Let's talk: editor@tmv.in
శతాబ్దకాలంగా చారిత్రక వారసత్వాన్ని భద్రపరుస్తున్న మ్యూజియం

శతాబ్దకాలంగా చారిత్రక వారసత్వాన్ని భద్రపరుస్తున్న మ్యూజియం

Dantu Vijaya Lakshmi Prasanna
8 అక్టోబర్, 2025

ఒకసారి మ్యూజియంలో అడుగు పెట్టిన వెంటనే మనం కాలయాత్రలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. ప్రతి వస్తువు ఒక కథ చెబుతుంది, ప్రతి విగ్రహం ఒక యుగాన్ని గుర్తు చేస్తుంది. మన పూర్వీకుల సృజనాత్మకత, సంప్రదాయాలు, చారిత్రక ఘట్టాలను దగ్గరగా చూసే అనుభవం మ్యూజియం ద్వారానే సాధ్యం అవుతుంది. తెలంగాణలోని పురావస్తు మ్యూజియాలు, శిల్పకళా సంగ్రహాలయాలు పర్యాటకులను తమ వైభవంతో ఆకట్టుకుంటాయి. ఒకసారి వీటిని సందర్శిస్తే, మన సంస్కృతి ఎంత గొప్పదో మనసారా తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో నిజాం కాలేజీ కి ఎదురుగా ఉన్న హెరిటేజ్ మ్యూజియం లో కూడా ప్రతి శిల్పం, ప్రతి కళాఖండం, ప్రతి వస్తువు ఒక చరిత్రను మౌనంగా చెబుతుంది. మన సంస్కృతికి దారితీసిన మార్పులు అన్నీ మన కళ్లముందు సజీవమవుతాయి. ఈ మ్యూజియం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబం. పురాతన కాలపు సంపదను కాపాడుతూ, కొత్త తరానికి ఆ విలువలను పరిచయం చేస్తుంది. చరిత్ర, కళ, సంప్రదాయం ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించాల్సిన చారిత్రక సాంస్కృతిక గమ్యస్థానం ఇది.

హెరి**టై**జ్ మ్యూజియం

ఈ మ్యూజియంను డాక్టర్ ఎస్ ధానే 1914లో ప్రారంభించారు. 1914- 2014లకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మ్యూజియం అప్పట్లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఈ భవన సముదాయాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇది రెండంతస్తుల భవన సముదాయంలో కొనసాగుతూ నేటికి 111 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ భవన నిర్మాణం యొక్క నమూనా చిత్రం భవన కార్యాలయం ముందు కనిపిస్తుంది. ఈ మ్యూజియం చుట్టూ అనేక రాతి శిల్పాలు పురాతన శైలిని కలిగి ఉన్నాయి. మ్యూజియంలోకి వెళ్లగానే ముందుగా కాకతీయ తోరణం హుందాగా కనిపిస్తుంది . ఇది శ్రీశైలం నుండి తెప్పించి ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇంకా ఈ భవన ఆవరణలో మ్యూజియంకు సంబంధించిన అధికారుల ఆఫీస్ భవనాలు లైబ్రరీ, ల్యాబ్ ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువును కాలాల వారిగా విభజించి అలమర్లలో అద్దాల సముదాయం మధ్య అత్యంత భద్రంగా అందరికీ కనిపించే విధంగా లైట్లను అమర్చి ప్రదర్శనకు ఉంచారు. వాటి కింద ఉంచిన లేబుల్స్ వస్తువు యొక్క వివరాలను చరిత్రను మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నట్లు తోస్తుంది. ఇక్కడ ఉన్న వస్తువులు అన్ని వివిధ గ్యాలరీల రూపంలో విభజించి ఉంచడం వల్ల వాటి కోసం తెలుసుకోవడం కొంచెం సులభతరంగా ఉంటుంది.ఈ మ్యూజియం గురించిన విశేషాలు ఓ సారి చూద్దాం .

టెర్ర కోట గ్యాలరీ

ఈ గ్యాలరీలో 2500 బి. సి - 1500 బి. సి మధ్యగల కాలం నాటి వస్తువులు ఉంటాయి. అప్పట్లో వీటిని కలకత్తా మ్యూజియం నుంచి తెప్పించినట్లు ఇక్కడ రాసి ఉంటుంది. మొహంజోదారో సింధు నాగరికతకు సంబంధించిన టెర్రకోట కుండలు, ఎద్దుల బండి, లేడి ,ఆడవాళ్ళ చిత్రాలు ఇక్కడ గ్యాలరీలో ప్రత్యేక ఆకర్షణలు. ప్రతి వస్తువు ఆనాటి విజ్ఞానాన్ని నాగరికతను వీటి ద్వారా మనకు తెలియచేస్తున్నట్లు ఈ మ్యూజియం ఉంటుంది.

స్టక్కో గ్యాలరీ: (రెండవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం)

కొండాపూర్ (సంగారెడ్డి జిల్లా) తవ్వకాల్లో లభించిన వస్తువులు ఏలేశ్వరం (నల్గొండ జిల్లా) లో లభించిన వస్తువులు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా అమ్మ తల్లి ,ఆడ మరియు మగ వారి తల బొమ్మలు ,రాముడు బొమ్మలు, వాటితో పాటుగా వివిధ జంతువుల బొమ్మలు ఇక్కడ భద్రపరిచారు. ముఖ్యంగా కోతి, ఏనుగు వంటి బొమ్మలు వీటిలో ప్రత్యేకంగా ఉన్నాయి. . కనిగిరిలో లభించిన మగవాని తల బాగం (రాజు ) బొమ్మతో పాటు బ్రహ్మిలిపి ప్రాకృత భాషలో అక్షరాలు ఇందులో ఉన్నాయి. ఇవి 100-150 పూర్వ కాలాని కి సంబంధించినవి. కీసరగుట్టలో లభించిన గర్బ పాత్ర , పెయింటర్ వేర్, కుండలు ఇక్కడ చూడవచ్చు. గొల్లత్త గుడి లో లభించిన ఆరు ఏడు శతాబ్దం నాటి జంతువులు ,మనుషుల బొమ్మలు ఇక్కడ ఉంచారు. గుంటూరులో లభించిన నిల్చుని వున్న బుద్ధుని చిత్రం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

రాతి శిల్పాల గ్యాలరీ :

ఖైరతాబాద్ లో లభించిన నిల్చుని వున్న బుద్ధుని అలంకృత విగ్రహం , వీరభద్ర విగ్రహంతో పాటు వరంగల్ లో లభించిన 14 వ శతాబ్దపు గరుడ విగ్రహం ఇక్కడ ప్రత్యేక మైనవి. దీన్ని హైదరాబాద్ స్టేట్ మ్యూజియం నుండి తీసుకొచ్చారు. తల మాత్రమే వున్న విష్ణువు విగ్రహం,డమరుకం ఇక్కడ చూడవచ్చు ఈ గ్యాలరీలో ముఖ్యంగా అత్యంత ఆకర్షణీయమైన శిల్పం ఒకే రాతిలో 24 తీర్థంకరులను మధ్యలో మహావీరుని చెక్కబడిన శిల్పం. దీనిని చెక్కిన విధానం నాటి చేతి వృత్తుల వారి పనితనానికి నిదర్శనంగా భావించవచ్చు

మెటల్ గ్యాలరీ :

ఈ గ్యాలరీలో ఎక్కువ బిద్రీ నగిషీ వస్తువులు కనిపిస్తాయి. ఆకట్టుకునే మెటల్ వర్క్ పనితనంతో అతి సూక్ష్మమైన డిజైన్లు కూడా అద్భుతంగా కళాకారులు ఈ బిద్రీ మెటల్ మీద చేయడం జరిగింది. ఈ కళ కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో ఎక్కువగా ఉండేదట.14 వ దశాబ్దంలో అత్యంత ఉన్నత దశలో ఉన్న కళ ఇది. ఈ బిద్రీ వస్తువులలో పువ్వుల డిజైన్స్ తో కనిపించే పనితనం అద్భుతం. నగిషీలు చేసి లతలతో కూడిన తాంబూలంపెట్టె, లక్ష్మీ సమేత సీతారామాంజనేయ విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇది 19 శతాబ్దానికి చెందినవిగా లేబుల్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. . ఈ గ్యాలరీలో ఆకట్టుకునే 18 ,19 శతాబ్దానికి చెందిన గరుడ నాగిని విగ్రహం, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్న బాలకృష్ణుడు, బుద్ధుడు, అలంకృత పాత్ర, వేలాడే దీపాలు, ఆవు, దీపపుకుదురు పుష్పాకృతి కుదురు, బరిసెలు ఇవన్నీ అప్పటి వృత్తి నిపుణుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

దారు శిల్పాల గ్యాలరీ

కొత్త పట్టణంలో లభించిన 17, 18 వ శతాబ్దపు చెక్క బొమ్మలు ఇక్కడ చూడవచ్చు. ఈ గ్యాలరీలో ముఖ్యంగా యుద్ధ సన్నివేశం, శృంగార శిల్పం, అలంకృత దారు చెక్క పెట్టె, దర్వాజా తోరణాలు, తారా శిల్పము చూడదగినవి

మినీ దేవాలయాలు

• వివిధ దేవాలయాల యొక్క నమూనాలతో కూడిన మినీ దేవాలయాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచబడ్డాయి. అందులో ముఖ్యంగా భట్టిప్రోలు ఆంజనేయస్వామి ఆలయం, తుమ్ములూరు శ్రీ ఈశ్వర స్వామి ఆలయం, అటు ఇటు వినాయకుడు ,కుమారస్వామి, మద్య నంది విగ్రహం, శివ లింగం, అమ్మవారు తో ఈ దేవాలయం ప్రత్యేకంగా ఉంటుంది.

• సఖినేటిపల్లి ఈశ్వర, పార్వతి దేవి ఆలయం మహేశ్వరంలో త్రికుటాలయం ఇక్కడ ప్రత్యేకతలు.

• కాకతీయ త్రికుటాలయంలో ఒకే కప్పు కింద సూర్యుడు, వినాయకుడు, శివుడు ఇలా ముగ్గురు ప్రధాన దేవతలు కొలువుతీరి ఉంటారు.

• కర్నూలు జిల్లాలో లభించిన లజ్జ గౌరి 9-10 శతాబ్దం నాటి విగ్రహం ఇక్కడ ఉంటుంది.

• ఈ దేవాలయాల నమూనాలు మధ్య రామప్ప దేవాలయం గుడి నమూనా వివరణ నిజ దేవాలయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. దక్షిణభాగ దేవాలయం ముందు విమాన గోపురం, మండపం ఇవన్నీ అక్కడికి వెళ్లకుండానే మ్యూజియంలోనే నిజంగా చూసిన అనుభూతిని కలిగిస్తాయి.

• ఆలయం ముందు భాగం స్తంభాలపై రకరకాల డిజైన్లు చెక్కి ఉన్నాయి. వాటి వివరణ కూడా తెలుపుతూ లేబుల్ ఏర్పాటు చేశారు. స్తంభం యొక్క క్రింద భాగం నుండి మొదలుపెట్టి పై భాగం వరకు ఉన్న డిజైన్లు ఇలా వివరించి చూపించారు.

• 1. అశ్వపాదం 2. స్తంభభాగం 3. అసస్త్రం 4. మద్యమం 5. కలశం 6. కుండం7. షలికాపద్మం . అలాగే గుడి యొక్క నిర్మాణం వివరణ కూడా అత్యంత వివరణాత్మకంగా తెలుపుతూ లేబుల్స్ ఏర్పాటు చేశారు.

• గుడి నిర్మాణంలో 1. ఉపపీఠము 2. అధిష్టానము 3. పాదవర్గము అను భాగాలు ఉంటాయని ఇక్కడ చిత్రాలు చూసి తెలుసుకోవచ్చు. ఏలేశ్వరంలో జరిపిన త్రవ్వకాల దృశ్యాలు విశేషాలు తో కూడిన చిత్రపటాలు ఇక్కడ ఉంచారు.

• ఈ గ్యాలరీ చివరి భాగంలో అనంతశయన మూర్తి యొక్క రాతి శిల్పం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ లోని విశేషాలు.

తర్వాత మొదటి అంతస్తు ను సందర్శించవచ్చు. అలాగే చరిత్ర యొక్క పునాదులు మ్యూజియాలు అని ఈ మ్యూజియం చూసినప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ చరిత్ర ప్రారంభం నుండి లభించిన వస్తువులు ఉన్నాయి. మానవజాతి పురోగతి చిత్రం ఇక్కడ చూడవచ్చు. శిలాజాలు గా భూగర్భంలో దాచబడిన దారు (వృక్షాలు ) యొక్క శిలాజాల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో లభించిన ఉక్కు శిల యొక్క భాగం ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. క్రీస్తుకు పూర్వం 2,50,000 నుండి 100 వరకు మధ్య గల చరిత్ర కు సంబంధించిన వస్తువులు ఈ గ్యాలరీలో చూడవచ్చు.

నియో లిథిక్ కాలంనాటి ఆనవాళ్ళు

• నియో లిథిక్ కాలం 3000 నుండి 1000 కి మధ్య గల రాళ్లు మరియు ఖనిజాల నమూనాలు ఇక్కడ భద్రపరిచారు.

• చిన్న మారూర్ మహబూబ్ నగర్ త్రవ్వకాల్లో లభించిన వస్తువుల ఆనవాళ్లు పాండవుల గుట్ట లో లభించిన ప్రాచీన శిలాయుగపు కళ క్రీస్తుకు పూర్వం 30000 నుండి 10000 మధ్య ఆనవాళ్లు లభించాయని చెప్పే చిత్రాలు ఈ అంతస్తులో చూడవచ్చు.

• ప్రాచీన సూక్ష్మరాతి యుగపు పనిముట్లు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి.

• బేతంచెర్ల త్రవ్వకాల్లో లభించిన అవశేషాలు, రాళ్ల నమూనాలు, ఘనాపూర్ లో లభించిన పనిముట్లు క్రీస్తుకు పూర్వం 40000- 10000 మధ్య చరిత్రను తెలుపుతున్నాయి.

• నవీన రాతియుగం క్రీస్తుపూర్వం 2500 -1700 మధ్య ఆనవాళ్లు బుడుగుపల్లి, పోలుకొండ, నాగార్జునకొండ దగ్గర జరిపిన త్రవ్వకాల్లో లభించాయి అని తెలిపే చిత్రాలు, మానవుని జీవన గమనంలో ప్లేయోస్పనీస్ మరియు తొలి హెలోసిస్ కాలంలో చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.

• పెద్ద బంకూరు దూళికట్టలో లభించిన కుండలు,పాత్రలు, అత్యంత విలువైన సంపదగా భావించవచ్చు. అక్కడి త్రవ్వకాల్లో నీటి కుండలు, ధాన్య నిలువు చేసే కుండలు, మట్టి పాత్రలు ఎన్నో లభించాయి. అవన్నీ ఇక్కడ భద్రపరిచారు.

• 1970- 76 లో జరిగిన త్రవ్వకాల్లో పెద్ద ఇటుక నిర్మాణాలు, ఇటుక నిర్మాణపు బావులు, రాతి, ఇనుము తయారీ వస్తువులు, విద్దంకి నాణాలు, మట్టిపూసలు, గాజులు, బ్రాహ్మీలిపిలో ఉన్న శాసనాలు, ముద్రికలు లభించాయి.

• క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తుశకం రెండవ శతాబ్దం వరకు పాలించిన శాతవాహనుల కాలంనాటి పాత్రలు ,ఇటుకలు ఆభరణాలు ఇక్కడ భద్రపరిచారు.

• కొండాపూర్ లో లభించిన రోమన్, సీసపు నాణాలు, బౌద్ధ స్తూపం ,రెండుచైత్యాలు ,మట్టి పాత్రలు, నాణాలు ఇక్కడ మ్యూజియంలో కనిపిస్తాయి.

• కీసరగుట్ట త్రవ్వకాల్లో ఇటుకరాతి ఆనవాళ్లు, గదులు చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.

మెగాలిథిక్ కాలంనాటి సమాధులు

మెగాలిథిక్ కాలంనాటి సమాధులు ఈ గ్యాలరీలో చూడవచ్చు.

• అగిరిపల్లి (కృష్ణాజిల్లా), చిన్నమారూరు (మహబూబ్ నగర్) జిల్లాలో ఇవి లభించాయి.గుహ సమాధి సమీపంలో శిలువు ఆకృతి శిలలు, రాతి శవపేటికల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.

• అనంతపురం జిల్లా లో గుంత సమాధిలో లభించిన పాత్రలు ఇక్కడ భద్రపరిచారు. వస్తువులతో పాటు గోడల మీద చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి.

• ఈ పెయింటింగ్స్ లో వారికి సంబంధించిన వివరాలు ప్రాంతపు పేర్లు అందరికీ అర్థమయ్యేలా రాసి పెట్టి ఉంటాయి.

• నిజామాబాద్ జిల్లా గోదావరి నది ఒడ్డున వర్తులాకారపు బండరాళ్ల సమాధులు మధ్య 76- 77 సం లలో జరిపిన త్రవ్వకాల్లో మానవుని అస్థికలతో పాటు ఇనుప అంకుశం, కాల్చిన మట్టితో చేసిన కుక్క ,ఎద్దు వంటి బొమ్మలు, మట్టిపూసలు, రాగిపిడులు లభించాయి.

• రెండు వలయాకారపు గండ్ల వరుసల మధ్య గుంత సమాధిలో స్మారక రాతి స్తంభం లబించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిపిన త్రవ్వకాల్లో ఇది బయటపడింది. ఈ చిత్రాన్ని ఇక్కడ పెయింటింగ్స్ లో చూడవచ్చు.

• గూడు సమాధి చుట్టూ రాతి గోడ , మహబూబ్ నగర్ లోని చాగుటూరులో కనిపించింది. వాటి విశేషాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

• కుండలు కాల్చిన విధానాన్ని బట్టి వాటి లేయర్ ఆధారంగా కాలాన్ని నిర్ణయిస్తారు. ఇక్కడ సిబ్బంది వాటి గురించి వివరిస్తూ, ఎలా వాటిని గుర్తిస్తారో వాటి వివరాలు సందర్శకులకు తెలియజేస్తారు.

వివిద రకాల శవపేటికలు

• తపాలా పెట్టే ఆకారంలో శవపేటికలు, పీపాను పోలిన శవపేటిక, 12 కాళ్లు గల శవపేటిక ఇది గుంటూరు జిల్లాలో లభించింది. ఇవన్నీ ఇక్కడ అద్దాల అరల మధ్య మనకు కనిపిస్తాయి.

• వాటిని చూసినప్పుడు మన పూర్వీకులు మనిషి చనిపోయాక వారిని ఎంత భద్రంగా భద్రపరిచారో వారికి ఎంత విలువ ఇచ్చేవారో తెలుస్తుంది. వారి ఆచారాలు తెలుస్తున్నాయి.

• పై విషయాలన్నీ ఈ మ్యూజియంలో చూశాక వాటి గురించి తెలుసుకున్నాక ఆదిమానవుల కాలం నాటి మానవ నాగరికత ఏ విధంగా ఉంది ఏ విధంగా అభివృద్ధి చెందిందిఅనేది తెలుస్తుంది.

• నేటి సమాజానికి వారి మార్గదర్శనం ఎంత అవసరమో ఆలోచించేలా ఈ వస్తువులు చేస్తాయి. ఇప్పటికన్నాఅప్పటి మన పూర్వీకుల విజ్ఞానం ఎంత ఎక్కువో , వారి నైపుణ్యానికి మనం ఎంత విలువ ఇవ్వగలమో ఆలోచించుకోవాలి.

• ఇప్పుడు కొత్త కొత్త విజ్ఞానం అంటూ కనిపెడుతున్నవన్నీ భూమి గుండ్రంగా ఉందన్నట్లు పూర్వకాలంలో వాడినవే అని తిరిగి స్పష్టమవుతుంది. వారి విజ్ఞానము నైపుణ్యము మనకు నేర్పించే పాఠాలు. ఈ మ్యూజియంలో ఈ తరానికి దిక్సూచి వంటివి అని చెప్పవచ్చు.

అబ్బురపరిచే చిత్రమాలికలు

• మొదటి అంతస్తు నుండి రెండవ అంతస్తుకు వెళ్లే మార్గంలో వివిధ రకాల చిత్రాలు చూపురులను ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఆ పెయింటింగ్స్ చుంగ్ థాయి వేసిన అద్భుత చిత్రాలు . అరబ్బు భాషలో వాటి వివరణ అక్కడ ఉంటుంది.

• మరోవైపు ఒక చిత్రంలో నిరీక్షిస్తున్న మహిళ కనిపిస్తే, ఇంకొక పెయింటింగ్ లో ముస్తాబు అవుతున్న మహిళ ( కల్పిత చిత్రాలు )కనిపిస్తాయి. ఇవి మహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ వేసిన పెయింటింగ్స్ .

• ఇందులో కొన్ని హైదరాబాద్ స్టేట్ మ్యూజియం నుంచి తీసుకొచ్చారు. అక్కడ కూడా ఇలాంటి పెయింట్ గ్యాలరీ ఉంటుంది.

• తరువాత ఇక్కడ వివిధ రకాల జపనీయుల చిత్రాలను చూడవచ్చు వివిధ అలంకారాలతో కూడిన ఈ చిత్రాలు చూపురులను ఆకర్షిస్తాయి విదేశీ చిత్రాలు అయినా విదేశీయుల అలంకరణ వారి అలవాట్లు ఈ చిత్రాలు ద్వారా మనకు తెలుస్తుంది.

• అన్నిటికంటే ప్రత్యేకమైన పాండవుల గుట్ట తిరుమలగిరి కొండలలో రాళ్లపై వేసిన పెయింటింగ్స్ యొక్క చిత్రాలు ఇక్కడ మరింత అందంగా ఉంటాయి.

ఆదిమానవుల ఆనవాళ్ళు

• ఆదిమానవుడు కొండ గుహలో ఉన్నప్పుడు వేసిన చిత్రాలు ఎర్రని రంగుతో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇప్పటికీ ఉన్నాయంటే వాళ్ళు ఆ పెయింటింగ్స్ లో ఎలాంటి రంగు వాడారో ఊహించడం కష్టం.తేనే పట్టు,పెద్ధపులి లాంటి చిత్రాలతో కూడిన పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి.అప్పటి మెగాలిథిక్ కాలంలో ఉన్న వాళ్ళకి ఈ జంతువులన్నీ తెలుసు అనుకోవడానికి వారు గుహలపై కొండలపై వేసిన ఈ చిత్రాలే సజీవ సాక్షాలు. ఇవి వరంగల్ జిల్లాలో గుర్తించారు. నెమలి,బల్లి వంటి చిత్రాలతో పాటు అప్పటి మనుషుల చేతిముద్రలు, జంతువులతో పోరాడుతున్నవీరుల చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. కుంతీదేవి, రాక్ షెల్టర్, పాండవుల గుట్ట చిత్రాలు, ఎద్దుల చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గుహల్లోనే 18 సెంచరీ లో ఒక శాసనం లభించింది.

• దేవర గుట్ట లో లభించిన రాబందు, ఎగిరే పక్షులు, జంతువులు బొమ్మలు ఇక్కడ చూడవచ్చు. బృహత్ శిలాయుగం నాటి మానవుని చేతుల ముద్రలు ఇక్కడ ఉన్నాయి.

• రామచంద్రాపురం పెనుబల్లి ఖమ్మంలో లభించిన రాక్ పెయింటింగ్ చిత్రాలు ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో కొలువు తీరాయి.

ల్యాబ్

ఈ మ్యూజియం కి సంబంధించిన ల్యాబ్ లో ఇక్కడ ఉన్న వస్తువులను భద్రపరచడానికి వాడే రసాయనాలు ఉంటాయి . త్రవ్వకలలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి దొరికిన వస్తువులు ఇక్కడ పరీక్షించి వాటి కాలాన్ని నిర్ణయిస్తారు. తెలంగాణలో ఫణిగిరి లో లభించిన అత్యంత పెద్ద నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం ఇక్కడే వుంచారు. ఇది భారతదేశంలోనే ప్రధమంగా లభించిన అత్యంత పెద్ద బుద్ధుని విగ్రహం.

మ్యూజియం కు సంబంధించిన వస్తువులు యొక్క పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ అనేక గ్రంథాలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అవి స్థానికులకు చరిత్రకారులకు విద్యార్థులకు ఈ గ్రంథాలయం మరియు మ్యూజియం నకు నిరంతరం స్వాగతం లభిస్తూనే ఉంటుంది.

శతాబ్దకాలంగా చారిత్రక వారసత్వాన్ని భద్రపరుస్తున్న మ్యూజియం - Tholi Paluku