Let's talk: editor@tmv.in
శశిథరూర్‌‌కు మద్దతిచ్చాకే.. నాకు అవమానాలు: బోర్డోలాయ్‌

శశిథరూర్‌‌కు మద్దతిచ్చాకే.. నాకు అవమానాలు: బోర్డోలాయ్‌

Pinjari Chand
29 మార్చి, 2026

అస్సాంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ప్రద్యూత్‌ బోర్డోలాయ్‌ ఇటీవల కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరిన నేపథ్యంలో, తన నిర్ణయానికి కారణాలను వెల్లడించారు. కాంగ్రెస్‌లో తనను నిర్లక్ష్యం చేశారని, ఒంటరిగా ఉంచారని, చివరికి ‘పర్సోనా నాన్ గ్రాటా’లా భావించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కలిగిన బోర్డోలొయ్, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో డిస్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

అంతర్గత ఎన్నికల సమయంలోనే..

పార్టీ అంతర్గత ఎన్నికల సమయంలో సమస్యలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశిథరూర్‌‌ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత తనపై వ్యవస్థపూర్వకంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుతూ శశిథరూర్ అభ్యర్థిత్వానికి నేను మద్దతిచ్చాను. కానీ ఎన్నికల తర్వాత నన్ను పక్కన పెట్టడం ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికైనప్పటికీ, ఆయన వ్యక్తిగతంగా తనను గౌరవించారని, అలాగే సోనియాగాంధీ కూడా ఎప్పుడూ వివక్ష చూపలేదని తెలిపారు. అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వమే తనను పక్కన పెట్టిందని అన్నారు. లోక్‌సభ చర్చల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఇవ్వలేదని, ఇచ్చినా చివర్లో పేరు పెట్టడంతో మాట్లాడే సమయం దక్కలేదని తెలిపారు. ఎంపీగా ఉన్నా, నా నియోజకవర్గం లేదా ఈశాన్య ప్రాంత సమస్యలను ప్రస్తావించే అవకాశం లేకపోవడం వల్ల నేను చేతకానివాడిని అనిపించుకున్నానని వాపోయారు.

2025 పంచాయతీ ఎన్నికల సమయంలో తనపై దాడి జరగడం తుది కారణమని చెప్పారు. మొదట ఈ దాడి బీజేపీ పని అనుకున్నప్పటికీ, తర్వాత అది కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రేరేపించిందని తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని, ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ నాయకులు వ్యవహరించారని ఆరోపించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఇమ్రాన్‌ మసూద్‌ కూడా ఆ ఎమ్మెల్యేకు అనుకూలంగా మాట్లాడారని అన్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్‌ గోగోయ్‌ తనను రక్షించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇది నాకు తీవ్ర అవమానంగా అనిపించింది. నా ఆరోపణలను తప్పుడుగా చూపించడంతో నమ్మకం కోల్పోయానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగలేనని భావించి పార్టీని వీడినట్లు తెలిపారు.

బీజేపీలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటీకీ అంగీకరించారు

బీజేపీలో చేరిన విషయంపై మాట్లాడుతూ, రాజీనామా చేసిన తర్వాత పార్టీ అగ్రనాయకత్వం తనను సంప్రదించిందని చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తనను కలిసినప్పుడు గౌరవం, స్వాభిమానం ముఖ్యమని స్పష్టం చేశానన్నారు. డిస్పూర్ నుంచి పోటీ చేయాలని బీజేపీ ప్రతిపాదన వచ్చింది. ఆలోచించి అంగీకరించాను. ఇది చాలా వేగంగా జరిగిందని తెలిపారు. తన అభ్యర్థిత్వంపై బీజేపీ లోపల కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, పార్టీ తనను ఒప్పుకుని సహకరిస్తోందని చెప్పారు. తన కుమారుడు ప్రతీక్‌ బోర్డోలాయ్‌ రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ, తన నిర్ణయం అతనిపై ప్రభావం చూపకూడదని చెప్పానని తెలిపారు. అయితే కుమారుడు కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడన్నారు. మార్చి 18న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బోర్డోలొయ్ బీజేపీలో అధికారికంగా చేరారు.

శశిథరూర్‌‌కు మద్దతిచ్చాకే.. నాకు అవమానాలు: బోర్డోలాయ్‌ - Tholi Paluku