Let's talk: editor@tmv.in
‘శబరిమల బంగారం’కేసును తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలి: అమిత్ షా

‘శబరిమల బంగారం’కేసును తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలి: అమిత్ షా

Pinjari Chand
12 జనవరి, 2026

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం గల్లంతైన ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రంగా విమర్శించారు. ఈ కేసును తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన ‘మిషన్–2026’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. శబరిమల ఆస్తులను రక్షించలేని వారు ప్రజల విశ్వాసాన్ని ఎలా కాపాడగలరు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేరళలో భక్తుల విశ్వాసాన్ని కాపాడగల శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. శబరిమలలో బంగారం చోరీ ఘటన కేవలం కేరళ ప్రజల సమస్య మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల ఆవేదనగా ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాను చూశానని అమిత్ షా చెప్పారు. ఎఫ్‌ఐఆర్ రాసిన తీరు చూస్తే, నిందితులను కాపాడే ఉద్దేశంతోనే అది తయారుచేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు.

ఇంటింటా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం

ఈ ఘటనలో ఎల్‌డీఎఫ్‌కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అనుమానితులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిష్పక్షపాత దర్యాప్తు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో కాంగ్రెస్‌ను కూడా నిర్దోషిగా వదిలేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయని ఆయన ఆరోపించారు. ఈ కేసును తటస్థ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ ఈ అంశంపై నిరసనలు చేపడుతుంది. ఇంటింటా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం విజయన్. మీరు తప్పకుండా తటస్థ సంస్థతో విచారణకు ఆదేశించాలని అమిత్ షా అన్నారు. ఈ అంశంపై బీజేపీ ఆందోళనలు, ఇంటింటా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

రెండు ప్రత్యర్థి రాజకీయ సిద్ధాంతాలపై వ్యంగ్యంగా స్పందించిన అమిత్ షా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతరించిపోయింది. భారత దేశమంతటా కాంగ్రెస్ పార్టీ ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. కేరళ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు.

మా ప్రయాణం ఎప్పుడూ సులభం కాదు. కేరళలో బీజేపీ విజయం సాధించడం ఒక పెద్ద సవాలే. కమలం గుర్తు కింద కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బీజేపీ ముఖ్యమంత్రిని నియమించడమే మా తుది లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు.

‘శబరిమల బంగారం’కేసును తటస్థ దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలి: అమిత్ షా - Tholi Paluku