Let's talk: editor@tmv.in
శరవేగంగా సారలమ్మ ప్రధాన ద్వార నిర్మాణ పనులు

శరవేగంగా సారలమ్మ ప్రధాన ద్వార నిర్మాణ పనులు

Gaddamidi Naveen
3 జనవరి, 2026

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మేడారం అభివృద్ధి పనులలో భాగంగా తాడ్వాయి మండలంలో నిర్మిస్తున్న సారలమ్మ ప్రధాన ద్వారం పనులను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. స్వయంగా పర్యవేక్షించారు.

సారలమ్మ ప్రధాన ద్వారానికి సంబంధించి పి.టి. బీమ్ అమర్చే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కమాన్ గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుందని తెలిపారు.ప్రధాన ద్వారంపై సారలమ్మ వనదేవత వంశవృక్షం, కోయ గిరిజన చిహ్నాలు ప్రత్యేక కళారూపాలను పొందుపరచనున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గద్దెల చుట్టూ అత్యాధునిక మోడల్ క్యూ లైన్లు, గ్రిల్స్ ఏర్పాటు పనులను కూడా ఆయన సమీక్షించారు.

జాతర నాటికి పనులన్నీ పూర్తి చేసి భక్తులకు ఆహ్లాదకరమైన, సులభతరమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలని గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా యంత్రాంగం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిందని, గద్దెల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర ఈ నెల జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరకు సుమారు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

శరవేగంగా సారలమ్మ ప్రధాన ద్వార నిర్మాణ పనులు - Tholi Paluku