Let's talk: editor@tmv.in
వ్యవసాయ కార్పొరేషన్లు సమర్థవంతంగా పనిచేయాలి: మంత్రి తుమ్మల

వ్యవసాయ కార్పొరేషన్లు సమర్థవంతంగా పనిచేయాలి: మంత్రి తుమ్మల

Gaddamidi Naveen
2 నవంబర్, 2025

వ్యవసాయ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేషన్‌లు రైతాంగానికి మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. శనివారం ఆయన ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆగ్రోస్) కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తుమ్మల, ఎన్నో దశాబ్దాలుగా రైతుల అవసరాలను తీర్చిన ఆగ్రోస్ ఇటీవల నిరర్ధకంగా మారిందని, దానిని పునరుద్ధరించి మళ్లీ రైతాంగానికి సేవలు అందించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు.

ఆగ్రోస్ వంటి సంస్థలు రైతుల సమస్యలను అర్థం చేసుకుని, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాల్లో మద్దతు ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో కార్పొరేషన్‌ల పనితీరును సమీక్షించి, అవసరమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

మొంథా తుఫాన్ నష్టపరిహారం

మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారని గుర్తుచేశారు. ప్రతి ఎకరాకు రూ.10,000 చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

పత్తి రైతుల అప్రమత్తత

పత్తి రైతులు తేమ శాతం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అధిక తేమ శాతం వల్ల పత్తికి తగిన మద్దతు ధర లభించదని, కాబట్టి పత్తిని సరిగ్గా ఆరబెట్టి మార్కెట్‌యార్డులకు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు.తేమ శాతం 12శాతం మధ్యలో ఉంటే పత్తిని సరైన నాణ్యతగా పరిగణించి, పూర్తి మద్దతు ధర చెల్లిస్తారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం అని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని కార్పొరేషన్‌లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు.

వ్యవసాయ శాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రధాన కార్పొరేషన్‌లు సంస్థలు

• తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

ఇది రైతులకు వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, పరికరాలు సరఫరా చేసే సంస్థ.

• తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

ఈ సంస్థ రైతుల‌కు నాణ్యత కలిగిన విత్తనాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

• తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ ఫెడరేషన్

ఇది వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలను సమన్వయం చేసే సంస్థ.

• తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్‌ సీడ్స్ గ్రోవర్స్‌ ఫెడరేషన్

నూనె గింజల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మరియు రైతులకు మద్దతు సేవలు అందించే సంస్థ.

• తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

ఇది రైతులు పండించిన‌ పండ్లు, కూరగాయలు, తోట పంటల అభివృద్ధి, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాల ఏర్పాటులో భాగమయ్యే సంస్థ.

• తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్

రైతులకు మైక్రో ఇరిగేషన్ (డ్రిప్, స్ప్రింక్లర్) పద్ధతుల అమలులో సాంకేతిక మద్దతు అందిస్తుంది.

• తెలంగాణ స్టేట్ సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ

విత్తనాల నాణ్యత సర్టిఫికేషన్, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రమాణీకరణ నిర్వహించే సంస్థ.

• తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు

రైతులు పండించిన పంట‌ను మార్కెట్లో అమ్మ‌డానికి స్థ‌లం, సంక్షేమ బోర్డు, రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ, ఆధునీకరణ బాధ్యత కలిగిన సంస్థ. ఈ సంస్థలు రైతు సంక్షేమం, ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్, సాంకేతిక సహకారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.