Let's talk: editor@tmv.in
శూర్పణఖ దహనం చేస్తాం

శూర్పణఖ దహనం చేస్తాం

Pinjari Chand
21 సెప్టెంబర్, 2025

ఇటీవల భర్తలను అన్యాయంగా చంపిన భార్యల తీరుకు నిరసనగా ఇండోర్​ లో శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహిస్తామని పౌరుష్ సంస్థ అధ్యక్షుడు అశోక్​ దశోరా తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన సోనమ్​ రఘువంశీ, ముస్కాన్, నికితా సింఘానియా​ తదితర పది మంది మహిళలు తమ భర్తలను అత్యంత క్రూరంగా చంపి ఇండోర్​ కు చెడ్డ పేరు తెచ్చారు. దీంతో భర్తలను కర్కశంగా చంపిన పదిమంది మహిళలతో కూడిన పోస్టర్​ ను విడుదల చేశారు. అందులో హనీమూన్​ కు భర్తను తీసుకెళ్లి మర్డర్​ చేసిన సోనమ్, మరో ఘటనలో భర్తను చంపి డ్రమ్ములో వేసిన ముస్కాన్​ ఫోటోలున్నాయి. దీంతో వీరి దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తామని అశోక్​ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఎవరూ చేయకూడదని హెచ్చరించారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీవో

దసరా పండుగకు ఎవరైనా రావణ దహనాలు చేస్తారు. కానీ ఈ పురుష హక్కుల సంస్థ శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించడం చాలా పెద్ద తప్పు అని జ్వాలా అనే ఎన్జీవో అధ్యక్షురాలు దివ్యాగుప్తా మండిపడ్డారు. మహిళలందరికీ ఈ పదిమంది నిందితులు ఏమైనా ప్రతినిధులా? అని ప్రశ్నించారు. మరి నిత్యం పురుషుల చేతిలో వేధింపులకు గురవుతున్న మహిళల పరిస్థితి ఏమిటి? వారు ఈ విధంగానే చేయాలా అని నిలదీశారు. ఇటువంటి అనాలోచిత కార్యక్రమాలకు ఎవరు అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదన్నారు.