Let's talk: editor@tmv.in
వ్యవసాయ రంగం బలోపేతం కోసం ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’: చంద్రబాబు

వ్యవసాయ రంగం బలోపేతం కోసం ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’: చంద్రబాబు

Dantu Vijaya Lakshmi Prasanna
12 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ అనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థను స్థాపించాలని ప్రతిపాదించారు. బుధవారం అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆరో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ సూచన చేశారు. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగమని, దీనికి ఐటీ రంగం తరహాలో బలమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, జీఎస్డీపీ లక్ష్యాలు, జిల్లాల్లో విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సంస్థ అవసరమని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే వ్యవసాయానికి కూడా ఉన్నత స్థాయి శిక్షణ, పరిశోధన అందించే సంస్థగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలకు ఉన్న విధంగా వ్యవసాయ రంగానికీ బలమైన వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.

ఈ సమావేశంలో సీఎం పరిపాలనలో ఉన్న ప్రాధాన్య అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిపాలనపై సమీక్ష నిర్వహిస్తూ, సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన మధ్య సమతౌల్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నదని సీఎం తెలిపారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత 20 నెలల్లో పరిపాలన వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు కార్యాలయాల్లో కూర్చొని ఫైళ్లపై పని చేసే విధానం ఉండేదని, ఇప్పుడు పరిపాలన వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చి వర్చువల్ వర్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. దీని ద్వారా నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు గ్రామ స్థాయిలో సమర్థంగా అమలవ్వాలని, అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్లకు సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు.

రైతులకు ఆర్థిక సహాయం అందించే ‘అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడతను మార్చి 13న అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

అదే విధంగా ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని రైతు సంఘాలు, నీటి వినియోగ సంఘాలు మరియు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం కోరారు. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభానికి ముందుగానే రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు మే 15న నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

సంక్షేమ గృహ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది లబ్ధిదారులకు ఉగాది కానుకగా సమూహ గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు స్వంత ఇళ్లు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

ఇక వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ‘ఇంద్ర ధనస్సు’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం కింద వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ చార్జీల విషయంలో తొలిసారిగా ‘ట్రూ డౌన్’ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వం రూ.4,600 కోట్ల భారం భరించిందని తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు 39 పైసలు తగ్గించనున్నట్లు కూడా సీఎం వెల్లడించారు.