
‘శబరిమల’పై మోడీ మౌనమెందుకు?: రాహుల్ గాంధీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ వాగ్వాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. శబరిమల అంశంపై కేరళ పర్యటనలో మోడీ మౌనం పాటించారని, దీనితో బీజేపీ–ఎల్‌డీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయనే విషయం బయటపడిందని ఆయన ఆరోపించారు. ఇక్కడి అదూర్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సభలో మాట్లాడుతూ, ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, బీజేపీ కలయికతో పోరాడాల్సి వస్తోందని అన్నారు.
ఈ ఎన్నికల్లో మేము ఎల్‌డీఎఫ్‌తో పోటీ పడుతున్నాం. కానీ వారికి పూర్తిగా బీజేపీ మద్దతు ఉంది. ఒకవైపు యూడీఎఫ్ ఉంటే, మరోవైపు సీపీఎం–బీజేపీ కలయిక ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏళ్ల క్రితం ఒక ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మార్కెట్‌లో ‘హిడెన్ హ్యాండ్’ ఉందని చెప్పారని గుర్తుచేసిన రాహుల్, కేరళ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ‘దాగి ఉన్న చేయి’గా వ్యవహరిస్తోందని అన్నారు. దేశంలో బీజేపీకి నిజంగా సవాల్ విసరగలిగే ఏకైక శక్తి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అందుకే యూడీఎఫ్ ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తనపై ఇప్పటికే 36 కేసులు నమోదయ్యాయని, తనను నిరవధికంగా 55 గంటలపాటు విచారించారని చెప్పారు. అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన విమర్శించారు.
ఎల్‌డీఎఫ్ నాయకత్వం అవినీతిలో కూరుకుపోయిందని అందరికీ తెలుసు. కేసులు ఉన్నా బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. విచారణలు కూడా లేవని రాహుల్ అన్నారు. ప్రధాని ఎక్కడికెళ్లినా ఆలయాలు, మతం గురించి మాట్లాడుతారని, కానీ కేరళలోని పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారని ఆయన విమర్శించారు. శబరిమల ఆలయంలో జరిగిన ఘటనలను కూడా ప్రధాని ప్రస్తావించలేదని అన్నారు. ఆలయానికి చెందిన బంగారాన్ని తీసుకుని దాని స్థానంలో ఇత్తడి పెట్టారని ఎల్‌డీఎఫ్ నాయకులపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎల్డీఎఫ్ కార్పోరేట్‌కు మద్దతు ఇస్తోంది
బీజేపీకి నష్టం కలగకుండా ఉండేందుకే ప్రధాని మౌనం పాటించారని ఆయన ఆరోపించారు. ఇది రెండు విషయాలను చూపిస్తోంది. ఒకటి బీజేపీ, ఎల్‌డీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయి. రెండోది నరేంద్ర మోడీకి మతం, హిందుత్వం, ఆలయాలపై నిజమైన ఆసక్తి లేదని అన్నారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వంలా ప్రవర్తించడం లేదని కూడా ఆయన విమర్శించారు. వారి విధానాలు, చర్యలు చూస్తే బీజేపీలా కార్పొరేట్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇది కార్పొరేట్ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వమని ఆరోపించారు. రబ్బరు రైతులకు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సరైన సహాయం అందించడం లేదని ఆయన అన్నారు. గతంలో యూడీఎఫ్ ప్రభుత్వం రబ్బరు రంగాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రబ్బరు రైతులు, కార్మికులను ధరల మార్పుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అలాగే మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆర్థిక వ్యవహారాల విషయంలో మోడీ ప్రభావానికి లోనయ్యారని రాహుల్ మరోసారి ఆరోపించారు. పార్లమెంట్‌లో ఈ విషయం ప్రస్తావించినప్పుడు ప్రధాని సమాధానం ఇవ్వలేదని అన్నారు. ట్రంప్ మోడీని ఎలా నియంత్రిస్తున్నాడో, మోడీ కేరళ ముఖ్యమంత్రిని అలాగే నియంత్రిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
వయనాడ్ నుంచి ఎంతో నేర్చుకున్నా
కేరళ ప్రజలు పర్యావరణాన్ని గౌరవిస్తారని, వివిధ మతాలు, సమాజాలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తాయని ప్రశంసించారు. వయనాడ్ ఎంపీగా పనిచేసిన సమయంలో వినయం, ప్రేమ, పరస్పర గౌరవం గురించి కేరళ ప్రజల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. యువతకు పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన పరిశ్రమలు కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని ఆరోపించారు. కేరళకు బలమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయానికి బలం, మెరుగైన కనెక్టివిటీ, ఐటీ రంగంలో అభివృద్ధి అవసరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు హామీలను అధికారంలోకి వస్తే అమలు చేస్తామని రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు.
