Let's talk: editor@tmv.in
వ్య‌వ‌సాయ రంగానికి రూ.1,67,877 కోట్లు ఖ‌ర్చు చేశాం: డిప్యూటీ సీఎం భ‌ట్టి

వ్య‌వ‌సాయ రంగానికి రూ.1,67,877 కోట్లు ఖ‌ర్చు చేశాం: డిప్యూటీ సీఎం భ‌ట్టి

Gaddamidi Naveen
11 జులై, 2026

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమం, మహిళా సాధికారతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ఈ సభకు ‘రైతు ఆశీర్వాద సభ’ అని పేరు పెట్టింది స్వయంగా రైతులేనని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘రైతు బంధు’ కింద ఎకరాకు రూ.5,000 ఇస్తూ, ఆ పంపిణీ పూర్తి చేయడానికి 145 నుంచి 169 రోజులు తీసుకునేదని భట్టి విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిందని ప్రకటించారు. ఇప్పటికే 8 ఎకరాల లోపు రైతులకు సాయం అందగా, శుక్ర‌వారం 9 నుంచి 54 ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల (16.87 లక్షల ఎకరాలకు) నిమిత్తం రూ.1,009 కోట్లు విడుదల చేసి ఈ విడత పంపిణీని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగానికి రూ.1,67,877 కోట్ల భారీ నిధులు

గడిచిన రెండున్నరేళ్ల పాలనలోనే వ్యవసాయ రంగానికి ప్రజా ప్రభుత్వం అక్షరాలా రూ.1,67,877 కోట్లు వెచ్చించిందని భట్టి వెల్లడించారు. మహిళలను మహాలక్ష్ములుగా గౌరవించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి రెండున్నరేళ్లలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై బోనస్, పంటల బీమా, నష్టపరిహారం, సాగునీటి పథకాలు తదితర కార్యక్రమాలతో కలిపి మొత్తం రూ.1,67,877 కోట్లు వెచ్చించామని భట్టి వెల్లడించారు. రైతు కష్టానికి భరోసాగా, వ్యవసాయాభివృద్ధికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతు పక్షాన నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు గౌరవం ఇస్తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మొక్కజొన్న, జొన్నలను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు పక్షాన నిలిచిందని గుర్తుచేశారు. నాడు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు నిర్మించిన నాగార్జునసాగర్ జలాలే నేటికీ తెలంగాణ రైతులకు జీవనాధారమని కొనియాడారు.

‘మహాలక్ష్మి’లుగా మహిళల వృద్ధి

గమహిళలను మహాలక్ష్ములుగా గౌరవించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు గతంలో నిలిచిపోయిన వడ్డీలేని రుణాల పథకాన్ని పునరుద్ధరించి, రెండున్నరేళ్లలోనే రూ.67 వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజ్ ద్వారా అందించామని చెప్పారు. వడ్డీలేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, పవర్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాల ద్వారా మహిళలను కోటీశ్వరులైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని భట్టి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
BhattiVikramarkaRevanthReddyRythuBharosaTelanganaFarmersFarmerWelfareTelanganaGovernmentCongressGovernmentAgricultureDevelopment
వ్య‌వ‌సాయ రంగానికి రూ.1,67,877 కోట్లు ఖ‌ర్చు చేశాం: డిప్యూటీ సీఎం భ‌ట్టి - Tholi Paluku