Let's talk: editor@tmv.in
శిశువుల మృతికి బాధ్యులెవరు?

శిశువుల మృతికి బాధ్యులెవరు?

Panthagani Anusha
23 సెప్టెంబర్, 2025

రెండు నెలల క్రితం ఇండోర్‌లోని ప్రభుత్వ మహారాజా యశ్వంత్రావ్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు ఎలుకల కొరికిన ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఇద్దరి పసికందుల ప్రాణాలు పోవడానికి హాస్పిటల్ యాజమాన్యం, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని జై ఆదివాసీ యువ శక్తి (జేస్) అనే గిరిజన సంఘం హాస్పిటల్ ముందు నిరవధిక ధర్నా చేపట్టింది.

కాగా ఆదివారం నుంచి నిరసన హాస్పిటల్ ప్రధాన గేటు వద్ద చేపట్టారు. ఇక సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆసుపత్రి డీన్ డాక్టర్ అర్వింద్ ఘంగారియా , సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపించారు అంతేకాక ఇద్దరిని సస్పెండ్ చేసి, వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు

కాగా ఈ ఘటన ఆగస్టు 31 రాత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఉన్న పసికందులపై ఎలుకలు కొరికాయి. కాగా ఒక శిశువు వేళ్లను, మరొక శిశువు తల, భుజం భాగాలను కొరికినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు గిరిజన కుటుంబానికి, మరొకరు మైనారిటీ కుటుంబానికి చెందినవారు.

75 సంవత్సరాల చరిత్ర ఉన్న మహారాజా యశ్వంత్రావ్ హాస్పిటల్ మధ్యప్రదేశ్‌లోని అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటి. ఇది మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా పనిచేస్తోంది.ఇక ఈ నిరసనలపై హాస్పిటల్ తాత్కాలిక సూపరింటెండెంట్ డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్ స్పందిస్తూ శిశువులు పుట్టుకతోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతునన్నారని వారు చేసిన వైద్య పరీక్షల్లో తేలిందని పేర్కొన్నారు. అంతేకాక ఈ ఘటనపై ఇప్పటికే ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసారని మరోవైపు సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ ఆరోగ్య సమస్యల కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, నిరసనల కారణంగా హాస్పిటల్ ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారని హాస్పిటల్ సిబ్బంది వాదించినప్పటికీ జేస్ నాయకత్వం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టంగా ప్రకటించింది.

శిశువుల మృతికి బాధ్యులెవరు? - Tholi Paluku