీదేపై చేయిగా ఉండేది. పలు బిల్లులు శాసన సభలో ఆమోదం పొందినా మండలిలో టీడీపీ అడ్డుకునేది. దీంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి అప్పట్లో జగన్ లేఖ రాశారు.

అయితే కేంద్రం వద్ద ఈ బిల్లు పెండింగ్‌లో పడడంతో కొంతకాలం అది అలా ఆగింది. ఆ తరువాత శాసన మండలిలో టీడీపీ బలం క్రమంగా తగ్గిపోతూ.. వైసిపి బలం పెరగడంతో ఇక ఆ రద్దు లేఖ అక్కడితో ఆగిపోయింది. ఇక ఇప్పుడు జగన్ కు శాసన సభలో బలం పూర్తిగా తగ్గిపోయి కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. కానీ శాసన మండలిలోని మొత్తం 58 స్థానాల్లో జగన్ పార్టీకి 34 స్థానాలు ఉండగా కూటమికి 13 సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు శాసన మండలి ద్వారానే వైసిపి తన సౌండ్ ఎక్కువ చేస్తోంది. సభలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. ఇంకో మహిళా ఎమ్మెల్యే వరుదు కళ్యాణి వంటివాళ్ళు ప్రభుత్వాన్ని దీటుగా ప్రశ్నిస్తూ తమ పార్టీ ఉనికిని కాపాడుతున్నారు.. పలు అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో శాసనమండలి సభ్యులు కీలకంగా ఉన్నారు.

మండలి కనుక లేకపోయి ఉంటే ఈ రోజు చట్ట సభలలో వైసీపీ వాణి పూర్తిగా లేకుండా పోయేదని అంటున్నారు. శాసన సభ్యులు సభకు వెళ్లడం లేదు కానీ మండలి సభ్యులు మాత్రం సభలో గట్టిగానే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలువరిస్తున్నారు. దీంతో వైయస్ జగన్ పార్టీ వాణి సభలోను.. తద్వారా ప్రజల్లోనూ వినిపిస్తోంది. మొత్తానికి అప్పట్లో వద్దనుకున్న శాసన మండలి ఇప్పుడు వైయస్ జగన్ కు ఆదరువుగా నిలిచింది

శాసనసభలో నో సౌండ్… పెద్దల సభలోనే రీ సౌండ్ - Tholi Paluku