Let's talk: editor@tmv.in
వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ‘ప్రత్యేక గ్లోబల్’ స్థాయికి భారత్-ఫ్రాన్స్ బంధం

వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ‘ప్రత్యేక గ్లోబల్’ స్థాయికి భారత్-ఫ్రాన్స్ బంధం

Shaik Mohammad Shaffee
18 ఫిబ్రవరి, 2026

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతల మధ్య భారత్-ఫ్రాన్స్ దేశాలు తమ బంధాన్ని మరో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను 'ప్రత్యేక గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యం'గా మారుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న మెక్రాన్‌తో ముంబైలో ప్రధాని మోడీ విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, హైటెక్నాలజీ, పునరుత్పాదక శక్తి, ఆరోగ్య రంగాల్లో సహకారం పెంపొందించేలా మొత్తం 21 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

వినువీధిలో విదేశీ సాంకేతికత.. మేడిన్ ఇండియా జోరు

ఈ చారిత్రక భేటీలో భాగంగా కర్ణాటకలోని వేమగల్‌లో నిర్మించిన 'ఎయిర్‌బస్ హెచ్‌-125’ హెలికాప్టర్ల అసెంబ్లీ లైన్‌ను ఇరు నేతలు వర్చువల్‌గా ప్రారంభించారు. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో కూడా ఎగిరే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ ఇదేనని, దీనిని భారత్ నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని మోడీ ప్రకటించారు. "మా భాగస్వామ్యం సముద్రాల లోతుల నుంచి హిమాలయ శిఖరాల దాకా విస్తరించగలదు" అని ఆయన వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో భాగంగా.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఫ్రాన్స్‌కు చెందిన 'సఫ్రాన్' సంయుక్తంగా భారత్‌లోనే 'హ్యామర్' క్షిపణులను తయారు చేసేందుకు నిర్ణయించాయి. అలాగే భారత సైన్యం, ఫ్రెంచ్ ల్యాండ్ ఫోర్సెస్ మధ్య అధికారుల పరస్పర నియామకంపై మరో ఒప్పందం కుదిరింది.

అస్థిర కాలంలో.. స్థిరత్వ శక్తి

మీడియా ప్రకటనలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రపంచం అనిశ్చితిలో ఉన్న సమయంలో భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం అంతర్జాతీయ స్థిరత్వానికి ఒక శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ నైపుణ్యాన్ని, భారత్ వేగాన్ని కలిపి ఈ బంధానికి అసాధారణ లోతును ఇచ్చామని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించడమే తమ ఉమ్మడి లక్ష్యమని పునరుద్ఘాటించారు.

భారత్–యూరప్ బంధానికి 2026 మలుపు

2026వ సంవత్సరం భారత్-యూరప్ సంబంధాల్లో కీలక మలుపు కానుందని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇటీవల ఐరోపా సమాఖ్యతో కుదుర్చుకున్న అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం వల్ల వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల రాకపోకలకు మరింత ఊతం లభిస్తుందని వెల్లడించారు. ఇదే సమయంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా మార్చేందుకు ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆవిష్కరణలు సహకారంతోనే సాధ్యమవుతాయని మోడీ పేర్కొన్నారు.

భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మెక్రాన్

భారత్ తమకు అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ కొనియాడారు. రఫేల్ యుద్ధ విమానాల నుంచి జలాంతర్గాముల వరకు రక్షణ రంగంలో సహకారం అద్భుతంగా విస్తరిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణలో, ఉగ్రవాద నిరోధంలో భారత్‌తో కలిసి పని చేసేందుకు ఫ్రాన్స్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముంబైలో మెక్రాన్‌కు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. ఈ భేటీతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక బంధం మునుపెన్నడూ లేనంత పటిష్టమైందని దౌత్య వర్గాలు వెల్లడించాయి.