
వ్యవసాయ విలువ పెంపే లక్ష్యంగా బెంగళూరులో ‘అగ్రివాక్’
వాకథన్, ఫిట్ నెస్ వాక్, పింక్ వాక్, పీస్ వాక్, ఎర్త్ వాక్ లాంటివి గతంలో చూశాం. కానీ రైతుల కోసం బెంగుళూరులో వినూత్నంగా ప్రభుత్వం అగ్రివాక్ చేపట్టింది. వ్యవసాయాన్ని కేవలం పంటల ఉత్పత్తికే పరిమితం చేయకుండా, విలువ పెంపు (వాల్యూ అడిషన్) ద్వారా రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్ణాటక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులో ‘అగ్రివాక్’ నిర్వహించారు. కబన్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వయసుల వారైన వందలాది మంది పౌరులు పాల్గొన్నారు. రాబోయే అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన–2026కు ముందస్తు కార్యక్రమంగా ఈ అగ్రీవాక్‌ను నిర్వహించారు.
‘రైతుల సాధికారత కోసం నడక’ అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా విలువ జోడింపు, ప్రాసెసింగ్, బ్రాండింగ్, స్థిరమైన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చెలువరాయస్వామి కబన్ పార్క్ బ్యాండ్‌స్టాండ్ వద్ద అగ్రివాక్‌ను ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ నడక, క్వీన్స్ రోడ్, విధానసౌధ, బీబీఎంపీ టవర్, యూబీ సిటీ సిగ్నల్, విఠల్ మాల్యా రోడ్ మీదుగా సాగి తిరిగి బ్యాండ్‌స్టాండ్ వద్ద ముగిసింది. ఈ అగ్రివాక్‌కు పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు సహా సుమారు 4,000 మంది నమోదు చేసుకున్నారు, ఇది ఆహార వ్యవస్థలు, రైతు సంక్షేమం, ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. నడకకు ముందు జుంబా డాన్స్ సెషన్ను వార్మ్-అప్‌గా నిర్వహించారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ప్యాలెస్ గ్రౌండ్స్‌లోని త్రిపురవాసిని వేదికగా జరగనున్న మూడు రోజుల అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శనలో ఇది భాగమని అధికారులు తెలిపారు.
ముందున్న సవాల్ రైతుల ఆదాయం పెంచడమే
ఈ సందర్భంగా మంత్రి చెలువరాయస్వామి మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయ విధానం ఇప్పుడు కేవలం ఉత్పత్తి నుంచి లాభదాయకత వైపు మారుతోంది. రైతులు తమ పంటలకు ప్రాసెసింగ్ చేయడం, విలువ జోడించడం, నేరుగా మార్కెట్లను చేరుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర ప్రయత్నాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని, ఇప్పుడు ప్రధాన సవాల్ రైతుల ఆదాయం పెంచడమేనని చెప్పారు. యువ రైతులను అగ్రి-ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ విధానంలో కీలక అంశమని తెలిపారు. రాబోయే వ్యవసాయ ప్రదర్శనలో 300కు పైగా స్టాళ్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓస్) స్టాళ్లతో పాటు ఆధునిక యంత్రాలు, ప్రాసెసింగ్ సాంకేతికతలు, వ్యవసాయ విలువ గొలుసు అంతటా కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యంపై అవగాహన ఉన్న ప్రజలు, ఆర్గానిక్ విలువ జోడించిన ఉత్పత్తులకు బలమైన మార్కెట్ ఉన్న బెంగళూరు, భవిష్యత్తులో ప్రాసెస్డ్ అగ్రి ఉత్పత్తులకు గ్లోబల్ హబ్‌గా మారే సామర్థ్యం కలిగి ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
