
శబరిమల సంప్రదాయాలను ఇతరులు సవాలు చేయవచ్చా?: సుప్రీం
శబరిమల ఆలయ సంప్రదాయాలను అయ్యప్ప స్వామి భక్తులు కానివారు సవాలు చేయగలరా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మతాచారాలపై మహిళల వివక్ష ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తున్న తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధ్యక్షత వహిస్తున్నారు. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఎంఎం సుంద్రేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి వరాలే, ఆర్ మహాదేవన్, జాయ్‌మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు.
పీఐఎల్‌పై కీలక ప్రశ్న
మత స్వేచ్ఛ పరిధి, ఆచారాల చట్టబద్ధత వంటి అంశాలపై కోర్టు ఏడు ప్రశ్నలను రూపొందించింది. వాటిలో ముఖ్యమైన ప్రశ్న – ఒక మతానికి చెందని వ్యక్తి ఆ మతంలోని ఆచారాలను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) ద్వారా సవాలు చేయవచ్చా అన్నది. విచారణ ముగింపు దశలో న్యాయమూర్తి బీవీ నాగరత్న కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్‌మెహతాను ప్రశ్నించారు. శబరిమల కేసులో పిటిషన్ వేసిన వారు అయ్యప్ప భక్తులేనా అని ఆమె అడిగారు.
దానికి స్పందించిన మెహతా, అసలు పిటిషన్ దాఖలు చేసినది ఇండియన్ యంగ్ లాయర్ అసోసియేషన్ అనే న్యాయవాదుల సంఘమని తెలిపారు. దీనిపై నాగరత్న మాట్లాడుతూ వారు అయ్యప్ప భక్తులు కాదని స్పష్టమవుతోంది. ఒక ఆలయానికి సంబంధం లేని వ్యక్తి అక్కడి సంప్రదాయాన్ని సవాలు చేస్తే కోర్టు అలాంటి పిటిషన్‌ను పరిగణించాలా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మెహతా మాట్లాడుతూ, ఇది ‘నిశ్శబ్దంగా ఉన్న మెజారిటీ, గళమెత్తే మైనారిటీ మధ్య పోరాటం’గా మారిందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రజలకు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోవడం వల్ల ప్రజాప్రయోజన వ్యాజ్యాలు అవసరమయ్యాయని, కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ మరింత అందుబాటులో ఉందని చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ, పీఐఎల్‌లను స్వీకరించే విషయంలో కోర్టులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పిటిషన్ వెనుక నిజమైన కారణం ఉందా? లేదా అన్నది పరిశీలించిన తర్వాతే నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు.
శబరిమల కేసు నేపథ్యం
శబరిమల కేసు నేపథ్యంగా 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4–1 మెజారిటీతో తీర్పు ఇచ్చి, 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. తరువాత 2019 నవంబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని విస్తృతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించి పెద్ద ధర్మాసనానికి బదిలీ చేసింది. మత స్వేచ్ఛ, వివక్ష వంటి అంశాలపై విస్తృత ప్రశ్నలను కూడా అప్పట్లో రూపొందించింది.
‘రాజ్యాంగ నైతికత’పై కేంద్రం అభిప్రాయం
ఇదే విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన వాదనను కూడా వినిపించింది. వ్యభిచారం నేరం కాదని, సమలింగ సంబంధాలను నేర పరిధి నుంచి తొలగించిన కీలక తీర్పులు సరైన చట్టాలు కావని కేంద్రం పేర్కొంది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ‘రాజ్యాంగ నైతికత’ అనేది ఒక భావన మాత్రమేనని, దాన్ని చట్టాల చెల్లుబాటును పరీక్షించే ప్రమాణంగా ఉపయోగించడం సరైంది కాదని అన్నారు. లోకతంత్ర వ్యవస్థలో చట్టాలను రూపొందించేది మెజారిటీ. కాబట్టి చట్టాల చెల్లుబాటును పరీక్షించే సమయంలో సమాజంలోని మెజారిటీ అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు.
రెండు కీలక తీర్పుల ప్రస్తావన
ఈ సందర్భంగా ఆయన రెండు ప్రముఖ తీర్పులను ప్రస్తావించారు.
2018లో జోసెఫ్ షైన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని వ్యభిచారానికి సంబంధించిన సెక్షన్ 497ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అదే ఏడాది నవతేజ్ సింగ్ జొహర్ కేసులో సెక్షన్ 377లోని సమలింగ సంబంధాలను నేరంగా పరిగణించే నిబంధనను కొంతవరకు రద్దు చేసింది.
ఈ తీర్పుల్లో విదేశీ చట్టాలు, అకడమిక్ వ్యాసాలు వంటి అంశాలను ఎక్కువగా ప్రస్తావించడం సరైంది కాదని మెహతా విమర్శించారు. వ్యక్తిగత అభిప్రాయాలు లేదా విదేశీ రచనల ఆధారంగా చట్టాలను నిర్ణయించడం సరైన విధానం కాదని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ, జోసెఫ్ షైన్ తీర్పులో అమెరికన్ న్యాయవేత్తల అభిప్రాయాలు కూడా ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. కేంద్రం తరఫున ఇప్పటికే సమర్పించిన లిఖితపూర్వక వాదనల్లో కూడా జోసెఫ్ షైన్ కేసులో ఇచ్చిన తీర్పు సరైన చట్టంగా పరిగణించరాదని ప్రకటించాలని కోర్టును కోరింది. అయితే వ్యభిచారానికి సంబంధించిన సెక్షన్ 497 చట్టబద్ధతపై ప్రస్తుతం వాదనలు చేయడం లేదని తెలిపింది.
