Let's talk: editor@tmv.in
శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 9.5 కోట్ల విలువైన 'హైడ్రోపోనిక్ గంజాయి' స్వాధీనం

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 9.5 కోట్ల విలువైన 'హైడ్రోపోనిక్ గంజాయి' స్వాధీనం

Gaddamidi Naveen
2 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్‌లో మరోసారి భారీ స్థాయిలో గంజాయి పట్టివేత కలకలం రేపింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా జరుగుతున్న మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.9.5 కోట్ల విలువైన 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుని, 7మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఖచ్చితమైన సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు, జనవరి 30వ తేదీ తెల్లవారుజామున 1:15 గంటల సమయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు భారతీయ ప్రయాణికులను విమానాశ్రయంలో అడ్డుకున్నారు. నిందితులు తమ చెక్-ఇన్ బ్యాగేజీని విమానాశ్రయం వెలుపల మరో ముగ్గురికి అప్పగిస్తుండగా అధికారులు మెరుపు దాడి చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

లగేజీలో గుట్టుగా నిల్వ

నిందితుల ట్రాలీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, లోపల రహస్యంగా దాచిన అనేక ప్యాకెట్లు బయటపడ్డాయి. అందులో పచ్చటి గోధుమ రంగులో ఉన్న పదార్థం లభ్యమైంది. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించగా, అది అత్యంత ఖరీదైన 'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. సాధారణ గంజాయితో పోలిస్తే, హైడ్రోపోనిక్ పద్ధతిలో (మట్టి లేకుండా కేవలం పోషక ద్రవాలతో నీటిలో పెంచే విధానం) పండించే ఈ గంజాయికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం, 1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? హైదరాబాద్‌లో ఈ డ్రగ్స్‌ను ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.