Let's talk: editor@tmv.in
‘శబరిమల’ మత విశ్వాసాలకు సంబంధించింది.. న్యాయసమీక్ష అవసరం లేదు: కేంద్రం

‘శబరిమల’ మత విశ్వాసాలకు సంబంధించింది.. న్యాయసమీక్ష అవసరం లేదు: కేంద్రం

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో రుతుస్రావ వయస్సులో ఉన్న మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కీలక వాదనలు వినిపించింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు, మతపరమైన సంప్రదాయాలకు సంబంధించినదని, అందువల్ల దీనిపై న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని కేంద్రం పేర్కొంది. మంగళవారం కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్‌‌మెహతా, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ వాదనలు వినిపించారు. మత సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, ప్రతీ అంశాన్ని గౌరవం లేదా వ్యక్తిగత స్వేచ్ఛతో అనుసంధానించలేమని ఆయన అన్నారు.

ఉదాహరణగా, మజార్ లేదా గురుద్వారాకు వెళ్తే తల కప్పుకోవాల్సి వస్తుందని, దాన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధంగా చెప్పలేమని బి.వి. నాగారత్న, ఎం.ఎం. సుందరేష్, అహ్సనుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, అగస్టిన్ జార్జ్ మసిహ్, ప్రసన్న బి. వరలే, ఆర్. మహాదేవన్, జయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. ఒక మత సంప్రదాయం శాస్త్రీయంగా సరైనదా కాదా అనే ప్రశ్న తలెత్తితే దానికి పరిష్కారం శాసనసభ వద్ద ఉండాలి గానీ కోర్టు వద్ద కాదని ఆయన అన్నారు. కోర్టు మతాచారాలను ‘హేతుబద్దమైనదా, ఆధునికమా, శాస్త్రీయమా’అని పరిశీలించడం సరైన రాజ్యాంగ సమీక్ష కాదని కేంద్రం అభిప్రాయపడింది. అలా చేయడం అంటే మత సంప్రదాయాల స్థానంలో న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రతిష్ఠించడం అవుతుందని కేంద్రం పేర్కొంది.

దేశంలో బహుళ మతాలు ఉన్నాయి

‘రాజ్యాంగ నైతికత’ అనే భావన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదని కేంద్రం తెలిపింది. ఇది కోర్టులు అభివృద్ధి చేసిన అస్పష్టమైన భావన మాత్రమేనని పేర్కొంది. దీన్ని విస్తరించడం అంటే రాజ్యాంగ సవరణ చేసినట్టే అవుతుందని కేంద్రం వాదించింది. భారతదేశం బహుళ మత సంప్రదాయాలతో కూడిన సమాజమని, హిందూ, ముస్లిం, క్రైస్తవ తదితర మతాలకు చెందిన వేర్వేరు పంథాలు తమకు తాము ప్రత్యేక విశ్వాసాలు, ఆచారాలు పాటిస్తాయని కేంద్రం పేర్కొంది. కోర్టులకు మతగ్రంథాలపై ప్రత్యేక నైపుణ్యం లేదని కూడా తెలిపింది. విచారణ ప్రారంభంలో కోర్టు న్యాయవాదులను సరైన టైంటేబుల్‌ పాటించాలని సూచించింది. ఇతర అత్యవసర కేసులు కూడా ఉన్నందున అదనపు సమయం ఇవ్వబోమని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

‘మహిళలను మూడు రోజులు అంటరానివారిగా చూడలేం’: జస్టిస్ నాగరత్న

విచారణ సందర్భంగా ధర్మాసనంలోని న్యాయమూర్తి బీవీ. నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను నెలలో మూడు రోజులు అంటరానివారీగా చూడడం, నాలుగో రోజు మళ్లీ సాధారణంగా చూడడం ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. ఇది రుతుస్రావానికి సంబంధించిన అంశం కాదని, శబరిమలలోని నియమం ఒక నిర్దిష్ట వయస్సు గల మహిళలపై మాత్రమే ఉందని తుషార్ మెహతా స్పష్టం చేశారు. దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు.

2018 తీర్పు నేపథ్యం

2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. తరువాత 2019 నవంబర్‌ 14న అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గోగోయ్‌ నేతృత్వంలోని మరో ధర్మాసనం ఈ అంశాన్ని పెద్ద ధర్మాసనానికి పంపించింది. మత స్వేచ్ఛకు సంబంధించిన విస్తృత అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మత విశ్వాసాలను గౌరవించాలి: శశి థరూర్

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ మాట్లాడుతూ చట్టాన్ని వ్యాఖ్యానించే వారు ప్రజల మత విశ్వాసాలను కూడా గౌరవించాలని అన్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామిని ‘నిత్య బ్రహ్మచారి’గా భావించే విశ్వాసం కారణంగానే శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. 2018 తీర్పు తర్వాత ఆ నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకోలేదని, అది ఒక పెద్ద పాఠమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి మార్పులు ఉంటే అవి సమాజంలో క్రమంగా రావాలని, కోర్టులు లేదా ప్రభుత్వాలు బలవంతంగా అమలు చేయడం సరైన విధానం కాదని చెప్పారు. సుప్రీంకోర్టు ఈ కేసులో తుది విచారణను ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభించగా, ఇది ఏప్రిల్‌ 22 వరకు కొనసాగనున్నట్లు సమాచారం.

‘శబరిమల’ మత విశ్వాసాలకు సంబంధించింది.. న్యాయసమీక్ష అవసరం లేదు: కేంద్రం - Tholi Paluku