Let's talk: editor@tmv.in
వ్యవసాయ అభ్యున్నతి–గ్రామీణ వికాసానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలకం

వ్యవసాయ అభ్యున్నతి–గ్రామీణ వికాసానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలకం

Panthagani Anusha
4 డిసెంబర్, 2025

రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం నల్లజర్లలో నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి జరిగిన సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి ముందుగా ప్రాంతీయ వ్యవసాయ యాక్షన్ ప్లాన్‌ను సమీక్షించారు. ప్రధాన పంటలు, అంతర పంటలు, నీటి భద్రత, సాగు విధానాలు వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. దీర్ఘకాలిక నీటి సదుపాయాల కోసం చేపట్టాల్సిన చర్యలపై రైతులతో చర్చిస్తూ, భూగర్భ జలాలను పెంచేందుకు శాస్త్రీయ పద్ధతులను అన్వేషించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారిన రైతులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఆధునిక సాగు పద్ధతులను అనుసరిస్తూ ముందుకు వస్తున్న రైతులను సన్మానించి, ఆయిల్ పామ్ సాగు వ్యర్థాలను ఎరువులుగా వినియోగించుకునే అవకాశం ఉందని సూచించారు. పామాయిల్ తోటల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలను ఇతర ప్రాంతాలకు మార్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, దానికి బదులుగా మైక్రో న్యూట్రియెంట్స్ వినియోగిస్తే దిగుబడి పెరగడంతో పాటు ప్రీమియం ధరలు కూడా లభిస్తాయని సీఎం సూచించారు. పోలవరం మరియు తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా ప్రాంతానికి తగిన నీటిని అందిస్తూ సాగుకు మద్దతు ఇస్తామని తెలిపారు.

పశుసంవర్ధక రైతుల కోసం ప్రత్యేక భూమిని కేటాయించి సామూహికంగా పశుగ్రాసాన్ని పండించాలని సీఎం సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను నరేగా పథకం ద్వారా అందిస్తామని ప్రకటించారు. ఇలా చేస్తే పాడి రైతులకు గడ్డి కొరత ఉండదని ఆయన అన్నారు.

వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పడం అత్యవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అగ్రో–ప్రాసెసింగ్ యూనిట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని రైతులను ప్రోత్సహించారు. “ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులు కూడా పరిశ్రమలు ప్రారంభించాలి” అని ఆయన తెలిపారు. ఇందుకోసం రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఒకప్పుడు మెట్ట ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి డెల్టా ప్రాంతాలను మాత్రమే ప్రోత్సహించారని విమర్శించిన సీఎం, ఇప్పుడు మెట్ట ప్రాంతాల పంటలకు మంచి మార్కెట్ డిమాండ్ ఉందని చెప్పారు. ప్రాంతీయ సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికను శాస్త్రీయంగా చేసుకోవాలని రైతులను కోరారు.

మునుపటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జరిగిన అవకతవకల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు విమర్శించారు. ఆ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసి అయోమయం

వైపు నెట్టిందని, ఆ ప్రభావాల నుంచి రాష్ట్రాన్ని బయటకు తేవడానికి కూటమి ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రైతుల్లో చాలామంది చదువుకున్నవారని వారు వ్యవసాయం తోపాటు సేవారంగం, వ్యాపారరంగాల్లో అవకాశాలు అన్వేషించాలని సీఎం సూచించారు. వ్యవసాయం మరియు గ్రామీణ పరిశ్రమలను సమాంతరంగా అభివృద్ధి చేస్తే కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన అన్నారు.

రైతు ఉత్పత్తిదారుల సంస్థలు

రైతులను సమూహంగా చేర్చి వారి పంట ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాల్లో సహకారం అందించే సంస్థలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అంటారు. ఈ సంస్థల ప్రధాన లక్ష్యం చిన్న, మధ్యతరహా రైతులను సమూహంగా కలిపి వారి శక్తిని పెంచడం, పంటలకు మంచి ధర పొందడం, వ్యవసాయ కార్యకలాపాలను వ్యాపారరూపంలో అభివృద్ధి చేయడం.

రైతులకు ఈ సంస్థల ద్వారా ఎరువులు, విత్తనాలు, యంత్రాలు చవకగా లభించడంతో పాటు, పెద్ద మొత్తంలో పంటలను అమ్మడం ద్వారా మార్కెట్ రేట్లను పెంచుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు, సబ్సిడీలు పొందడం సులభం అవుతుంది.అదేవిధంగా రైతులకు శిక్షణ, సాంకేతిక సహాయం పొందడం తో వ్యవసాయ నైపుణ్యాలు పెరుగుతాయి. రైతుల, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ విలువ పెంపుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.

వ్యవసాయ అభ్యున్నతి–గ్రామీణ వికాసానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలకం - Tholi Paluku