Let's talk: editor@tmv.in
శరవేగంగా మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

శరవేగంగా మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

Panthagani Anusha
1 ఏప్రిల్, 2026

శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్నాయని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మూలాపేటతో పాటు రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులను కూడా 2026 చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్రాన్ని మౌలిక సదుపాయాల హబ్‌గా మారుస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మూలాపేట పోర్టుపై వైసీపీ చేస్తున్న విమర్శలను గణాంకాలతో సహా తిప్పికొట్టారు.

గత వైసీపీ ప్రభుత్వం పోర్టు పనుల విషయంలో ప్రజలను మభ్యపెడుతూ విష ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే, పక్కవారి కష్టాన్ని తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీకి జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో కేవలం ఆర్భాటపు శంకుస్థాపనలకే ప్రాధాన్యత ఇచ్చారని భూసేకరణ, ఉప్పు భూముల సమస్య పరిష్కారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల పంపిణీ వంటి కీలక అంశాలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. 2024 జూన్ నాటికి అంటే వైసీపీ అధికారం కోల్పోయే సమయానికి పోర్టు భౌతిక పురోగతి కేవలం 25.02 శాతంగానే ఉందని కానీ నేడు తాము అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే 44 శాతానికి పైగా పనులు పూర్తి చేసి మొత్తంగా 70 శాతం పురోగతి సాధించామని మంత్రి వివరించారు.

అదేవిధంగా పనుల పురోగతిని వివరిస్తూ బ్రేక్‌వాటర్ పనులు గతంలో 28.9 శాతం ఉంటే ఇప్పుడు అవి 88.82 శాతానికి చేరుకున్నాయని డ్రెడ్జింగ్ పనులు 81.47 శాతం బెర్త్‌ల నిర్మాణం 76.55 శాతానికి చేరుకున్నాయని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంలో అసలు ప్రారంభమే కాని ఆన్‌షోర్ మౌలిక వసతుల పనులను కూడా కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. ఆర్థికంగా చూసినా వైసీపీ ఐదేళ్లలో కేవలం రూ. 718 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం గత 20 నెలల్లోనే రూ. 1117 కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. 4 వంతు పనులు కూడా చేయలేని వైసీపీ నేతలు, నేడు 70 శాతం పనులు పూర్తి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

నిజంగా గత ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి గుండు సున్నా ఎందుకు చుడతారని మంత్రి ప్రశ్నించారు. మూలాపేట, విష్ణుచక్రం గ్రామాల్లో పునరావాస పనులు, భూసేకరణ వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఇప్పటికే విష్ణుచక్రం గ్రామంలో పునరావాసం పూర్తి చేశామని తెలిపారు. కేంద్రం నుంచి 385.24 ఎకరాల ఉప్పు భూములకు అనుమతులు సాధించిన ప్రాజెక్టు అడ్డంకులను తొలగించామన్నారు. రాజకీయ ఉనికి కోసం ‘చలో మూలాపేట’ వంటి జిమ్మిక్కులు మాని, ఇప్పటికైనా వైసీపీ వాస్తవాలు తెలుసుకోవాలని లేనిపక్షంలో ఆ పార్టీకి భవిష్యత్తులో నామరూపాలు ఉండవని మంత్రి హెచ్చరించారు.