
శబరిమలలో బంగారం మాయం కేసులో ముఖ్యమంత్రి పై విమర్శలు
భారతీయ జనతా యువ మోర్చా , బీజేపీ యువజన విభాగం, కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన అక్టోబరు 13, 2025, సోమవారం తిరువనంతపురంలో జరిగింది. వీరి ప్రధాన ఆరోపణ, కేరళలోని అత్యంత ప్రముఖ దేవాలయాలలో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయం నుండి బంగారం దొంగిలించబడటం లేదా అదృశ్యం కావడం. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఆలయ ఆస్తులను రక్షించడంలో విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ నిరసనకు బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నాయకత్వం వహించారు. బీజెపి పార్టీ దీనిని "కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిప్పురవ్వ"గా, "లెఫ్ట్ (వామపక్షం) ఆలయ దోపిడీ, అవినీతి"కి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనగా అభివర్ణించింది.
విజిలెన్స్ నివేదికలో విధానపరమైన ఉల్లంఘనల వివరాలు
ఈ నిరసనలకు మూలం ఏమిటంటే, ట్రావెన్‌కోర్ దేవస్థానం విజిలెన్స్ కేరళ హైకోర్టుకు సమర్పించిన వివరణాత్మక నివేదికలోని అంశాలు . ఈ నివేదిక, శబరిమల శ్రీకోవిల్ (గర్భగుడి) వద్ద ఉన్న ద్వారపాలక విగ్రహాలు, రాగి పలకలకు బంగారం పూత వేసే విషయంలో జరిగిన అనేక తీవ్రమైన అక్రమాలు జరిగాయని , అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వెల్లడించింది.
విజిలెన్స్ నివేదికలోని ముఖ్య అంశాలు:
• బంగారం పూత పనులకు సంబంధించి "తీవ్రమైన విధానపరమైన ఉల్లంఘనలు, అనధికార జోక్యాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను" ఈ నివేదిక హైలైట్ చేసింది.
• ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తికి స్థిరమైన ఆదాయం,అలాగే దేవ స్థానం ప్రకటించిన విధంగా వ్యాపార నేపథ్యం లేనప్పటికీ, అతను అనేక పునరుద్ధరణ, నైవేద్య సంబంధిత పనులలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించారు.
• దేవస్థానం పరిపాలన విభాగంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఉన్ని కృష్ణన్ "అనవసరమైన ప్రభావాన్ని" చూపారని నివేదిక ఆరోపించింది.
• అనేక పనులకు కృష్ణన్ అసలు స్పాన్సర్ కాదని నివేదిక స్పష్టం చేసింది. ప్రధాన ద్వారానికి బంగారం పూతను బళ్లారికి చెందిన వ్యాపారవేత్త గోవర్ధన్ స్పాన్సర్ చేయగా, పైకప్పు (కట్టిల్ల)పై ఉన్న రాగి పలకలకు బంగారం పూతను బెంగళూరులో స్థిరపడిన మలయాళీ పారిశ్రామికవేత్త అజి కుమార్ నిధులు సమకూర్చారు. కృష్ణన్ కేవలం "లావాదేవీలను సులభతరం చేశారు" అని నివేదిక పేర్కొంది.
వివాదానికి దారి తీసిన అంశాలు, కీలక పరిణామాలు
శబరిమల ఆలయంలో బంగారపు పూత (గోల్డ్ ప్లేటింగ్) పనుల్లో జరిగిన అక్రమాలపై కేరళ హైకోర్టు సుమోటో పద్ధతిలో విచారణ చేపట్టింది. ఈ విచారణలో అనేక తీవ్రమైన విషయాలు వెల్లడయ్యాయి
4.5 కిలోల బరువు తగ్గడం
• మొదటిసారి 1999 లో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఆలయానికి విరాళంగా ఇచ్చిన బంగారంతో ద్వారపాలక విగ్రహాలకు గోల్డ్ క్లాడింగ్ (బంగారం పూత) చేశారు. అప్పటి రికార్డుల ప్రకారం ఆ విగ్రహాలపై సుమారు 1.5 కిలోల బంగారం ఉంది.
• రెండవసారి 2019 లో మళ్లీ గోల్డ్ ప్లేటింగ్ (బంగారం పూత) చేయించడానికి ఆ విగ్రహాలను చెన్నైలోని ఒక సంస్థకు తరలించారు. అప్పుడు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఆ విగ్రహాలను కేవలం 'రాగి పలకలు' గా రికార్డు చేశారు.
• కొత్తగా పూత వేసి విగ్రహాలను తిరిగి తెచ్చినప్పుడు, వాటి మొత్తం బరువులో సుమారు 4.5 కిలోల తేడా (తగ్గుదల) ఉన్నట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది.
• అసలైన బంగారు పూత ఉన్న ద్వారపాలక విగ్రహాలను భారీ మొత్తానికి ఎవరికైనా అమ్మేసి, ఆ డబ్బును అక్రమంగా వాడుకున్నారనే బలమైన అవకాశం ఉందని హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అక్రమ మధ్యవర్తి పాత్ర
• నిరసనలకు కేంద్ర బిందువైన ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తికి స్థిరమైన ఆదాయం లేనప్పటికీ, ఆలయ పనుల్లో స్పాన్సర్‌గా ఎలా వ్యవహరించారనే దానిపై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది.
• 2019 లో బంగారం పూత వేసిన తర్వాత మిగిలిన బంగారాన్ని ఒక అమ్మాయి పెళ్లి కోసం వాడుకోవాలని కోరుతూ కృష్ణన్ దేవస్థానం బోర్డుకు ఈమెయిల్ పంపినట్లు నివేదికలో ఉంది. ఆలయ ఆస్తి పట్ల కృష్ణన్ యొక్క దుర్వినియోగాన్ని, దేవస్థానం అధికారుల సహకారాన్ని ఈ విషయం తీవ్రంగా ప్రశ్నిస్తోంది.
• 1999 లోనే బంగారం పూత ఉన్న విషయం తెలిసి కూడా, 2019 లో ఆ విగ్రహాలను 'రాగి పలకలు' గా రికార్డు చేసి, కృష్ణన్ కు అప్పగించడంలో అప్పటి దేవ స్థానం అధికారులు సహకరించారని విజిలెన్స్ నివేదిక నిర్ధారించింది.
హైకోర్టు ఆదేశాలు - సిట్ దర్యాప్తు
ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం కేరళ హైకోర్టు పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ,ఉన్నత స్థాయి అధికారి దీనికి నాయకత్వం వహిస్తారు. ద్వారపాలక విగ్రహాల అక్రమాలపై, శ్రీకోవిల్ పక్క ఫ్రేములు, లింటెల్ లోని బంగారం అదృశ్యంపై రాష్ట్ర పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఉన్నికృష్ణన్ పొట్టిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆలయంలోని అన్ని విలువైన వస్తువుల జాబితా ను తయారు చేయడానికి కోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించింది.
రాజకీయ స్పందన
బీజేపీ నాయకులు, వి. మురళీధరన్‌తో సహా, పలువురు నాయకులు సీపీఐ(ఎం) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దొంగతనంపై ప్రజల నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆందోళనకారులపై దాడి చేయడానికి "బలప్రయోగం" చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలకు ప్రభుత్వo సమాధానం దాటవేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ యువ మోర్చా నిరసనలతో పాటు, ఈ అంశంపై ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి
ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి కూడా రాష్ట్రవ్యాప్త ఆందోళనలను పెంచుతోంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా కేరళ అసెంబ్లీ సమావేశాలు కూడా రసాభాసగా మారాయి. యుడిఎఫ్ ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలపడంతో, ముగ్గురు ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ అవకతవకలకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, శబరిమల దేవస్థానం బోర్డుపై మొత్తం నింద వేస్తూ, మంత్రులు, బోర్డు సభ్యుల రాజీనామా డిమాండ్‌ను సీపీఎం తిరస్కరించింది.
ఈ విధంగా, బంగారం చోరీ ఆరోపణలు కేరళలో ఒక పెద్ద ఆలయ పవిత్రతకు అవినీతి సమస్యగా మారి, రాజకీయ, న్యాయపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి.
