
శశిథరూర్ అవకాశవాది..కేసీ వేణుగోపాల్ ఓ రౌడీ: మణిశంకర్ అయ్యర్
పార్టీలో విభిన్న అభిప్రాయాలను భరించే శక్తి లేకపోతే అది కాంగ్రెస్‌కు వినాశనమే అవుతుందని సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మంగళవారం వ్యాఖ్యానించారు. విభేదించే వ్యక్తికి మర్యాదపూర్వకంగా కానీ దృఢంగా సమాధానం చెప్పే ధైర్యం లేకపోతే ఆ పార్టీకి పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ‘మణి టాక్’లో భాగంగా విడుదల చేసిన వీడియోలో అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది నెలలుగా ఆయన తన ఛానల్ ద్వారా వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు.
వ్యతిరేక స్వరాల వల్లే కాంగ్రెస్ జీవిస్తుంది. అనేక అభిప్రాయాల వల్లే అది ఎదుగుతుంది. దేవుడు ఒకడే అన్న వేద వాక్యంలా కాంగ్రెస్ కూడా ఒకటే. కానీ దేవుడిని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నట్లే కాంగ్రెస్‌ను చేరడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ పాఠాన్ని ప్రస్తుత నాయకత్వం మర్చిపోయిందని అయ్యర్ వ్యాఖ్యానించారు. నిజాయితీతో విభేదించే వారు రాజకీయ పరిధిలోనే ఉంటారని, కానీ అసత్యంగా విభేదాలను ప్రేరేపించే వారిని చరిత్రే శిక్షిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత వ్యవస్థ ఒక విభేదించే స్వరాన్ని భరించలేకపోతే అది కాంగ్రెస్‌కు అంతే అని హెచ్చరించారు. నేటి కాంగ్రెస్‌లో విమర్శలకు స్థలం లేదా?’ అనే శీర్షికతో విడుదల చేసిన ఇరవై మూడు నిమిషాల వీడియోలో ఆయన మాట్లాడుతూ, వ్యతిరేక స్వరం ప్రజాస్వామ్యానికి పునాది. దానికి మర్యాదపూర్వకంగా కానీ దృఢంగా సమాధానం చెప్పలేకపోతే మనం పాలించడానికి అర్హులం కాదు అని అన్నారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1989 మే 5న పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని అయ్యర్ ప్రస్తావించారు. ‘సెక్యులర్ భారత్ మాత్రమే నిలబడగలదు. భారత్ సెక్యులర్ కాకపోతే బహుశా అది నిలబడటానికి అర్హత ఉండకపోవచ్చు’ అని రాజీవ్ గాంధీ అన్నారని గుర్తుచేశారు. ఆ మాటలను రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ నోటితో మళ్లీ చెప్పించే ధైర్యం కాంగ్రెస్ ఉన్నత నాయకత్వానికి ఉందా అని సవాల్ విసిరారు.
రాజీవ్ గాంధీ కాలంలోనే పార్టీ లోపల విభేదాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొదటి విమర్శకుడిగా ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ ను పేర్కొన్నారు. అలాగే మాజీ ఆర్థిక మంత్రి వీపీ సింగ్ కూడా కాంగ్రెస్‌ను వదిలి వెళ్లారని చెప్పారు. అదేవిధంగా అరుణ్ నెహ్రు గురించి ప్రస్తావిస్తూ, బాబ్రీ మసీదు తాళాలు తెరవడంలో ఆయన పాత్ర ఉన్నట్లు తెలిసిన తరువాత రాజీవ్ గాంధీ ఆయనను కేబినెట్ నుంచి తొలగించారని అన్నారు. తరువాత బోఫోర్స్ వ్యవహారంలో కూడా ఆయన పాత్ర బయటపడిందని అయ్యర్ ఆరోపించారు.
ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు సంబంధం లేదు
అయ్యర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ దూరంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత హోదాలోనే మాట్లాడుతున్నారని తెలిపింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, అయ్యర్ తన సహచరులపై కూడా ఘాటుగా విమర్శలు చేశారు. తిరువనంతపురం ఎంపీ శిశిథరూర్ ను “సిద్ధాంతాలు లేని అవకాశవాది”గా పేర్కొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (సంఘటనా) కేసీ వేణుగోపాల్ ను రౌడీగా వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ నేత రమేశ్ చెన్నితలపై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరాను ఉద్దేశించి టట్టు అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల నుంచి పార్టీ దూరంగా ఉందని ఖేరా సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో అయ్యర్–కాంగ్రెస్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. తిరువనంతపురంలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మళ్లీ అధికారంలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే అనుభవాల ఆధారంగా చట్టాల్లో మార్పులు చేయాలని సూచించారు.
