Let's talk: editor@tmv.in
శతాబ్దాల వేదన సమాప్తమైంది:అయోధ్యలో ప్రధాని మోడీ

శతాబ్దాల వేదన సమాప్తమైంది:అయోధ్యలో ప్రధాని మోడీ

Pinjari Chand
26 నవంబర్, 2025

రామ జన్మభూమి అయోధ్య మందిరం పై 191 అడుగుల ఎత్తైన శిఖరం మీద మంగళవారం ధర్మ ధ్వజారోహణం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌ సంఘ్‌ చాలక్ మోహన్ భాగవత్ సంయుక్తంగా కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంతో రామమందిర నిర్మాణం పూర్తి అయినట్టు ప్రకటించారు. ధ్వజారోహణం తర్వాత బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ‘శతాబ్దాల గాయాలు నయం అవుతున్నాయి, వందల సంవత్సరాల వేదన సమాప్తమైంది’ అని అన్నారు. 500 ఏళ్లుగా కొనసాగుతున్న సంకల్పం నేడు నెరవేరిందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరిలో రాముడిని మేల్కోల్పాలి

ధ్వజారోహణం తర్వాత జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ – 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలంటే ప్రతి ఒక్కరిలో రాముడిని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. ‘రాముడు వ్యక్తి కాదు, విలువ. ఈ రోజు కంటే మంచి రోజు మరొకటి ఉండదు, ఈ సంకల్పం తీసుకోవడానికి’ అని అన్నారు. రామభక్తులను, ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరినీ అభినందిస్తూ, అయోధ్య ఎల్లప్పుడూ ఆదర్శాలు ప్రవర్తనగా రూపాంతరం చెందిన భూమి అని మోడీ అన్నారు. శ్రీరాముడి ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రాముడు యువరాజుగా వెళ్లిపోయాడు కానీ 'మర్యాద పురుషోత్తముడు'గా తిరిగి వచ్చాడు. ఋషుల జ్ఞానం, గురువుల మార్గదర్శకత్వం, నిషాద్ రాజ్ స్నేహం, శబరి భక్తి, లెక్కలేనన్ని ఇతరుల నిబద్ధత అతన్ని రూపొందించాయి. అభివృద్ధి చెందిన భారతదేశానికి కూడా ఇదే సమిష్టి బలం అవసరం.

కోవిధార వృక్షం విశిష్టత

ధర్మ ధ్వజంపై ఉన్న కోవిదార వృక్షం, సూర్యుడు, ఓంకార చిహ్నాల గురించి ఆయన వివరించారు. దేశం తన మూలాల నుంచి దూరమైనప్పుడు చరిత్రలో మహిమ కూడా దాగిపోతుందని, ఆలయ ప్రాంగణంలో కోవిదార ప్రతిష్టాపన భారతీయ గుర్తింపుని పునరుద్ధరించడమేనని చెప్పారు. ధర్మధ్వజంపై ఉన్న ఓం, సూర్యవంశ చిహ్నం, కోవిదార వృక్షం ఇవన్నీ రామరాజ్యం విలువలను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ధర్మధ్వజం కేవలం ఓ జెండా కాదు. భారతీయ నాగరికత పునరుజ్జీవనానికి ప్రతీక అన్నారు. 500 ఏళ్ల పాటు సాగిన త్యాగయజ్ఞానికి ఈ రోజు పూర్ణాహుతి అయినట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ఇవాళ సంపూర్ణ భారత్, సంపూర్ణ విశ్వం రామమయం’ అని అన్నారు. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ త్రికోణాకార కాషాయ ధ్వజంపై ఓంకారం, సూర్యుడు, కోవిదార వృక్షం చిహ్నాలు ఉన్నాయి. రాముడు-సీత వివాహ పంచమి అభిజిత్ ముహూర్తంతో ఈ ధ్వజారోహణం సమ్మిళితమైంది.

మెకాలే విద్యావిధానానికి విముక్తి కల్పించాలి

నేడు మాత్రమే ఆలోచించేవారు రేపటి తరాలకు అన్యాయం చేస్తారు. మనం లేనప్పుడు కూడా ఈ దేశం ఉండేది, మనం లేకపోయినా ఉంటుందని అన్నారు. 1835లో మెకాలే ప్రవేశపెట్టిన విద్యా వ్యవస్థ భారతీయ మూలాలను దెబ్బతీయాలనే ప్రయత్నమేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ విద్యా విధానం ప్రవేశపెట్టిన 200 ఏళ్లు పూర్తయ్యే 2035 నాటికి భారత్ ‘దాస్య మానసికత’ నుంచి పూర్తిగా విముక్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరింది

ఈ 11 ఏళ్లలో మహిళలు, దళితులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన తరగతులు, రైతులు, కార్మికులు, యువత – అందరినీ అభివృద్ధి కేంద్రంగా ఉంచామని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, గత 11 ఏళ్లలో ఐదవ స్థానానికి చేరిందని, త్వరలోనే మూడవ స్థానం చేరుకోవడం కూడా సాధ్యమని ఆయన అన్నారు.

త్రేతాయుగ అయోధ్య మానవాళికి నీతి సూత్రాలు ఇచ్చిందని, 21వ శతాబ్దపు అయోధ్య అభివృద్ధికి కొత్త దారి చూపిస్తోందని మోడీ పేర్కొన్నారు. కొత్త విమానాశ్రయం, ఆధునిక రైల్వే స్టేషన్, మెరుగైన కనెక్టివిటీలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. రావణ సంహారానికి రాముడు వాడిన రథంలో ధైర్యం, సత్యం, మంచి ప్రవర్తన, బలం, కరుణ ఉన్నట్టు, అభివృద్ధి భారత్ యాత్రకూ అలాంటి రథమే కావాలని ప్రధాని అన్నారు. రామరాజ్య ఆదర్శాలు దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని, ఇది జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

వలసరాజ్యాల యుగం నాటి వక్రీకరణలు భారతదేశం విదేశాల నుంచి ప్రజాస్వామ్యాన్ని అరువు తెచ్చుకుందనే నమ్మకానికి దారితీశాయని మోడీ అన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి మాతృ దేశమని, అది మన డిఎన్‌ఏలో ఉందని, తమిళనాడులో వెయ్యి ఏళ్ల నాటి శాసనం దీనికి నిదర్శనమని ప్రధాని గుర్తుచేశారు. ఈ మనస్తత్వం జాతీయ చిహ్నాలను కూడా ప్రభావితం చేసిందని, దీని ఫలితంగానే ఇటీవల నావికాదళ జెండాను పునఃరూపకల్పన చేశారని మోడీ అన్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం దాదాపు 45 కోట్ల మంది భక్తులు రామమందిరాన్ని దర్శించుకున్నారని, ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక పరివర్తన తెచ్చిందని పేర్కొన్నారు.

అయోధ్య అంతా రామమయం

వివాహ పంచమి సందర్భంలో అయోధ్య నగరం మంగళవారం ఓ మహా సంస్కృతిక వేదికగా మారింది. రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహించిన ధ్వజారోహణ మహోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్ భగవత్ హజరయ్యారు. ఉదయం నుంచే ‘జై శ్రీరామ్’ నినాదాలతో అయోధ్యకు చేరుకున్న భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. అనంతరం, శిఖరంపై 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో సూర్యచిహ్నం, ‘ఓం’, కోవిదార చెట్టు ప్రతీకలతో అలంకరించిన కాషాయ పతాకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

ఉత్తరప్రదేశ్‌ కళాసాంస్కృతిక వైభవం

రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు 500 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. బ్రిజ్, అవధి, బుందేల్ఖండి, పూర్వాంచల్, తెరై ప్రాంతాల సంప్రదాయ కళారూపాలు నగరమంతటా ప్రతిధ్వనించాయి. మథురా నుంచి మయూర్ నృత్యం, ఝాన్సీలోని రాయ్ నృత్యం, అయోధ్య ప్రాంతానికి చెందిన ఫరువాహి, బధావా, కర్వాహా, లక్నో అవధీ గీతాలు, సోన్ భద్ర నుంచి కర్మ, బరహ్‌సింగా, ప్రయాగ్‌రాజ్‌ నుండి ఢేఢియా, ఆజమ్‌గఢ్‌ నుంచి ధోబీయా, గోరఖ్‌పూర్‌ వంతంగియా నృత్యం ఆకట్టుకున్నాయి. ఒక్కో బృందంలో దాదాపు 15 మంది ప్రదర్శకులు ఉన్నారు. లక్నో భత్‌ఖండే విశ్వవిద్యాలయ సంగీతకారుల శెహనాయ్, సారంగి, ఫ్లూట్, పఖావజ్, సరోద్, సితార్ వాయిద్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూఫీ గానం, భజనాలు, బ్రిజ్ జానపద గాత్రాలు కూడా విస్తృత ఆదరణ పొందాయి. ఈ బృందాల్లో ఏడు నుంచి 12 మంది కళాకారులు ఉన్నారు. మహర్షి వాల్మీకి విమానాశ్రయం నుంచి రామ్ కీ పైడి వరకు ఏర్పాటు చేయబడిన వేదికలు శాస్త్రీయ వాయిద్యాలు, జానపద నృత్యాలు, భక్తి సంగీతంతో ప్రతిధ్వనించాయి. వివిధ జానపద శైలులతో పాటు కథక్ నృత్యాలను ప్రదర్శించే శాస్త్రీయ నృత్య విభాగం సాయంత్రానికి మరింత ఉత్సాహాన్ని నింపింది.

ప్రముఖుల వ్యాఖ్యలు

ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్ కాషాయ పతాకాన్ని ధర్మానికి మార్గదర్శిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 140 కోట్ల భారతీయుల ఆస్తికత, గర్వానికి ఈ మందిరం ప్రతీక అని పేర్కొన్నారు. రామమందిర ధ్వజారోహణం సనాతన సంప్రదాయాల సంకేతం. వివాహపంచమి సందర్భంగా రాష్ట్ర కళారూపాలు ఏకత్వాన్ని ప్రతిఫలించాయి అని మంత్రి జయవీర్ సింగ్ తెలిపారు. కళాకారుల ప్రదర్శనలు త్రేతాయుగ వాతావరణాన్ని గుర్తుచేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయ్‌బరేలీకి చెందిన స్వామి నరోత్తమానంద గిరి ఈ రోజు అపారమైన అదృష్టాన్ని తెచ్చే రోజు అని అన్నారు. తొంభై ఐదు ఏళ్ల సాధువు దేవేంద్రానంద గిరి మాట్లాడుతూ తన జీవితకాలంలో ఆలయం పూర్తవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.

కఠినమైన భద్రతా ఏర్పాట్లు

మొత్తం 6,970 మంది భద్రతా సిబ్బందిని అయోధ్యలో మోహరించారు.ఏటిఎస్‌ కమాండోలు, ఎన్‌ఎస్‌జి స్నైపర్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, బాంబు స్క్వాడ్‌లు, అగ్నిమాపక బృందాలు, వీవీఐపీ సెక్యూరిటీ యూనిట్లు కీలక ప్రాంతాల్లో నియమించారు.

పూజా కార్యక్రమాలు, దేవాలయ నిర్మాణ కళ

నాలుగు రోజుల యజ్ఞం ముగింపు పూజలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అసోమ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పండితులు పాల్గొన్నారు. ప్రధాని రామ్ లల్లా గర్భగృహం,ఇతర ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ బాహ్య గోడలపై వాల్మీకి రామాయణంలోని 87 శిల్పాలు, పరిసర గోడలపై భారత సంస్కృతిని గురించి 79 కంచు శిల్పాలు చెక్కారు.

ఒకేసారి వివాహ పంచమి, గురు తేగ్‌ బహదూర్ వర్థంతి

ప్రధాని కార్యాలయం తెలిపిన ప్రకారం, ఈ తేదీ వివాహపంచమి అభిజిత్ ముహూర్తం కాబట్టి ప్రత్యేకమైంది. 17వ శతాబ్దంలో అయోధ్యలో ధ్యానం చేసిన గురు తేగ్ బహదూర్ వర్థంతి కూడా ఇదే రోజు కావడం విశేషం.